ఈటీవీలో ప్రసారమవుతోన్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'. మరే ఇతర షోలకు సాధ్యంకాని విధంగా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ అలరిస్తోంది. టీవీల్లోనే కాకుండా.. యూట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది. ఒక ఎపిసోడ్ ముగుస్తుందో లేదో.. తర్వాతి ఎపిసోడ్ ప్రోమో కోసం యూట్యూబ్‌లో అభిమానులు వెతుకుతున్నారంటే.. అభిమానులకు 'ఢీ' ఎంతలా దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 'ఢీ' కొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్ ఇండియా ప్రకటించిన టాప్ 10 వీడియోల్లో స్థానం సంపాదించింది.

యూట్యూబ్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, వాటి సృష్టికర్తలను ప్రకటించింది. అందులో.. 'ఢీ ఛాంపియన్'కు స్థానం లభించింది. ఢీ కంటెస్టెంట్ పండు చేసిన 'నాదీ నక్కిలీసు గొలుసు' ప్రదర్శన ఆరో స్థానంలో నిలిచింది. ఆగస్టు 5న యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ వీడియో.. ఇప్పటి వరకూ 8,15,28,169 వీక్షణలు సొంతం చేసుకుంది. 'యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్: ది ఎండ్' అనే వీడియో అగ్రస్థానంలో నిలిచింది.

ఒకే సినిమాలోని రెండు పాటలు
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని రెండు పాటలకు టాప్ 10 మ్యూజిక్ వీడియోల్లో చోటు దక్కింది. 'బుట్టబొమ్మ' మూడోస్థానంలో.. 'రాములో.. రాములా' ఎనిమిదో స్థానంలో నిలిచాయి. కాగా.. అగ్రస్థానంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ కనిపించిన హిందీ పాట 'గేందా ఫూల్' నిలిచింది. యూట్యూబ్ టాప్10 క్రియేటర్ల విభాగంలో హరియాణాకు చెందిన కేరీ మింటీ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.


ఇదీ చదవండి:గర్భంతో షూటింగ్‌కు కరీనా కపూర్..!