బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 'అఖండ' పూర్తయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇప్పుడు చిత్రబృందం మిగిలిన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే నటి మీనాను ఎంపిక చేసినట్లు సమాచారం.
90ల్లో స్టార్ నాయికగా తెలుగులోని అగ్ర తారలందరితోనూ జోడీ కట్టి అలరించారు నటి మీనా. బాలకృష్ణతో 'ముద్దుల మొగుడు', 'బొబ్బిలి సింహం'లోనూ ఆడిపాడారు. ఇప్పుడిన్నేళ్ల తర్వాత ఈ కొత్త సినిమా కోసం బాలయ్యతో ఆమె తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇందులోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో మీనా ఓ కీలకపాత్రలో సందడి చేయనున్నారట. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మీనా ప్రస్తుతం వెంకటేశ్‌కు జోడీగా 'దృశ్యం 2' చిత్రంలో నటిస్తోంది.
ఇదీ చూడండి: మెల్లామెల్లగా వచ్చిందే.. వచ్చి మనసులు దోచిందే!