తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒకటి. ఇటీవల బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాస్, క్లాస్ కథ ఏదైనా బాలకృష్ణ తనదైన శైలిలో నటించగలరు. ఇక మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలను తీయడంలో అనిల్ తనకు తానే సాటి. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేశ్ బాబు (Mahesh Babu)ను ఎలా చూపించారో అందరికీ తెలిసిందే.
మరి బాలయ్యను ఎలా చూపిస్తారోనని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో బాలకృష్ణ తెరపై కనిపించనున్నారట. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా ఎనర్జెటిక్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ యువ కథానాయకులతో పోటీ పడుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా తర్వాత వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
తుదిదశలో 'అఖండ'..
బాలకృష్ణ - బోయపాటి (Balakrishna - Boyapati) హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అఖండ' (Akhanda) చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయింది. తొలుత మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా థియేటర్లు మూసేయడం సహా చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల రిలీజ్‌ను వాయిదా వేయాల్సివచ్చింది. మరోవైపు 'అఖండ' టీజర్‌కు యూట్యూబ్‌లో విశేషాదరణ దక్కుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న టీజర్‌గా 'అఖండ' నిలిచింది. టీజర్‌లోని బాలకృష్ణ చెప్పే డైలాగ్‌లు అభిమానులను అలరించాయి. టీజర్ తెచ్చిన క్రేజ్‌తో బాలయ్య అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నారు.
'ఎఫ్3'తో అనిల్ బిజీ..
అటు అనిల్ రావిపూడి 'ఎఫ్3'ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. 2019 సంక్రాంతికి విడుదలైన 'ఎఫ్2'కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాతృకలో నటించిన వెంకటేశ్, వరుణ్‌తేజ్‌తో పాటు ఇందులో మరో హీరో కూడా నటిస్తారనే చిత్రబృందం వెల్లడించింది. ఆ పాత్రలో సునీల్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కూడా దిల్‌రాజ్ నిర్మిస్తుండగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి.. Balakrishna: 'అఖండ'.. జులై నుంచి హైదరాబాద్‌లో!