విలక్షణ నటుడు కమల్‌హాసన్ కుమార్తెగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టినా.. కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. తండ్రికి తగ్గ తనయ అని ఎప్పుడో అనిపించుకుంది. ప్రభాస్ 'సలార్'తోపాటు బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌తో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది.
వరుస సినిమాలతో మళ్లీ జోరు పెంచినట్టున్నారు..?
మధ్యలో కొంత విరామం తీసుకున్నా. ఆ సమయంలోనే నేను సినిమాలు చేయలేదు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ప్రత్యేకంగా జోరు పెంచడం తగ్గించడం అంటూ ఏమీ ఉండదు. మంచి కథ, పాత్ర అనుకున్నప్పుడు చేయడానికి సిద్ధమవుతుంటా. 'క్రాక్'కు ముందు నా కెరీర్ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. వాటినే పట్టించుకుని కూర్చునుంటే నేను మళ్లీ కెమెరా ముందుకు రాలేను. నేనేమిటి? నా కెరీర్ ఇంకా ఎంత ఉందనే విషయం నాకే తెలుసు. నటన పరంగా నాకు ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి.
నటన పరంగా చాలా ఆలోచనలు ఉన్నాయంటున్నారు. అవేమిటి?
'సింగం' చేస్తున్నప్పుడు నేను సంగీతం పరంగా చదువుకున్నాను. నటన పరంగా ఏమీ చేయలేదే అనే ఆలోచన వచ్చింది. లండన్ వెళ్లి కోర్స్‌లో ప్రవేశించా. అప్పట్నుంచి నేను సినిమాని చూసే కోణమే మారిపోయింది. ఒక పాత్రని అర్థం చేసుకునే విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి. ఆ మార్పుని నేను చూపెట్టాలి కదా.
నటిగా మీపై మీకు ఎప్పుడు నమ్మకం ఏర్పడింది మరి?
'సెవెన్త్ సెన్స్' సినిమా కోసం మురుగదాస్‌తో కలిసి ప్రయాణం చేశాకే! ఆ సినిమా కథ విన్నాక 'ఇంత పెద్ద పాత్ర, నేను చేయగలనా' అని భయపడుతూ చెప్పా ఆయనకి! 'నాకు నమ్మకం ఉంది, మరి నీకెందుకు లేదు?' అని అడిగారాయన. ఆ మాట నాపై బాధ్యతని పెంచింది. దర్శకులు నన్ను నమ్మితే ఇంకా బాగా పనిచేస్తానని ఆ సినిమాతో అర్థమైంది. అప్పట్నుంచి నన్ను నేను నమ్మి అడుగేయడం అలవాటైంది. అయితే నా విజయంలో తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమ పాత్ర చాలా ముఖ్యమైనది. నన్ను మొదట స్వీకరించింది తెలుగు ప్రేక్షకులే. నాకు తొలి విజయం దక్కింది ఇక్కడే. అందుకే ఎన్ని భాషల్లో నేను నటిస్తున్నా.. తెలుగులో నటించడాన్ని ప్రత్యేకంగా భావిస్తా.
బాలకృష్ణ.. చిరంజీవిలాంటి సీనియర్ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ఒప్పుకొంటున్నారు. ఆ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
సీనియర్లు, యువ హీరోలు అనే లెక్కలేవీ నేను వేసుకోను. కథ, పాత్రలు నచ్చితే చేస్తా. 12, 13 ఏళ్ల ప్రయాణం తర్వాత నేను ఇంకా నాటి ఆలోచనలతో ఉంటే ఎలా? నా కెరీర్‌ని గమనిస్తే ఎవరూ చేయని సాహసాలు చేశా. కొత్త ప్రయత్నం చేసిన ప్రతిసారీ రకరకాల సందేహాల్ని వెలిబుచ్చుతూ భయపెట్టారు. నేను అస్సలు భయపడకుండా చేయాలనుకున్నదే చేశా. బాలకృష్ణ సినిమాలో మరో గమ్మత్తైన పాత్ర చేస్తున్నా. చాలామంది దర్శకులతో కలిసి పనిచేశాను కానీ, గోపీ నన్ను ఎక్కువగా నమ్ముతుంటారు. ఒకరు నీ ప్రతిభని నమ్మడం అంటే నా దృష్టిలో అదొక గొప్ప బహుమానం.
"కరోనా దశ తర్వాత మరింత కృతజ్ఞతతో మెలగడం అలవాటైంది. ఇదివరకు చేతినిండా పని దొరికినా, ఓ గొప్ప ఫలితం చేతికందినా దాన్ని గర్వంగా స్వీకరించేవాళ్లం. దాని విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఇష్టపడేవాళ్లం కాదు. కానీ కరోనా తర్వాత పని చేయడానికి వెళ్లే అవకాశం దొరికినా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తోంది. కరోనాతో అందరికీ ఒకే పరిస్థితులు ఉన్నాయి కానీ, పిల్లల విషయంలోనే నాకు ఎక్కువగా ఆందోళనగా ఉంది. వాళ్ల వ్యక్తిత్వం నిర్మాణమయ్యేది ఇప్పుడే కదా. వైరస్‌వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అది చిన్నారులపైనా, వాళ్ల తల్లిదండ్రులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది"
-- శ్రుతిహాసన్, సినీనటి
ఈ నెలలోనే మీ పుట్టినరోజు. వయసుపై మీ అభిప్రాయమేమిటి?
ఎంత దాచినా దాగనిది వయసు. వయసుకి తగ్గట్టుగా మనుషులు మారుతుంటారు. శారీరకంగా నాలోనూ పెద్దఎత్తున మార్పులు వచ్చినా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. వయసులో ఉన్న అందం అదే కదా. దాన్ని నిజాయతీగా స్వీకరించాలి. కాకపోతే నేను ఆరోగ్యకరమైన జీవన శైలిని బలంగా నమ్ముతాను. అందరూ దాన్ని అలవర్చుకోవాలని చెబుతాను. మనుషుల కంటే మన మనసులు యవ్వనంగా ఉండాలనేది నా సిద్ధాంతం.
మీరు, మీ స్నేహితుడు శంతను కలిసి ఎవరు ముందు ప్రేమ విషయం చెప్పారో బయట పెట్టారు. మీ ప్రేమని తర్వాత దశకి తీసుకెళ్లే ఆలోచనుందా?
మేం సరదాగా చెప్పుకొన్నాం అంతే (నవ్వుతూ). నా దృష్టంతా కెరీర్‌పైనే ఉంది. దాన్ని మరో దశలోకి తీసుకెళ్లాలనే ఆలోచన తప్ప మరేమీ లేదు. ప్రేమ, పెళ్లిలాంటి విషయాలు మాట్లాడటం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు.
ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నారు కదా. ఆయన గురించి ఎవ్వరికీ తెలియని, మీకు మాత్రమే తెలిసిన ఓ విషయం చెప్పండి?
ఎవరికీ తెలియంది నాకు మాత్రమే ఎలా తెలుస్తుంది? అయితే అందరూ ప్రభాస్ ఎక్కువగా మాట్లాడరు అంటుంటారు కానీ, ఆయన మంచి మాటకారి. 'సలార్' సెట్లో మేం చాలా బాగా మాట్లాడుకుంటాం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కరోనాతో చిత్రసీమ ఆగమాగం.. రూ.1500కోట్లు నష్టం!