ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఎవరికైనా 'యూట్యూబ్' అనేది ఎంటర్టైన్మెంట్కు అడ్డా! ఇందులో ఉచితంగా ఎన్ని వీడియోలనైనా చూసే వీలుంది. ఎన్నో రకాల వీడియోలు ఇందులో అందుబాటులో ఉంటాయి. కానీ, చాలా మంది యూట్యూబ్‌లో ఉండే ఫీచర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. కొన్ని సెట్టింగ్స్, ఆప్షన్స్ గురించి తెలుసుకుంటే యూట్యూబ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా మరి..
యూట్యూబ్ వాచ్ టైమ్..
యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతసేపు అందులో గడిచిపోతుందో మనకు తెలియనే తెలియదు. నచ్చిన వీడియోలు చూస్తూ ఉంటే సమయం కూడా వేగంగా అయిపోతుంటుంది. మరి మనం యూట్యూబ్ ఎంతసేపు చూశామో తెలుసుకునే ఛాన్స్ లేదా? అంటే ఉందనే చెప్పొచ్చు. యూట్యూబ్‌లో ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేస్తే అందులో 'టైమ్ వాచ్డ్'అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే గడిచిన ఏడు రోజుల వ్యవధిలో యూట్యూబ్‌ను ఎంత సేపు చూశామనేది తెలిసిపోతుంది. అయితే ఇందులో 'యూట్యూబ్ మ్యూజిక్', 'యూట్యూబ్ టీవీ'కి సంబంధించిన డేటా ఉండదు.
బ్రేకులు తీసుకోండిలా..
రోజంతా యూట్యూబ్‌లోనే గడిపేయకుండా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ, బ్రేక్ తీసుకోవాలని చెప్పేవారెవరు? అయితే, ఈ విషయాన్ని కూడా మేమే చెబుతాం అంటోంది యూట్యూబ్. ఇందుకు చేయాల్సిందల్లా.. యూట్యూబ్ ప్రొఫైల్లోకి వెళ్లి.. 'టైమ్ వాచ్డ్' సెక్షన్‌ను ఓపెన్ చేయాలి. అందులో 'రిమైండ్ మీ టు టేక్ బ్రేక్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. బ్రేక్ ఎంతసేపటి తర్వాత తీసుకోవాలో అందులో మెన్షన్ చేయాలి. మీరు చెప్పిన సమయానికి యూట్యూబ్ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది.
జూమ్ ఆప్షన్
యూట్యూబ్‌లో జూమ్ ఆప్షన్ ఉందని మీకు తెలుసా? సాధారణ జూమ్ కాకుండా.. వీడియోను ఎనిమిది రెట్లు జూమ్ చేసుకోవచ్చని తెలుసా. అవునండీ! రెండు వేళ్లతో స్క్రీన్‌ను పించ్ చేయడం ద్వారా జూమ్, అన్జూమ్ చేసుకోవచ్చు. ఎనిమిది రెట్ల వరకు వీడియోనూ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ లెక్చర్ వీడియోల విషయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఆటో ప్లే
యూట్యూబ్‌లో ఓ వీడియో పూర్తైన వెంటనే మరో వీడియో ఆటోమెటిక్‌గా ప్లే అవుతుంటుంది. యూజర్ల అభిరుచికి అనుగుణంగా తర్వాతి వీడియోలను ప్లే చేస్తుంటుంది యూట్యూబ్. యూజర్ వయసు 18ఏళ్ల పైబడి ఉంటే ఈ ఆప్షన్ ఆటోమెటిక్‌గా ఆన్‌లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ఆటో-ప్లే' విభాగంపై క్లిక్ చేయాలి. అందులో ఆన్/ఆఫ్ బటన్‌ను నొక్కితే సరిపోతుంది. ఇది స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో మాత్రమే పనిచేస్తుంది. వెబ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లకు ఇది వర్తించదు.
ప్లేబ్యాక్ ఫీడ్
యూట్యూబ్ మొదటిసారి ఓపెన్ చేయగానే.. స్క్రీన్‌పై ఉన్న వీడియో ఆటోమెటిక్‌గా ప్లే అవుతుంటుంది. వీడియోలో ఏముందో తెలుసుకునే ప్రివ్యూ మాదిరిగా ఇది కొందరికి ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ, కొంతమందికి ఇది అంతగా ప్రయోజనకరంగా అనిపించదు. అనవసరమైన వీడియోలకు డేటా వృథా అయిపోతుంది.
