ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (Indian Film Festival of Melbourne) షార్ట్‌ఫిల్మ్ విభాగానికి జ్యూరీ సభ్యురాలిగా తాను ఎంపికైనందుకు బాలీవుడ్ నటి రిచా చద్దా(Richa Chadda) ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఒక షార్ట్‌ఫిల్మ్ ద్వారా కథ మొత్తం చెప్పడం నిజంగా గొప్ప విషయమని ఆమె పేర్కొంది. రిచాతో పాటు ప్రముఖ దర్శకుడు ఒనిర్(Onir) కూడా జ్యూరీ విభాగంలో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా రిచా చద్దా మాట్లాడింది.
"ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్'లో భాగం కావడం గర్వంగా ఉంది. మళ్లీ ఇందులో పాల్గొనడం, ముఖ్యంగా జ్యూరీ సభ్యురాలిగా ఉండటం మరింత ఉత్తేజం కలిగిస్తోంది. ఆధునిక బానిసత్వం, సమానత్వం అనే ఆంశం మీద ఈసారి అద్భుతమైన లఘుచిత్రాలు వస్తాయని మేం ఆశిస్తున్నాం. నిజానికి ఈ రెండూ చాలా క్లిష్టమైన విషయాలు. మొత్తం కథను తక్కువ వ్యవధిలో చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ సంవత్సరం పోటీకి వచ్చే లఘు చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను".
- రిచా చద్దా, బాలీవుడ్ హీరోయిన్
ఇలాంటి ప్రతిష్టాత్మక చలనచిత్ర ఉత్సవాల్లో న్యాయనిర్ణేతగా రిచా చద్దా గతంలోనూ వ్యవహరించింది. ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్ 12వ ఎడిషన్‌ను ఆగస్టు 12 నుంచి 21వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
పంజాబ్‌కు చెందిన రిచా చద్దా హిందీలో 'ఫక్రే'(Fukrey) సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సహాయకపాత్రలు పోషించింది. 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్'లో(Gangs of Wasseypur) నటించడం ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం వరించింది. ఇటీవల నిర్మాణ సంస్థ నెలకొల్పిన ఆమె నిర్మాతగా అవతారమెత్తింది. ఆమె నటించి 'షకీలా'(Shakeela) బయోపిక్ 2020లో విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి.. Navarasa: సినీ కార్మికుల కోసమే ఈ 'నవరస'