విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి చెందింది. ఆమె మరణం దేశానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ సినీ ప్రముఖులు. అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, అక్షయ్‌కుమార్ సుష్మాకు నివాళి తెలిపారు.
"ఇది చాలా బాధాకర విషయం. సుష్మా శక్తిమంతమైన రాజకీయ నాయకురాలు. ఆమె మంచి సామాజిక వేత్త. గొప్ప వక్త. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా." అని అమితాబచ్చన్ ట్వీట్ చేశారు.
"చాలా నిజాయితీ గల నాయకులు సుష్మాస్వరాజ్. ఈ వార్త విని షాక్ తిన్నాను. ఆమె ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు" అని బాలీవుడ్ దిగ్గజ గాయని లతామంగేష్కర్ పోస్ట్ చేశారు.
"సుష్మాజీ.. మిమ్మల్నీ చాలా మిస్ అవుతున్నాం" అని లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ట్వీట్ చేశారు.
"సుష్మాతో స్నేహపూర్వక సంబంధముంది" అంటూ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నటి షబానా అజ్మీ.
"సుష్మా స్వరాజ్ మృతి చాలా బాధాకరం. ఆమెకు ఎవరూ సాటిరారు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని రచయిత జావేద్ అక్తర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
"సుష్మ చాలా శక్తిమంతమైన నాయకులు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పోస్ట్ చేశాడు.
వీరే కాకుండా కరణ్‌జోహార్, అర్జున్ కపూర్, అనుష్క శర్మ, ధనుష్, అనిల్ కపూర్ లాంటి సినీ ప్రముఖులు సుష్మాస్వరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సుష్మ.. మంగళవారం అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 67 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు సుష్మ.
ఇది చదవండి: 'జాతీయ రాజకీయాల్లో సుష్మాది చెరగని ముద్ర'