"వెబ్‌సిరీస్ అయినా, సినిమా అయినా బలమైన కథ ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు. మా ప్రొడక్షన్‌లో డిజిటల్ తెరలపై చేయడానికి మేం కూడా కథలు వింటున్నాం. కామెడీ జోనర్‌లో ప్రయత్నించాలనుకుంటున్నాం" అన్నారు అల్లరి నరేష్. తనదైన హాస్యంతో వెండితెరపై నవ్వులు పూయించిన ఈ కథానాయకుడు 'నాంది' చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో నటించారు. నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ప్రత్యేక ముఖాముఖి మీకోసం.
రికార్డు బ్రేక్ చేయాలని కాదు..
'అల్లరి' సినిమా చేసేటప్పుడు అయిదు సినిమాలు చేస్తానేమో అని అనుకున్నా. అలా ఇప్పటివరకు 56 చిత్రాలు పూర్తిచేశా. నావి కామెడీ చిత్రాలు. ఇవి నలభై నుంచి యాభై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంటాయి. జన సమూహం, యాక్షన్ సినిమాలు తీయడానికి ఎక్కువ సమయం అవసరం. నా సినిమాల్లో ఎక్కువగా ఫైట్లు ఉండవు, ఉన్నా అవి హాస్యాన్ని పండించేవే కాబట్టి త్వరగా షూటింగ్ అయిపోతుంది. ఒక సినిమా పట్టాలపై ఉన్నప్పుడే నేను మరో రెండు చిత్రాలకు సన్నద్ధమవుతా. కానీ ఎక్కువ సినిమాలు తీసి రికార్డు బ్రేక్ చేయాలని ఉండదు. వంద సినిమాలు చేయాలనుకుంటా. వయసున్నప్పుడే పరుగెత్తాలనేది నా సిద్ధాంతం.
ప్రయోగం కాదు...
'నాంది' సినిమా ప్రయోగం కాదు. ఇది నేనెప్పుడూ చేయని జోనర్ అంతే. 'నాంది' మంచి కథ. ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే, ఎలాంటి ఆందోళన, అయోమయానికి గురవుతాడనేదే సినిమా కథాంశం. ఇంకా పదిహేను రోజుల చిత్రీకరణ ఉంది. కానీ అవి జనసందోహంతో తీసేవి. వాటిని ప్రభుత్వ నిబంధనలతో ఇప్పుడు తీయలేం. ప్రయోగం అంటే 'లడ్డు బాబు'. నేను నా మొహాన్ని దాచుకొని కొత్త మొహంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి వచ్చింది.
హిట్టు సినిమాలు ముట్టుకోను...
'సుడిగాడు' చిత్రానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాం. కానీ ఆ చిత్రాన్ని అప్పటికి పన్నెండేళ్ల కంటే ముందు వచ్చిన సినిమాల్లోని సీన్లకు స్పూఫ్‌గా చేశాం. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోకి స్పూఫ్‌లు, మీమ్స్ ఇంకా రాలేదు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడేదైనా జరిగితే రేపే దానికి అనుకరణ వచ్చేస్తోంది. అందుకే ఇప్పుడు దాని సీక్వెల్ చేయడం కష్టం. లాక్‌డౌన్‌లో కొందరు 'జంబలకడిపంబ' సీక్వెల్ చేయమన్నారు. కానీ ఆలోచన వేరు, దాన్ని అమలు చేయడం వేరు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఒక సినిమా హిట్టయ్యాక దాన్ని మళ్లీ ముట్టుకోకూడదు.
దర్శకుడినవుతా..
"నాన్న నన్నెప్పుడూ దర్శకునిగా చూడాలని అనుకునేవారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసిన వాళ్లే నా స్నేహితులు. సినిమాల్లో నాకు నటించాలని ఉంది అని చెప్పినప్పుడు నాన్న షాకయ్యారు. కానీ వద్దని చెప్పలేదు. కానీ నువ్వు కనీసం ఒక్క సినిమాకైనా దర్శకత్వం చేయాలని అనేవారు. ఆయన కోరిక తప్పకుండా నెరవేరుస్తా. ఒక ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తా. నేను ఎంతో మంది దర్శకులతో పనిచేశా. వాళ్లందరికీ ఒక్కో రకమైన శైలి ఉంటుంది. అలా నేనూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌తో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">