వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో యూజర్లలో గందరగోళం నెలకొంది. వాట్సాప్ వాడాలా వద్ద అనే ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం ఉన్న ఉత్తమ ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు.
ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లవైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా వాట్సాప్ బదులు సిగ్నల్ వాడమని సలహా ఇచ్చి వాట్సాప్‌ను మరింత ఇరకాటంలో పెట్టేశారు.
మరి వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లలో ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎందులో యూజర్ల డేటా సురక్షితంగా ఉంటుంది? వాట్సాప్ డేటా షేరింగ్ నిబంధనతో యూజర్ల నుంచి ఎలాంటి డేటా సేకరించనుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ ఫీచర్లు..
వాట్సాప్‌లో అనేక వెసులుబాట్లతో పాటు పలు పరిమితులూ ఉన్నాయి. ఇందులో యూజర్లు గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో 256 మందిని మాత్రమే చేర్చుకునేందుకు వీలుంటుంది. వ్యక్తిగత, గ్రూప్ వాయిస్, వీడియో కాల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే గ్రూప్ వీడియో కాల్ 8 మందికే పరిమితి. ఇందులో ఉన్న బ్రాడ్కాస్ట్ ఫీచర్‌తో ఒకే సందేశాన్ని ఎక్కువ మందికి వ్యక్తిగతంగా పంపేందుకు వీలుంటుంది.
వాట్సాప్‌లో ఇన్‌స్టా స్టోరీని పోలిన స్టేటస్ ఫీచర్ ఉంది. సిగ్నల్, టెలిగ్రామ్‌తో పోలిస్తే ఇది ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ యాప్ ద్వారా ఇతరులతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవచ్చు. వీడియో, ఫొటో, ఆడియో ఫైళ్లకు 16 ఎంబీ పరిమితి. డాక్యుమెంట్లకు ఈ పరిమితి 100 ఎంబీ వరకు ఉంది.
వాట్సాప్ గూగుల్ డ్రైవ్, ఐ క్లౌడ్ ద్వారా ఉచితంగా థర్డ్ పార్టీ బ్యాకప్ సేవలను అందిస్తోంది.
టెలిగ్రామ్‌లో వాట్సాప్‌తో పోలిస్తే అనేక ఇతర కొత్త ఫీచర్లు ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏకంగా 2 లక్షలు మందిని యాడ్ చేయొచ్చు. పోల్స్, హ్యాష్‌ట్యాగ్స్, క్విజ్‌ల వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇవి గ్రూప్ కమ్యూనికేషన్లను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. టెలిగ్రామ్‌లో పంపించుకునే ఫైళ్ల సైజు 1.5 జీబీ వరకు ఉండొచ్చు. వాట్సాప్‌లో లేని సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్‌ను టెలిగ్రామ్ అందిస్తోంది. యూజర్లు వాయిస్, వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలుంది.
సిగ్నల్.. మెసేజ్, వాయిస్, వీడియో కాల్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇవన్నీ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావడం గమనార్హం. ఇందులో బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్ లేదు. గ్రూప్‌లు క్రియేట్ చేసుకునేందుకు, గ్రూప్ కాల్స్ మాట్లాడేందుకు వీలుంది. ఏదైనా మర్చిపోకూడని విషయాన్ని గుర్తు చేసేందుకు 'నోట్ టూ సెల్ఫ్' అనే సరికొత్త ఫీచర్‌ను అందిస్తోంది సిగ్నల్. ఈ యాప్‌లోనూ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్ ఉంది. వాట్సాప్‌తో పోలిస్తే.. ఇందులో ఎమోజీలు చాలా తక్కువ.
సెక్యూరిటీ..
వాట్సాప్‌లో మెసేజ్‌లు 'ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్'. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చినా.. వ్యక్తిగత చాటింగ్ డేటాను ఫేస్బుక్ సేకరించదు. అయితే వాట్సాప్ అందిస్తున్న బ్యాకప్ మాత్రం ఎన్క్రిప్టెడ్ కాదు.
టెలిగ్రామ్‌లోనూ చాటింగ్లకు 'ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్' సదుపాయం ఉన్నా.. అది డిఫాల్డ్‌గా కాదు. ఇందులో చాటింగ్‌ను సురక్షితంగా పెట్టుకోవాలంటే.. యూజర్లు 'సీక్రెట్ చాట్స్' ఫీచర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. యూజర్ల చాటింగ్‌కు సంబంధించి ఎలాంటి డేటా సేకరించడం లేదని టెలిగ్రామ్ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే టెలిగ్రామ్ సీక్రెట్ చాట్స్ ఫీచర్ డెస్క్‌టాప్ వెర్షన్లో అందుబాటులో లేదు.
సెక్యూరిటీ విషయంలో వాట్సాప్, టెలిగ్రామ్‌లతో పోలిస్తే సిగ్నల్ చాలా ఉత్తమమని చెప్పొచ్చు. వాట్సాప్‌లానే ఇందులోనూ చాటింగ్‌లు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్. యూజర్ల వ్యక్తిగత డేటాకు మరింత ప్రాధాన్యమిస్తూ.. మెటా డేటాను ఎన్‌క్రిప్ట్ విధానంలో సరక్షితంగా ఉంచుతుంది సిగ్నల్. గ్రూప్ కాల్స్‌కూ ఎన్‌క్రిప్షన్ సదుపాయముంది.
డేటా సేకరణ..
సిగ్నల్ యాప్ యూజర్ల నుంచి ఫోన్ నంబర్ తప్ప ఏ ఇతర వివరాలను సేకరించదు.
టెలిగ్రామ్ యూజర్ ఐడీ, కాంటాక్ట్స్, కాంటాక్ట్ సమాచారాన్ని సేకరిస్తుంది.
వాట్సాప్ కొత్త నిబంధనలు అమలు చేస్తే.. యూజర్ ఐడీ, డివైజ్ ఐడీ, కొనుగోళ్ల సమాచారం, ప్రకటనల డేటా, ఫోన్ నంబర్, లొకేషన్, కాంటాక్ట్‌లు, ఈమెయిల్, క్రాష్ డేటా, ప్రొడక్ట్ ఇంటిగ్రేషన్, పేమెంట్ సమాచారం, కస్టమర్స్ సపోర్ట్, ప్రోడక్ట్ ఇన్ట్రాక్షన్ సహా ఇతర డేటాను సేకరించనుంది.
అయితే ఈ కొత్త నిబంధనలతో స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేసే యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం వాట్సాప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది. వ్యక్తిగత చాట్స్, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండడం వల్ల ఆ వివరాలను తాము చూడలేమని స్పష్టం చేసింది. వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటామని తెలిపింది.