Technology trends in 2021: 2020 చివర్లో ఆన్‌లైన్‌లో ఓ జోక్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. 'ఈ ఏడాది ఏం నేర్చుకున్నావంటే.. కొవిడ్-19, కరోనా వైరస్, లాక్‌డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్, రెసిస్టెన్స్ వంటి పదాలు' అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అలానే 2021లో కూడా కరోనా రెండో దశ వచ్చింది. దీంతో మరోసారి చాలా మంది విద్యార్థులతోపాటు వివిధ రంగాల్లో పనిచేచేస్తున్న ఉద్యోగులు చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో 2021లో మరికొన్ని పదాలు పాపులర్ అయ్యాయి. గతేడాది కేవలం ఈ పదాల పరిచయం వైద్య రంగానికే పరిమితమైతే.. ఈ ఏడాది ఆన్‌లైన్ లెర్నింగ్, రిమోట్ వర్కింగ్, బ్లాక్ చెయిన్, టెలీ మెడిసిన్ వంటి పదాలు టెక్ రంగంలో పాపులర్ అయ్యాయి. అలా 2021లో మనిషి రోజువారీ మనుగడలో భాగమైన టెక్నాలజీలపై ఓ లుక్కేద్దాం.
5G Connectivity
ఈ ఏడాది మనకు ఎక్కువగా వినిపించిన పదం 5జీ కనెక్టివిటీ. మొబైల్ నెట్‌వర్క్‌లో తర్వాతి తరం సాంకేతికతగా దీన్ని చెబుతున్నారు. ఈ సాంకేతికత పూర్తిస్థాయిలో ఇప్పటికీ అందుబాటులోకి రానప్పటికీ.. మొబైల్ తయారీ సంస్థలు 5జీ కనెక్టివిటీ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో 5జీ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న మొబైల్ నెట్‌వర్క్ బ్యాండ్‌విడ్త్ సామర్థాన్ని మరింత పెంచుతూ.. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలను మరింత వేగంగా యూజర్స్‌కు చేరువ చేయాలనే లక్ష్యంతో నెట్‌వర్క్ ప్రొవైడర్ సంస్థలు 5జీ టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, స్మార్ట్ గ్రిడ్ నియంత్రణ, స్మార్ట్ రిటైల్, వర్చువల్ రియాలిటీ వంటి రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2022లో 5జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి వస్తుందని అంచనా.
Artificial Intelligence, Machine learning
గత దశాబ్దకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో స్పీచ్ రికగ్నిషన్, నావిగేషన్ యాప్స్, స్మార్ట్‌ఫోన్ పర్సనల్ అసిస్టెంట్ (యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా), రైడ్ షేరింగ్ యాప్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. అయితే కరోనా పరిస్థితుల్లో ఏఐ ఆధారిత సేవల వినియోగం మరింతగా పెరిగింది. ముఖ్యంగా విద్యార్థుల లెర్నింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు విద్యాసంస్థలు ఏఐ ఆధారిత యాప్ సేవలను ఉపయోగించుకున్నాయి. 2025 నాటికి ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సేవలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుందని సమాచారం.
Short Video Feature
షార్ట్ వీడియో ఫీచర్.. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది సామాన్యులకు ఉపాధి చూపి, ఫేమ్ సంపాదించి పెట్టింది. బైట్ డ్యాన్స్ పరిచయం చేసిన టిక్ టాక్ షార్ట్ వీడియో యాప్‌పై భారత్‌లో నిషేధం విధించడంతో యూజర్స్ ఇన్‌స్ట్రాగ్రాం రీల్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ షార్ట్స్ వంటి యాప్‌లలో ఉండే షార్ట్ వీడియో ఫీచర్లను ఉపయోగించడం ప్రారంభించారు. అలానే కరోనా పరిస్థితులతో ఇళ్లకే పరిమితమైన ఎంతో మంది యూజర్స్ షార్ట్ వీడియోలు చేస్తూ ఆన్‌లైన్‌లో పాపులారిటీతోపాటు ఆదాయం పొందుతున్నారు. డిజిటల్ కంటెంట్ తయారు చేయాలనుకునేవారికి కూడా ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సంస్థలు షార్ట్ వీడియో కంటెంట్ రూపొందించే వారి కోసం మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించాయి.
Digital Contact Tracing
ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి కలవరపెడుతున్న వేళ వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు డిజిటల్ కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీపై ఎన్నో దేశాలు ఆధారపడ్డాయి. ఈ సాంకేతికతతో భారత్‌లో ఆరోగ్యసేతు యాప్ రూపుదిద్దుకుంది. యూజర్స్ ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో వివరాలు నమోదు చేయాలి. మన సమీపంలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయితే ఆ వివరాలు ఈ యాప్ తెలియజేసేది. ఇవి బ్లూటూత్, జీపీఎస్ ఆధారంగా పనిచేస్తాయి. పట్టణ ప్రాంతాల్లోని యూజర్స్ వీటిని ఉపయోగించినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని వారు వీటిని ఉపయోగించేందుకు ఆసక్తి కనబరచలేదనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనేది టెక్ నిపుణులు చెబుతున్న మాట.
