అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2018కి గానూ దివంగత నటి శ్రీదేవిని, 2019కిగానూ నటి రేఖను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై... శ్రీదేవి భర్త బోనీకపూర్, రేఖలకు అవార్డులను అందజేశారు.
తొలిచిత్రం రంగుల రాట్నం కాదు...
ప్రముఖ నటి రేఖ మన తెలుగు వారే... ఈ విషయం ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా రేఖ నటించిన తెలుగు సినిమాలోనే తొలిసారి కనిపించింది. ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయమైన చిత్రం 'ఇంటిగుట్టు'. ఏడాది వయస్సు ఉన్నప్పడు ఆ సినిమాలో అవకాశం వచ్చినట్లు రేఖ తెలిపింది. ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య దర్శకుడు. నిర్మాతగా అక్కెల్ల శాస్రీ వ్యవహరించారు.ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, నటి సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు.1958లో విడుదలైన ఈ సినిమా భారీగా ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత 1966లో మరో తెలుగుసినిమా రంగులరాట్నంలో సందడి చేసింది రేఖ.