గత 25 ఏళ్లలోనే అత్యంత ప్రకాశవంతమైన 'నియోవైజ్' తోకచుక్క భూమికి అతి సమీపానికి చేరువైందని నాసా పేర్కొంది. సోమవారం అత్యంత ప్రకాశవంతంగా ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ తోకచుక్కకు సూమారు 3.4 లక్షల కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. సౌర వ్యవస్థకు చెందిన ఈ తోక చుక్క ఆగస్టు వరకు ఆకాశంలో కనిపించనుంది.
మార్చిలో కనిపెట్టిన నాసా..
సూర్యుడి సమీపంలో ఉన్న కొన్ని శిథిలాలు కలసి నియోవైజ్ తోకచుక్క ఆవిర్భవించింది. నాసాకు చెందిన 'నియోవైజ్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్' మార్చిలో దీన్ని కనిపెట్టింది. దీంతో దాని పేరు మీదనే ఈ తోకచుక్కకు 'నియోవైజ్' అని పేరు పెట్టారు.
నియోవైజ్ తోకచుక్క అత్యంత ప్రకాశవంతమైనది. ఇది ఎలాంటి సాంకేతిక పరికరాలు లేకుండానే కనిపిస్తుందని నాసా వర్గాలు తెలిపాయి. అయితే దానిపొడవును బైనాక్యులర్ల సాయంతో చూడవచ్చని వెల్లడించాయి.
"నియోవైజ్ తోకచుక్క తిరిగి రావడానికి 7,000 సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకు వేచి ఉండమని నేను చెప్పను. 1990 నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యంత ప్రకాశవంతమైనది."
-జో మాసిరో, టెలిస్కోప్ డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్
నాసాకు చెందిన వ్యోమగామి బెహంకెన్.. తోకచూక్క ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.