అయితే, దీన్ని డిసేబుల్ చేసే అవకాశం మన చేతిలోనే ఉంది. సెట్టింగ్స్ ఆప్షన్లో జనరల్ సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి. అందులో 'ప్లేబ్యాక్ ఇన్ ఫీడ్స్'ను ఓపెన్ చేయాలి. అందులో ఆప్షన్‌ను ఆఫ్ చేసేయాలి. అవసరమైతే.. వైఫైకి కనెక్ట్ అయినప్పుడు వీడియో ప్రివ్యూ కొనసాగేలా ఉన్న ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
యాంబియెంట్ మోడ్
వీడియోలోని రంగులను బట్టి యూట్యూబ్ ఇంటర్ఫేస్ను మరింత ఆకర్షణీయంగా మార్చే ఫీచరే యాంబియెంట్ మోడ్. స్క్రీన్‌పై ప్లే అయ్యే వీడియోను బట్టి.. ప్లేయర్ చుట్టూ రంగుల్ని విరజిమ్ముతుంది. దీన్ని ట్రై చేయాలంటే ఈ కింది సూచనలను ఫాలో అవ్వండి.
- ఏదైనా వీడియోను ప్లే చేయాలి.
- స్క్రీన్‌పై వచ్చే కంట్రోల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని.. టాప్-రైట్ కార్నర్లో కనిపించే సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి
- ఓ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో యాంబియెంట్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేయాలి. అయితే ఈ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకున్న వీడియోల విషయంలో పనిచేయదు.
యూట్యూబ్ ఇన్‌కాగ్నిటో
ప్రైవసీ కోసం బ్రౌజర్లలో ఇన్‌కాగ్నిటో మోడ్ ఉపయోగించడం అందరికీ తెలుసు. మరి యూట్యూబ్‌లోనూ అలాంటి ఫీచర్ ఒకటి ఉందని తెలుసా? అవును. వీడియో హిస్టరీ సేవ్ కాకుండా ఉండాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం ప్రొఫైల్లోకి వెళ్లి అక్కడ కనిపించే ఇన్కాగ్నిటోపై క్లిక్ చేయాలి.
పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్
యూట్యూబ్ వీడియోను చూస్తూనే వేరే యాప్స్ ఉపయోగించుకోవాలని అందరికీ ఉంటుంది. యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌తో ఇది సాధ్యమవుతుంది. ఇది ఆన్ చేసుకుంటే.. వీడియో మినిమైజ్ అవుతుంది. ఆ తర్వాత మొబైల్లో వేరే యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది యాక్టివేట్ చేసుకోవడం ఎలా అంటే?
- ఐఓఎస్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లాలి. అందులో పిక్చర్-ఇన్-పిక్చర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో 'స్టార్ట్ పిఐపీ ఆటోమెటికల్లీ' అనే ఆప్షన్‌ను ఆన్ చేయాలి.
- ఆండ్రాయిడ్‌లో అయితే.. ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ విభాగంలోకి వెళ్లి స్పెషల్ యాప్ యాక్సెస్‌పై క్లిక్ చేయాలి. అందులో పిక్చర్-ఇన్-పిక్చర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యూట్యూబ్ యాప్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూట్యూబ్ సెట్టింగ్స్‌లోని జనరల్ విభాగంలోకి వెళ్లి పిక్చర్-ఇన్-పిక్చర్‌ను ఆన్ చేసుకోవాలి.
- అయితే, మ్యూజిక్ వీడియోల విషయంలో ఈ ఆప్షన్ పనిచేయదు. మిగితా వీడియోల విషయంలోనూ అమెరికాలో ఉన్న యూజర్స్కే ఇది వర్తిస్తుంది. అమెరికా బయట ఉన్నవారు పిక్చర్-ఇన్-పిక్చర్‌ను యాక్సెస్ చేయాలంటే ప్రీమియం సబ్‌స్క్రైబర్ అయి ఉండాలి.
వీడియో ట్రాన్స్క్రిప్ట్స్
యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకు ట్రాన్స్క్రిప్ట్లు జనరేట్ అవుతాయి. వీడియోలో ఏం మాట్లాడుతున్నారనేది ఇందులో తెలిసిపోతుంది. క్యాప్షన్స్ అప్లోడ్ చేయకున్నా ఆటోమెటిక్‌గా ఈ ట్రాన్స్క్రిప్ట్లు వచ్చేస్తాయి. వీడియో టైటిల్‌పై క్లిక్ చేసి 'షో ట్రాన్స్క్రిప్ట్'పై నొక్కితే ట్రాన్స్క్రిప్ట్స్ కనిపిస్తాయి. వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి ట్రాన్స్క్రిప్ట్స్ను డిసేబుల్ చేస్తే ఆ ఆప్షన్ కనిపించదు.