రాగి పూసిన జనపనార పూసలు సూక్ష్మజీవులను అంతం చేసి, నీటి కాలుష్యాన్ని నివారిస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించింది ఐఐటీ మద్రాస్ పరిశోదనా బృందం.
నిల్వ నీరు శుభ్రం..
ఎన్నో దేశాల్లో నీటిని భారీ కంటైనర్స్‌లో నిల్వ చేస్తారు. భారీ ప్రాజెక్టుల్లో రివర్స్ పంపింగ్ ద్వారా తోడిన వేల క్యూసెక్కుల నీటిని నిల్వచేసినప్పుడు.. గాలిలోని సూక్ష్మ క్రిములు ఆ నీటిని కలుషితం చేస్తాయి. ఆ నీటిని అలాగే తాగితే భయంకరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. అందుకే వాటిని వినియోగించే ముందు బాగా మరిగించి శుద్ధి చేస్తారు. ఇలా శుద్ధి చేసే సమయంలో సగం నీరు ఆవిరైపోతుంది.
కానీ, జనప పూసలకు కాప్రస్ ఆక్సైడ్ లేదా రాగిని పూసి నీటిని శుద్ధిపరిస్తే.. వేల క్యూసెక్కుల నీరు వృథాకాకుండా ఉంటుంది. నీటి కొరత ఉన్న గ్రామాల్లో, చెరువులు, బావుల్లోనూ నీటిలోని వ్యాధికారక క్రిములను అంతం చేసేందుకు ఈ సులభమైన పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం..
రైతులు జనపనారను విక్రయిస్తారు. దాని కాండం మాత్రం వ్యర్థంగా మిగిలిపోతుంది. కాబట్టి ఇది తక్కువ ధరకే కొనుగోలు చేసి, నీటి ప్యూరిఫయర్‌గా ఉపయోగించొచ్చు అంటున్నారు యువ శాస్త్రవేత్తలు. డా. దిలీప్‌కుమార్ చాంద్ ఆధ్వర్యంలో... జరిగిన ఈ పరిశోధనా ఫలితాలు, ప్రఖ్యాత ఏసీఎస్ ఒమెగా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
"రాగిని క్రిమిసంహారకంగా, నీటిని శుద్ది చేసే పదార్థంగా ఉపయోగించడం భారతీయులకు తెలిసిన విషయమే. అందుకే, రాగి పాత్రలలో నీటిని నిల్వ చేసేవారు మన పూర్వీకులు. రాగి లవణాల్లోని క్రిమిసంహారక లక్షణాలను అధ్యయనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. ఏదేమైనా, ఒక నిర్దిష్ట పరిమితి మించితే, రాగి కూడా విషపూరితం కావచ్చు. అందువల్ల, రాగిని ఏ పరిమాణంలో నీటిలో కలపాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. "
-ప్రొ. చాంద్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఐఐటీ మద్రాస్
అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) ప్రకారం.. నీటిలో రాగి శాతం 1.3 పీపీఎమ్లు మించితే ప్రమాదకరం. అందుకే, ఆ ప్రమాణాలను మించకుండా.. కేవలం 0.8 పీపీఎమ్ల రాగిని నీటిలో కలిపి అద్భుతమైన ఫలితాలను పొందారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు.
"రాగి పూసిన జనపనార పూసల్లో క్రిమిసంహారక లక్షణాలుంటాయని నిరూపించడానికి మేము నాలుగు పాత్రల్లో నీటిని తీసుకున్నాము. ఒకదానిలో జనపనార పూసలు వేశాం. మరొక పాత్రలో రాగి పూసిన జనపనార పూసలు కలిపాం. ఇంకో దాంట్లో కాప్రస్ ఆక్సైడ్ పూసిన జనపనార పూసలు పోశాం. నాల్గవ బీకర్‌లో ఏమీ వేయకుండా వదిలివేశాం. ఆ తర్వాత వాటిలో సూక్షజీవులు చేరేకొద్ది ఏ పాత్రలో నీరు శుభ్రంగా ఉందో గమనించాం. ఈ అధ్యయనంతో నీటిని తక్కువ ఖర్చుతో సురక్షితంగా ఉంచడానికి సరళమైన పద్ధతిని కనిపెట్టాం. "
-రణధీర్ రాజ్, విద్యార్థి, ఐఐటీ మద్రాస్
ఇదీ చదవండి:ఆ సైకిల్‌పై 4 తరాల నాన్‌స్టాప్ సవారీ