కరోనా ప్రభావంతో సినీ రంగమూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా సినిమాల షూటింగ్‌లు, విడుదల వాయిదాలు పడుతున్నాయి. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లను ఈనెల 31వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ వైరస్ వల్ల ఓ ముఖ్యమైన రోజునూ జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు నటుడు అడివి శేష్. ట్విట్టర్ వేదికగా తన బాధను పంచుకున్నాడు.
"నేడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. మా చిత్రబృందానికి, దేశానికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఆయన జీవితం, త్యాగం నాకో పాఠం, స్ఫూర్తి. ఇంత గొప్పరోజు 'మేజర్' సినిమాకు సంబంధించిన భారీ ప్రకటన చేయాలనుకున్నాం. కానీ కొవిడ్-19, మా ప్రణాళికలు నాశనం చేసింది. త్వరలో మీకు అప్డేట్ చేస్తాం" -అడివి శేష్ ట్వీట్
'గూఢచారి', 'ఎవరు' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత శేష్ నటిస్తున్న సినిమా 'మేజర్'. 26/11 దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. సోనీ పిక్చర్స్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.