"నా సినీ ప్రయాణం వైవిధ్యంగా ఉండాలనుకుంటా. అందుకే చేసే ప్రతి సినిమాతోనూ ఓ విభిన్నమైన కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నా" అన్నారు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). 'రాజావారు రాణిగారు'(Raja Vaaru Rani Gaaru) సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన కథానాయకుడాయన. ఇప్పుడు 'ఎస్.ఆర్.కళ్యాణమండపం'(SR Kalyanamandapam) చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం కిరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
- నాకు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చాలా ఇష్టం. అయితే ఈ కథలు నేను మోయగలనా లేదా? అని తెలియకుండా దర్శకులు నా వరకు రాలేరు కదా. అందుకే ముందు నన్ను నేను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో.. స్వయంగా కథ రాసుకొని చేసిన చిత్రమే 'ఎస్.ఆర్.కల్యాణమండపం'. దీనికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు నేనే అందించా. శ్రీధర్ గాదె దర్శకుడు. రాయలసీమ ప్రాంతంలో 1975లో నిర్మించిన ఓ కళ్యాణ మండపం చుట్టూ జరిగే కథతో రూపొందింది. నా తండ్రిగా సాయికుమార్ నటించారు. ఈ చిత్ర కథకు.. ఎస్వీ రంగారావు గారికి ఓ లింక్ ఉంటుంది. అదేంటన్నది తెరపైనే చూడాలి. ఆగస్టు 6న థియేటర్లోనే విడుదల చేస్తున్నాం.
- ప్రస్తుతం దర్శకుడు బాలాజీతో 'సెబాస్టియన్'(Sebastian PC524) సినిమా చేస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో 'సమ్మతమే' చిత్రంలో నటిస్తున్నా. కోడి రామకృష్ణ బ్యానర్లో కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. మణిశర్మ స్వరాలందిస్తారు.
- కడప జిల్లాలోని రాయచోటి మా ఊరు. ఇంజినీరింగ్ పూర్తికాగానే బెంగళూరు వెళ్లి.. రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. ఆ సమయంలోనే నా స్నేహితుడి ప్రోత్సాహంతో 'గచ్చిబౌలి' అనే లఘు చిత్రంలో నటించా. ఈ క్రమంలోనే 'రాజావారు రాణిగారు'లో నటించే అవకాశమొచ్చింది. నేనెలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. పరిశ్రమలోకి వచ్చే ముందే స్టోరీ రైటింగ్ నుంచి ఎడిటింగ్, కెమెరా వర్క్ వరకు అన్ని పనుల్లో పరిజ్ఞానం పెంచుకున్నా.
ఇదీ చూడండి.. Kangana: నిర్మాతగా, వ్యాఖ్యాతగా తొలి అడుగులు!