Sirivennela seetharamasastry died: తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో హృదయాల్ని కలచివేసింది. ఆయన్ను, ఆయన కలం నుంచి జారువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.
"జగమంత కుటుంబం మీది. మీరు లేక ఏకాకి జీవితం మాది. మా జీవితాల్లో కవిత్వాన్ని నింపినందుకు ధన్యవాదాలు గురూజీ! సిరివెన్నెలగారు లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా."
- నటుడు ప్రకాశ్‌రాజ్.
"పాటే శ్వాసగా జీవిస్తూ.. వెండితెర మీద సిరివెన్నెలలు కురిపించిన మా సీతారామశాస్త్రి ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దివ్యలోక ప్రాప్తికలగాలని కోరుకుంటున్నా"
- పరుచూరి గోపాలకృష్ణ.
"సిరి వెన్నెల సీతారామశాస్త్రి... నాకు అత్యంత సన్నిహితుడు…సరస్వతీ పుత్రుడు...విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది... ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి."
-మోహన్‌బాబు
"సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నా."
- నటుడు నందమూరి కల్యాణ్‌రామ్.
"సాహిత్య లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా."
- సంగీత దర్శకుడు తమన్.
"సిరివెన్నెల మా అందరికీ ఆదర్శనీయుడు, మార్గదర్శకుడు. 1995 నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. సిరివెన్నెల చీకట్లో కలిసిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన సిరా.. వెన్నెల. ఆయన ఏ పాట రాసినా మాకు మార్గదర్శకంగా ఉండేది. 'నమస్తే అన్న'లో నేను రాసిన మొదటి పాట చూసి నన్ను ఆశీర్వదించిన గొప్ప మనసు ఆయనది. తెలుగు సినిమా పాటకు, సాహిత్యలోకానికి చాలా పెద్ద నష్టం. ఈ నష్టం పూరించేది కాదు. ఎవరూ ఆయన్ను అనుకరించలేరు. మా పెద్ద దిక్కు కోల్పోయినట్టు అనిపిస్తుంది."
- సుద్దాల అశోక్ తేజ, గేయ రచయిత.
"సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి."
- శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ.
"మీ పాటలే మేం నేర్చుకున్న పాఠాలు. మీ సూక్తులు మేం రాసుకొనే మాటలు. బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ! భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి కానీ మనసు ఒప్పుకోవటం లేదు."
- దర్శకుడు మారుతి.
"అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనిషి.. గురువు గారు సీతారామశాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు."
- రచయిత కోన వెంకట్.
"సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరన్న వార్త హృదయాన్ని ముక్కలు చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా."
- దర్శకుడు గోపీచంద్ మలినేని.
ఇదీ చూడండి: సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ పవర్ఫుల్ స్పీచ్.. చూసేయండి!