"మళ్లీ నటన వైపు వచ్చే ఆలోచనలు లేవు. ప్రస్తుతం నా దృష్టంతా చిత్ర నిర్మాణంపైనే ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న పని పట్ల చాలా సంతోషంగా ఉన్నా" అని అంటోంది నటి, నిర్మాత ఛార్మి. గతేడాది పూరి జగన్నాథ్ దర్శకత్వం నుంచి వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో ఛార్మి నిర్మాతగా తొలి విజయాన్ని అందుకొంది. రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ నాయకానాయికలుగా నటించిన ఈ సినిమా విడుదలై.. జులై 18 నాటికి ఏడాదైంది. ఈ సందర్భంగా ఛార్మి పలు విషయాలు వెల్లడించింది.
"మాకు విజయం అత్యవసరమైన సమయంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో గొప్ప హిట్ వచ్చింది. అందుకే ఇది మాకెంతో ప్రత్యేకం. పూరి జగన్నాథ్ నాలుగు నెలలుగా కథలు రాయడంలోనే తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇకపై పూరి కనెక్ట్స్ నుంచి వచ్చే కంటెంట్ ప్రతి ఒక్కరి కడుపు, గుండెల్ని నింపే విధంగా ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాల వరకు సరిపడా కథలతో మేం సిద్ధంగా ఉన్నాం. పూరి తదుపరి చిత్రాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగానే నిర్మించబోతున్నాం. మా తర్వాతి చిత్రాల గురించి ఇకపై వరుస ప్రకటనలు చేస్తాం. ఓటీటీ వేదికలకు తగ్గ కంటెంట్‌ను పెద్ద ఎత్తున సిద్ధం చేయాలనుకుంటున్నాం. పూరి నుంచి చాలా స్క్రిప్ట్స్ రాబోతున్నాయి. వాటితో కొత్త దర్శకుల్ని ప్రోత్సహించాలని భావిస్తున్నాం"
--ఛార్మి, టాలీవుడ్ నటి
"ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అన్ని భాషలకు సరిపడే చక్కటి పేరు కోసం కసరత్తు చేస్తున్నాం. పూరికి రామ్ అంటే చాలా ఇష్టం. ఆయన తనతో మళ్లీ కలిసి పనిచేయడం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అది 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా ఉంటుందా? లేక మరేదైనా కొత్త చిత్రమవుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం" అని అభిప్రాయపడింది ఛార్మి