యాక్షన్ కింగ్ అర్జున్.. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు సామాజిక సేవ చేస్తూ గోప్యంగా ముందుకు సాగుతుంటారు. అటువంటి అర్జున్‌లో ఆంజనేయ స్వామి భక్తుడున్నాడు. అందుకే ఆయన చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న సొంత స్థలంలో "ఆంజనేయ స్వామి "గుడికి శ్రీకారం చుట్టారు.
15 ఏళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భక్తుల సందర్శనార్థం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జులై 1 నుంచి కుంభాభిషేకం జరగనుంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలిపారు అర్జున్. నితిన్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన 'శ్రీ ఆంజనేయం' చిత్రంలో హనుమాన్‌గా నటించారు అర్జున్.
"అందరికీ నమస్కారం. చెన్నైలో 15 సంవత్సరాల క్రితం నిర్మాణ పనులు చేపట్టిన ఆంజనేయస్వామి గుడి ఇప్పుడు పూర్తయింది. జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. స్నేహితులు, అభిమానులు, నాకు తెలిసిన వాళ్లందరినీ ఆహ్వానించాలనుకున్నా. కానీ, ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరినీ ఆహ్వానించట్లేదు. ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ మిస్ కాకూడదని లైవ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్స్ నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చూడొచ్చు" అని అర్జున్ తెలిపారు.
ఇదీ చూడండి: సూపర్‌స్టార్‌తో తలపడనున్న యాక్షన్ కింగ్!