ఒకప్పుడు మొబైల్ స్కానింగ్‌ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడోగానీ వీటి అవసరం వచ్చేది కాదు. కానీ కరోనా మహమ్మారితో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంటి నుంచే పనులు, చదువులు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతులతోనే బోధన కొనసాగిస్తున్నారు. అటు పాఠాల ప్రతులు, ఇటు జవాబు పత్రాలను పంపించుకోవటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులకు మొబైల్ స్కానర్లు సరికొత్త పరిష్కార మార్గంగా ముందుకొచ్చాయి. ఇక ఉద్యోగులు, వ్యాపారులు కూడా ప్రస్తుతం అవసరమైన పత్రాలు, సమాచారం కోసం వీటి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఫొటోల్లోని సమాచారాన్ని సరిదిద్దటానికి అవకాశం లేదు. అదే పీడీఎఫ్ ఫైల్ అయితే ఆన్‌లైన్‌లోనే సరిదిద్దుకోవచ్చు. తిరిగి అవతలివాళ్లకు పంపించుకోవచ్చు. ఇదెలా సాధ్యమవుతోందనేగా మీ సందేహం. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) పరిజ్ఞానంతోనే. ఇది ఫొటోల్లోని అక్షరాలను గుర్తిస్తుంది. టైప్ చేసిన, ప్రచురితమైన, చేత్తో రాసిన అక్షరాలతో కూడిన ఎలాంటి ఫొటోనైనా యంత్రం చదవగలిగిన సమాచారంగా మార్చేస్తుంది. స్కానింగ్ యాప్‌లలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉండే ఇలాంటి వెసులుబాటే అందరినీ ఆకర్షిస్తోంది. నిజానికి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశమున్నప్పటికీ మంచి మొబైల్ స్కానర్లన్నీ ఉచితంగా లభించేవి కావనీ తెలుసుకోవాలి. కొన్నింటిలో యాడ్స్ ప్రత్యక్షమవుతుండొచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్ల వ్యవహారమూ తోడై ఉండొచ్చు.
నోట్‌బ్లాక్
ఇదో ఉచిత యాప్. స్పెయిన్ కంపెనీ తయారుచేసిన ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్లకూ అందుబాటులో ఉంది. నోట్స్, పేపర్ డాక్యుమెంట్లు, డ్రాయింగ్స్, స్కెచ్‌లు, ఇమేజెస్ ఏవైనా స్కాన్ చేసేస్తుంది. మూలలను దానంతటదే గుర్తించి, సరైన కోణంలోకి సవరించుకుంటుంది. ఇమేజ్ నీడలను కూడా తొలగిస్తుంది. ఓసీఆర్ సపోర్టుతో కూడిన దీంతో ఒకేసారి ఎక్కువ పేజీలనూ స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసినవాటిని ఒకే డాక్యుమెంటుగా లేదూ వివిధ డాక్యుమెంట్లుగా సృష్టించుకోవచ్చు. ఫోల్డర్లుగా, ఉప ఫోల్డర్లుగా విడదీసుకోవచ్చు. పీడీఎఫ్‌గానే కాదు, జేపీజీ రూపంలోనూ సేవ్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోవచ్చు. స్కాన్ చేసిన తర్వాత వాటర్ మార్కు పడకపోవటం గమనార్హం.
![Notebloc Scanner App](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11481159_sca.jpg)
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్
ఉచిత, నమ్మకమైన స్కానర్లు కావాలనుకునేవారు దీన్ని నిర్భయంగా ఎంచుకోవచ్చు. డాక్యుమెంట్లు, బిజినెస్ కార్డులతో పాటు వైట్‌బోర్డు, బ్లాక్‌బోర్డు దృశ్యాలనూ ఇట్టే స్కాన్ చేసేస్తుంది. సవరించుకోవటానికి వీలుగా వీటిని వర్డ్, పవర్ పాయింట్ లేదూ పీడీఎఫ్‌ల రూపాల్లోకీ మారుస్తుంది. ఇవి తమకు తామే ఒన్‌డ్రైవ్, ఒన్‌నోట్, ఇతరత్రా డ్రైవ్‌లలో సేవ్ అవుతాయి కూడా. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్‌తో పాటు జర్మనీ, స్పానిష్, చైనీస్ భాషలనూ సపోర్టు చేస్తుంది.