Cyber Security
లాక్‌డౌన్ పరిస్థితులతో ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో యూజర్ వ్యక్తిగత సమాచారం లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులు చేశారు. కొన్ని సంస్థలు ఏకంగా యూజర్ డేటాను హ్యాకర్స్‌కు అమ్మేయడం గమనార్హం. దీంతో ఆన్‌లైన్ భద్రతపై టెక్ సంస్థలు దృష్టి సారించాయి. అలానే యూజర్స్‌లో కూడా ఆన్‌లైన్ డేటా భద్రతపై అవగాహన పెరిగింది. దీంతో యూజర్ డేటాను సేకరించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇందులో ముఖ్యంగా యాప్‌లలో మాల్‌వేర్ ప్రవేశపెట్టడం, నకిలీ ప్రకటనలతో యూజర్స్‌ను ఆకర్షించి వాటి ద్వారా యూజర్ డెబిట్, క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ బ్యాకింగ్ వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఇవేకాకుండా వర్క్‌ఫ్రమ్‌హోం చేసే కార్పొరేట్ సంస్థల డేటాను కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 శాతానికిపైగా కార్పొరేట్ సంస్థలు 2021లో సైబర్ దాడులను ఎదుర్కొన్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది.
Virtual Reality
ఈ ఏడాది పాపులర్ అయిన మరో టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ. ఇప్పటికే పలు కంపెనీలు వీఆర్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాస్తవ ప్రపంచాన్నీ, వర్చువల్ ప్రపంచాన్నీ ఈ సాంకేతికత ఒక చోటుకి చేరుస్తుంది. ఈ టెక్నాలజీ సాయంతో యూజర్స్ తాము ఉన్న చోటు నుంచి వివిధ ప్రదేశాల్లో ఉన్న అనుభూతిని పొందొచ్చు. ఫేస్‌బుక్, స్పేస్‌ఎక్స్, ఆపిల్ వంటి కంపెనీలు వీఆర్ సాంకేతికతను యూజర్స్ జీవితంలో భాగం చేయాలనే ఉద్దేశంతో వీటికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించాయి. ఎంటర్‌టైన్‌మెంట్, మార్కెటింగ్, గేమింగ్, విద్య, వైద్య రంగాల్లో వీఆర్ సేవలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. వీఆర్‌తోపాటు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) టెక్నాలజీలు మానవ జీవితంలో కీలకంగా మారనున్నాయి.
Block Chain
గత దశాబ్దకాలంగా బ్లాక్‌చైన్ గురించిన వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎవరు పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఈ ఏడాది క్రిప్టో కరెన్సీ కారణంగా ఈ టెక్నాలజీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. పేరుకు తగినట్లుగానే ఈ సాంకేతికతలో డేటాను యాడ్ చేయడం మినహా ఎలాంటి మార్పులు చేయలేరు. ఇదే ఈ సాంకేతికతను మరింత భద్రమైనదిగా మార్చింది. అలానే దీనిపై ఎవరికీ నియంత్రణ ఉండదు. దీని ద్వారా జరిగే లావాదేవీలకు ధృవీకరించడానికి థర్డ్ పార్టీల అవసరం ఉండదు. ఇప్పటికే పలు సంస్థలు బ్లాక్‌చైన్ సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించాయి. ముఖ్యంగా బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ మైనింగ్‌కు ఈ టెక్నాలజీ వాడుతుండటం, ఐవోటీ నెట్‌వర్క్ భద్రతా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉండటంతో క్రమంగా దీన్ని ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. రాబోయే రోజుల్లో డేటా స్టోరేజ్ సమస్యలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాగలదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Online Learning
ఈ ఏడాదిలో కరోనా తర్వాత ఎక్కువ మంది తెలుసుకున్న పదం ఏదైనా ఉందంటే అది ఆన్‌లైన్ క్లాసులు. లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే వారు పాఠ్యాంశాలకు దూరం కాకుండా ఆన్‌లైన్ లెర్నింగ్ వారికి ఎంతో ఉపయోగపడింది. తొలుత ఈ ప్రక్రియలో కొన్ని రకాల సాంకేతికత సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ క్రమంగా వాటిని అధిగమించి ఆన్‌లైన్ లెర్నింగ్‌తో ఎంతో మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలిగారు. ఇదే సమయంలో ఆన్‌లైన్ లెర్నింగ్‌ను సరళతరం చేస్తూ విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా ఉండేందుకు వీలుగా లాగ్వేంజ్ లెర్నింగ్ యాప్స్, వర్చువల్ టుట్యోరియల్స్, ఈ-లెర్నింగ్‌కు సంబంధించి ఎన్నో రకాల సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. లాక్‌డౌన్ ముగిసి స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ కరోనా మూడో దశ భయాలతో చాలా మంది తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆన్‌లైన్ లెర్నింగ్ కోరే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Tele Medicine
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చాలా వరకు ఆస్పత్రులు వైరస్ సోకిన వారితో నిండిపోయాయి. సాధారణ రోగులకు వైద్యం అందలేని పరిస్థితి. ఒకవేళ ఆస్పత్రికి వెళితే కరోనా సోకుతుందనే భయం. ఈ నేపథ్యంలో వైద్య రంగంలో కీలకంగా మారింది టెలీ మెడిసిన్. దీనివల్ల సాధారణ రోగులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించి తగిన వైద్యం పొందగలిగారు. డాక్టర్లు నేరుగా రోగులను కలవకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా.. వర్చువల్ టూల్స్ సాయంతో ఈ టెలీహెల్త్ టెక్నాలజీ వైద్యరంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.
Remote Working
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహించాయి. అలా రిమోట్ వర్క్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ ఆధారిత సేవల రంగంలో ఈ రిమోట్ వర్కింగ్ టెక్నాలజీని ఎక్కువ మంది ఉపయోగించారు. ఆ తర్వాత విద్య, వైద్య రంగాల్లో అధికంగా ఈ సాంకేతికత ఆధారంగా పలు సంస్థలు తమ సేవలను కొనసాగించాయి. మరోసారి మూడో దశ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు రిమోట్ వర్క్ కొనసాగించడమే మేలని భావిస్తున్నాయి.
ఇదీ చూడండి: Background apps on Android: ఆండ్రాయిడ్ ఫోన్లలో అలా చేస్తే నష్టమే!