అత్యంత వేగంగా దూసుకొచ్చిన సౌర తుపాను భూమిపై పెద్దగా ప్రభావం చూపించలేదు. సూర్యుడి వాతావరణంలో ఏర్పడ్డ ఈ తుపాను భూ అయస్కాంత క్షేత్రానికి సమీపంలో కొద్ది గంటల పాటు ఉండి వెళ్లిపోయిందని అమెరికా జాతీయ మహాసముద్ర, వాతావరణ పరిపాలన(ఎన్ఓఏఏ) సంస్థ తెలిపింది. అయితే, అంతరిక్ష వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ చోటు చేసుకోలేదని వివరించింది.
ఎన్ఓఏఏ ప్రకారం.. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 22:11 గంటలకు ఈ తుపాను భూమిని దాటి వెళ్లింది. 'జియోమ్యాగ్నటిక్ కే-ఇండెక్స్' ఈ తుపాను తీవ్రత నాలుగు పాయింట్లుగా నమోదైంది. భూఅయాస్కాంత తుపానుల తీవ్రతను కొలిచేందుకు కే ఇండెక్స్‌ను ఉపయోగిస్తారు. 4 పాయింట్లు అంటే.. తుపాను తీవ్రత స్వల్పంగా ఉందని అర్థం.
ఏం కాలేదు!
తుపాను భూమిని దాటే సమయంలో.. కెనడా, అలస్కా వంటి దేశాల్లోని పవర్ గ్రిడ్లలో స్వల్ప అంతరాయాలు ఏర్పడతాయని సంస్థ అంచనా వేసింది. అయితే, అలాంటి ఘటనలు జరిగినట్లు ఎక్కడా వార్తలు రాలేదు.
ఈ సౌర తుపాను కారణంగా సమాచార వ్యవస్థపై ప్రభావం పడుతుందని తొలుత వార్తలు వచ్చాయి. భూఉష్ణోగ్రత పెరుగుతుందని, తద్వారా శాటిలైట్లు ప్రత్యక్ష ప్రభావానికి లోనవుతాయని ఓ వెబ్సైట్ తెలిపింది. ఫలితంగా జీపీఎస్ నేవిగేషన్, శాటిలైట్ టీవీలు, మొబైల్ సిగ్నళ్లకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇదీ చదవండి: డెల్టా ముప్పు- మళ్లీ కర్ఫ్యూ దిశగా ఆ దేశం!