అన్ని సంవత్సరాల కంటే ఈ 2021 తొందరగా గడిచిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భూమి తన చుట్టూ తాను తిరగడంలో వేగం పెరుగుతున్నందున ఈ ఏడాదిలో రోజులు తొందరగా గడుస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా ఒక రోజు అంటే 24 గంటలు ఉంటుంది. కానీ, భూమి వేగంగా తిరుగుతున్నందున.. ఈ సమయంలో తేడా వచ్చిందని వారు అంటున్నారు. అందుకే.. ఇప్పుడు సమయాన్ని కూడా తగ్గించే అంశాన్ని ఆలోచిస్తున్నారు.
1970 నుంచి ఇప్పటివరకు భూమి తన చుట్టూ తాను తిరగడానికి(భూ భ్రమణానికి) కొన్నిసార్లు 24 గంటల కన్నా ఎక్కువ సమయం తీసుకుంది. అందుకే.. సౌర కాలమానానికి అనుగుణంగా సమయాన్ని ఉంచడానికి ఇప్పటివరకు 27 సార్లు సమయంలో 'లీప్ సెకన్లు' కలిపారు. అయితే.. గతేడాది మధ్య నుంచి భూభ్రమణంలో జోరు పెరిగింది. దీంతో ఇప్పుడు ఒక రోజు పూర్తవ్వడానికి 24 గంటల కంటే కాస్త తక్కువగా నమోదవుతోంది. అందుకే సమయంలో నుంచి ఇప్పుడు ఒక సెకనును తగ్గించడానికి ఆలోచిస్తున్నారు. ఇలా సెకనును తగ్గించడాన్ని 'నెగెటివ్ లీప్ సెకను' అని పిలుస్తారు.
- 2020, జులై 19న 1.4602 మిల్లీసెకన్లు తక్కువగా ఒక రోజు గడిచింది. అంతకంటే ముందు 2005లో అతి తక్కువ సమయంతో ఓ రోజు నమోదైంది.
- భూభ్రమణం పూర్తి కావడానికి సగటున ఒకరోజులో 0.5 సెకన్లు తక్కువగా నమోదవుతూ వస్తోంది.
- ఉపగ్రహాలు, సౌరకాలమానంపై ఆధారపడి మాత్రమే సమాచార సాధనాలన్నీ పనిచేస్తాయి. నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు స్థానాల ఆధారంగా సౌర కాలమానం నమోదవుతుంది. ఈ నేపథ్యంలో పారిస్‌లోని అంతర్జాతీయ భూభ్రమణ సేవల అధికారులు.. అంతకుముందు ఒకరోజులో 'లీప్ సెకను'ను జతచేస్తూ వచ్చారు. 1970 నుంచి ఇలా 27 సార్లు జత చేశారు. చివరిసారి 2016 నూతన సంవత్సరం రోజున లీప్ సెకనును కలిపారు.
- అయితే.. భూమి తన చుట్టూ తాను తిరగడం క్రమంగా నెమ్మదిస్తుండడం వల్ల ఇకపై 'లీప్ సెకన్'ను జత చేయడం ఇక అవసరం లేదని తెలుస్తోంది. అయితే.. ఇన్నాళ్లు ఏర్పడ్డ ఈ తేడాలను పరిష్కరించేందుకు.. ఈ నెగెటివ్ లీప్ సెకనును మళ్లీ జోడించాలా లేదా అన్నదానిపై అంతటా చర్చ నడుస్తోంది.
'గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భూమి తన చుట్టూ తాను వేగంగా తిరుగుతోంది' అని నేషనల్ ఫిజికల్ లేబొరేటరీకి చెందిన సీనియర్ పరిశోధకుడు పీటర్ విబ్బర్లీ తెలిపారు. ఇంతకంటే ఎక్కువ వేగంతో భూభ్రమణం జరిగితే.. నెగెటివ్ లీప్ సెకనును జోడించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, అది జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆ ఉపగ్రహాల వల్ల జ్యోతిషులకు కొత్త చిక్కులు!