ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది, టాలీవుడ్లో అగ్రహీరోలతో నటించిన తార విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమైంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు'లో ఫ్రొఫెసర్ భారతి పాత్రను పోషిస్తోంది. దీపావళి సందర్భంగా ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది విజయశాంతి.
- ఇన్నేళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంతకం చేశారు. ఈ పాత్ర మిమ్మల్ని ఎందుకు ఆకర్షించింది?
"దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ సినిమా కథ చెప్పినప్పుడు రెండున్నర గంటలపాటు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వాను. ఆ తర్వాత నా పాత్ర గురించి మరోసారి చెప్పండని అడిగి రెండోసారి చెప్పించుకుని విన్నా. ప్రొఫెసర్ భారతి పాత్ర చాలా మంచి క్యారెక్టర్. ఇన్నేళ్ల విరామం తర్వాత నా రీఎంట్రీకి తగ్గ రోల్. ఈ పాత్ర లుక్ కోసం చాలా కష్టపడ్డా. రోజుకు రెండు గంటలపాటు జిమ్‌లో శ్రమించా. రెండు నెలల్లో 10 కేజీలు తగ్గా" -విజయశాంతి, నటి
- ఇకపై మీ ప్రాధాన్యం రాజకీయాలా? సినిమాలా?
"రాజకీయాలకే నా తొలి ప్రాధాన్యం. పూర్తి అంకిత భావంతో చేయాల్సిన పని అది. సినిమాల్లో నచ్చిన పాత్ర వస్తే చేస్తాను, లేకపోతే లేదు. రాజకీయాల్లో అలా కాదు. సినిమా అంటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం.. రాజకీయాలంటే జనం కోసం పని చేయడం. కాబట్టి నేను ఎప్పటికీ రాజకీయాల్లోనే ఉంటాను" -విజయశాంతి, నటి
ఈ సినిమాలో మహేశ్.. మేజర్ అజయ్‌కృష్ణగా కనిపించనున్నాడు. రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: కాలం మారినా.. మహేశ్ వ్యక్తిత్వం చెక్కుచెదరలేదు: విజయశాంతి