స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. 'అల వైకుంఠపురములో' అంటూ వచ్చి ఈ సంక్రాంతికి బ్లాక్బస్టర్ కొట్టాడు. ఇందులోని పాటలు 'సామజవరగమన', 'బుట్టబొమ్మ', 'రాములో రాములా', 'సిత్తరాల సిరపడు'.. యూట్యూబ్లో సంచలన సృష్టించాయి. మిలియన్ల కొద్ది వీక్షణలు సాధించి, సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సంగీత దర్శకుడు తమన్ రూపొందించిన గీతాలు.. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఆల్బమ్లలో ఒకటిగా దీనిని నిలబెట్టాయి. అయితే ఈ విషయంపై నేడు అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశాడు. తమన్ చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని రాసుకొచ్చాడు.
'అల వైకుంఠపురములో' ఆల్బమ్.. ఇప్పటివరకు 1.13 బిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమాను త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మురళీశర్మ, సముద్రఖని, జయరామ్, టబు వంటి నటీనటులు కీలకపాత్రల్లో మెప్పించారు.