'సమ్మోహనం' చిత్రంలో.. సమీరగా 'అంతరిక్షం'.. లో రియాగా, తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి అదితీరావ్ హైదరి. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించిన ఈ హైదరాబాదీ అమ్మాయి పలు దక్షిణాది చిత్రాల్లోనూ సందడి చేస్తోంది. నాని, సుధీర్‌బాబు, ప్రధాన పాత్రల్లో నటించిన 'వి' చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ భామ నటించిన మలయాళ చిత్రం 'సుఫియుమ్ సుజాతయుమ్' ఇటీవలే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ సందర్భంగా అదితి చెబుతున్న కబుర్లివి..
"నాకు థియేటర్లో సినిమా చూడటమే ఇష్టం. నా సినిమాలు థియేటర్లో విడుదలైతేనే ఆనందం. థియేటర్ అంటే ఓ మ్యాజిక్. అదే సమయంలో కొన్ని చిత్రాలకు ఓటీటీలు చక్కటి వేదికలు. నేను నటించిన 'సుఫియుమ్ సుజాతయుమ్' థియేటర్ కోసమే సిద్ధం చేసిన సినిమా. అయితే, ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. మొదట్లో ఓటీటీ విడుదల అంటే నాకు నచ్చేది కాదు. కానీ మా చిత్రం ఇంతమందికి చేరువయ్యాక నాకు విషయం అర్థమైంది."
"'వి' చిత్రం గురించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడను. ఈ సినిమాలో నా పాత్ర గురించి కూడా ఏమీ చెప్పను. ఇదో థ్రిల్లర్ సినిమా కాబట్టి కొంచెం మాట్లాడినా ప్రేక్షకులకు ఆ థ్రిల్ పోతుంది."
"నేను 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' చిత్రంలో పరిణితీ చోప్రా, కృతి కల్హరితో కలిసి నటిస్తున్నా. ఈ ఇద్దరితో కలిసి షూటింగ్లో పాల్గొనడం నిజంగా చాలా సరదాగా ఉండేది. దర్శకుడు రిబూదాస్ గుప్తా గత చిత్రాలు నేను చూశా. ఈ సినిమాను అంతకంటే చక్కగా తీశారు."
"దుల్కర్ సల్మాన్‌తో కలిసి 'హే సినామికా' అనే తమిళ చిత్రం చేస్తున్నా. ఆ తర్వాత విజయ్ సేతుపతితో 'తుగ్లక్ దర్బార్'లో నటించాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలైనా నేను ఇంకా సెట్లోకి అడుగు పెట్టలేదు. వీటితో పాటు తెలుగు, హిందీ చిత్రాలనూ ఒప్పుకున్నా."
ఇదీ చూడండి: స్టోక్స్ జెర్సీపై భారత వైద్యుడి పేరు