![Microsoft Lens](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11481159_ms.png)
ఐఓఎస్ బిల్టిన్ స్కానర్
ఐఫోన్, ఐప్యాడ్ వాడేవారికి డాక్యుమెంట్ల స్కానింగ్ కోసం విడిగా థర్డ్‌పార్టీ యాప్‌ల అవసరమేమీ లేదు. బిల్టిన్‌గా వచ్చే నోట్స్ యాప్‌తోనే (ఐఓఎస్11) డాక్యుమెంట్లను స్కాన్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసి, కుడివైపున కింద ఉండే న్యూ నోట్స్ బటన్‌ను తాకాలి. కెమెరా గుర్తును తాకి, స్కాన్ డాక్యుమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డాక్యుమెంట్ల వరుస మీద కెమెరాను ఫోకస్ చేసి షటర్‌ను నొక్కాలి. ఎక్కువ డాక్యుమెంట్లను స్కాన్ చేయాలంటే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ.. కీప్ స్కానింగ్ ఆప్షన్‌ను నొక్కుతూ రావాలి. అనంతరం సేవ్ చేయాలి. ఒకే డాక్యుమెంట్‌గానూ భద్రపరచుకోవచ్చు. స్కాన్ అయిన పీడీఎఫ్ ఫైల్ నుంచి నోట్స్ యాప్ ఓసీఆర్ సాయంతో తనకుతానే టెక్ట్స్‌ను వెలికి తీస్తుంది కూడా.
![ios built in Scan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11481159_duo.jpg)
అడోబ్ స్కాన్
అడోబ్ బ్రాండ్‌కున్న విశ్వసనీయత తెలిసిందే. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లు రెండింటికీ అందుబాటులో ఉన్న ఇందులో అత్యవసరమైన అన్ని ఫీచర్లూ ఉన్నాయి. రసీదులు, నోట్స్, డాక్యుమెంట్లు, ఫొటోలు, బిజినెస్ కార్డులు, వైట్‌బోర్డులు.. ఇలా వేటినైనా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన పేజీలను తిరిగి వరుస క్రమంలోనూ పెడుతుంది. రంగులనూ కరెక్టు చేసుకోవచ్చు. బిల్టిన్ ఓసీఆర్ పరిజ్ఞానంతో కూడిన దీంతో ఒకేసారి ఎక్కువ పేజీలను స్కాన్ చేయొచ్చు. వీటిని ఒకే పీడీఎఫ్ ఫైలుగా ఉపయోగించుకోవచ్చు. క్లౌడ్‌లో భద్రపరచుకోవచ్చు. ఫొటోల్లోని డాక్యుమెంట్లను, రసీదులను తనకు తానుగానే గుర్తించి పీడీఎఫ్ స్కాన్‌లుగానూ మార్చగలదు. ప్రస్తుతం అడోబ్ స్కాన్‌లో బేసిక్ ఫీచర్లు మాత్రమే ఉచితంగా లభిస్తున్నాయి.
![Adobe Scan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11481159_cam.jpg)
గూగుల్ డ్రైవ్
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలావాటిల్లో గూగుల్ డ్రైవ్ నిక్షిప్తమయ్యే వస్తోంది. ఇందులో బిల్టిన్‌గా డాక్యుమెంట్లను స్కాన్ చేసే సదుపాయమూ ఉంది. డ్రైవ్ యాప్‌ను ఓపెన్ చేసి, కుడివైపు అడుగున ఉండే 'ప్లస్' గుర్తును క్లిక్ చేసి.. వచ్చిన ఆప్షన్లలో స్కాన్‌ను ఎంచుకుంటే చాలు. స్కాన్ చేయటానికి కెమెరాకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను నేరుగా డ్రైవ్ ఫోల్డర్‌లోనూ సేవ్ చేసుకోవచ్చు. జేపీజీలో సేవ్ అయిన వాటిని గూగుల్ డాక్స్‌తో ఓపెన్ చేసి, టెక్ట్స్‌గానూ మార్చుకోవచ్చు. టెక్ట్స్ సైజు, రంగునూ కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు.
![Google Dive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11481159_driv.jpg)
ఇదీ చదవండి:ఈ యాప్స్ వాడిచూస్తే.. వారెవ్వా అనాల్సిందే!