అగ్రహీరో షారుక్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. 2018లో వచ్చిన 'జీరో' తర్వాత ఆయన్నుంచి మరో చిత్రం రాలేదు. అది కూడా విజయవంతం కాలేదు. దాని తర్వాత సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్ల 'జోయా ఫ్యాక్టర్'కు వాయిస్ ఓవర్ చెప్పారు. అంతే మళ్లీ షారుక్ మరో కొత్త ప్రాజెక్టు ఊసేలేదు. అంతకుముందు వచ్చిన 'జబ్ హ్యారీ మెట్ సెజల్', 'రయీస్', 'డియర్ జిందగీ'.. ఇలా వరుస ఫ్లాఫులే. దీంతో కథలపై ఆచితూచి వ్యవహరించే పనిలోపడ్డారు షారుక్. తన దగ్గరకు వచ్చే ప్రతికథను జాగ్రత్తగా వినడం, వాటికి మార్పులు చెప్పడం వల్ల కొత్త ప్రాజెక్టు ఆలస్యమయ్యాయి. ఒకటి, రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళదాం అనుకున్న సమయానికి కరోనా రావడం వల్ల అవీ ఆగిపోయాయి. కానీ షారుక్.. కథలపై గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. దాదాపు 18 కథలు ఆయన గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయట.
అందులో షారుక్ నటించేవాటితో పాటు సొంతనిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్లో నిర్మించేవి ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ, సిద్ధార్థ్ ఆనంద్, రాజ్ అండ్ డీక్, అట్లీ, తిగ్మన్షు దులియా, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, మధుర్ బండార్కర్, అలీ అబ్బాస్ జాఫర్, అమర్ కౌశిక్, స్మిత్ అమిన్ ఇలా దర్శకులందరూ షారుక్‌తో సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేస్తున్నారు. మధుర్ బండార్కర్.. ఇసుక మాఫియాపై, రాజ్‌కుమార్ హిరాణీ.. పంజాబ్, కెనడా నేపథ్య కథతో, అట్లీ.. ఓ యాక్షన్ కథను తయారు చేశారట. అలీ అబ్బాస్ జాఫర్.. ఓ బయోపిక్‌ను వినిపించారట. వీటితో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌లకు సంబంధించినవి షారుక్ ముందున్నాయి. మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో కొన్నిరోజుల్లో తెలిస్తుంది.