రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేశారు!
ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ హైవే... ఒకప్పుడు దేశంలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే రహదారుల్లో ఒకటి! 2016 దాకా ఇక్కడ ఏటా 150 పైచిలుకు తీవ్ర రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడవి 86కి... దాదాపు 40 శాతం తగ్గాయి. ఈ తగ్గుదలకి కారణం ఎక్స్‌ప్రెస్ హైవేని రోడ్డు ప్రమాదరహితంగా చేయాలన్న ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ అనే సంస్థ సంకల్పం. సంస్థ ఈ రోడ్డులోని కీలక ప్రాంతాల్లో ‘ఇంటెలిజెంట్ కెమెరా’లని పెట్టింది. ఇవి మామూలు సీసీ కెమెరాల్లాగే పనిచేస్తాయి కానీ... డ్రైవర్‌లు స్టీరింగ్ వదిలేసి ఫోన్‌లో మాట్లాడుతున్నట్టో, నిద్రలో జోగుతున్నట్టో, వాహనాలు ఉన్నపళంగా ఆగిపోయినట్టో గమనిస్తే అప్రమత్తమై ఆ విషయాన్ని పోలీసులకి చెబుతాయి. ఆగిపోయిన వాహనాల విషయాన్ని డ్రోన్‌లకి చేరవేస్తాయి. కెమెరాల నుంచి సమాచారం అందగానే డ్రోన్‌లు రివ్వున వచ్చి ఇక్కడ వాలిపోతాయి. వంద మీటర్ల వెనకున్న వాహనాలకీ సైరన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తాయి. ఈ ఇంటెలిజెంట్ కెమెరాలూ, డ్రోన్‌లూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో పనిచేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ రోడ్డు భద్రతా సేవలు అందిస్తోంది సేవ్‌లైఫ్ ఫౌండేషన్ సంస్థ. పీయూష్ తివారీ దాని వ్యవస్థాపకుడు. 2007లో ఓ రోడ్డుప్రమాదంలో తన ఫ్రెండ్‌ని కోల్పోయి, లాభాపేక్ష లేని ఈ సంస్థని ప్రారంభించారు.
ఉచితంగా దూరవైద్యం!
కొవిడ్ వచ్చాక టెలిమెడిసిన్ సేవల్ని వినియోగించుకోవడం పెరుగుతోంది. కరోనా బాధితులూ, కోలుకున్నవాళ్ల కోసం అలాంటి ఏడువేలమంది వైద్య నిపుణుల సేవల్ని టెలిమెడిసిన్ ద్వారా ఉచితంగా అందిస్తుంది ‘స్టెప్ వన్’ సంస్థ. తెలుగు, తమిళం, మరాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లిషు, కన్నడ... భాషల్లో రోజులో ఎప్పుడైనా దీని సేవల్ని పొందవచ్చు. ఏడువేలమంది ఫిజీషియన్‌లూ ఛాతీ నిపుణులతోపాటూ వెయ్యిమంది సైకాలజిస్టులూ, 500 మంది నర్సులూ అందుబాటులో ఉంటారు. మనదేశంలో కొవిడ్ కేసులు మొదలైన మార్చి నెలలో ఓ చిన్న వాట్సాప్ గ్రూప్‌గా బెంగళూరులో మొదలైంది ‘స్టెప్ వన్’ సంస్థ. అదే పెరిగి పెద్దదై ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఉచిత టెలిమెడిసన్ సంస్థగా మారింది. ప్రజలకి సేవలందించడానికి డేటా ఎనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌తో వేలాది మందిని ఎలా సమన్వయం చేయొచ్చో ఇది నిరూపిస్తోంది. దాదాపు 170 మంది ఐటీ నిపుణులు ఈ సేవల్ని స్వచ్ఛందంగా సమన్వయం చేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ల పంపిణీ సజావుగా సాగడానికీ, టీకా అవసరం ఉన్నవాళ్ల పేర్లు నమోదుచేసుకోవడానికీ వీలు కల్పిస్తూ స్టెప్ వన్ సిద్ధమవుతోంది!
మంచి పండ్లేవో చెప్పేస్తుంది!
మనదేశంలో ఏటా ఆవిర్భవిస్తున్న నయా టెక్ స్టార్టప్‌లలో సాగువైపు దృష్టిసారించేవి చాలా తక్కువ! ‘ఇంటెల్లో ల్యాబ్స్’ అలాంటి అరుదైన స్టార్టప్. ఓ రైతు టొమాటోలో, మామిడిపండ్లో సాగు చేశాడనుకుందాం. వాటిని అతని దగ్గర్నుంచి కొనేటప్పుడు గ్రేడ్‌లని నిర్ణయిస్తారు. ముఖ్యంగా సూపర్‌మార్కెట్‌లకి అమ్మేటప్పుడు ఈ గ్రేడ్‌ల నిర్ణయమే కీలకం. అలాంటప్పుడు రైతో వ్యాపారో ప్రతి పండునీ చూస్తూ గ్రేడ్‌లు నిర్ణయించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ‘ఇంటెల్లో ల్యాబ్స్’ సంస్థ ఆ పనిని క్షణాల్లో చేసిపెడుతుంది. ఈ సంస్థ రూపొందించిన ‘ఇంటెల్లో ట్రాక్’ ఆప్ ద్వారా ఎదురుగా ఉన్న పండ్లని ఫొటో తీస్తే చాలు... అందులో ఏవేవి ఏ గ్రేడ్‌కి చెందుతాయో వెంటనే చెబుతుంది. పండనివీ, పగిలినవీ, ముదిరినవీ, కుళ్లినవీ ఉంటే చూపిస్తుంది. ఆ రకంగా అటు రైతులూ, ఇటు వ్యాపారులూ ఎవరూ మోసపోకుండా చూస్తుంది. నలభై రకాల పండ్లూ, కూరగాయల్ని ఇది విశ్లేషించగలుగుతుంది. ఈ ఆప్ డేటా ఎనలిటిక్స్ సాంకేతికతతో కూడుకున్న సాఫ్ట్‌వేర్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో ఉద్యాన శాస్త్రవేత్తలూ నిపుణులూ ఇదివరకే నిర్ధారించిన గ్రేడ్‌ల వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మనం పండ్లని ఫొటోతీసి పంపగానే తన దగ్గర ఉన్న వివరాలతో వీటిని క్షణాల్లో పోల్చి... వాటి గ్రేడింగ్‌ని మనముందు పెడుతుంది! ప్రస్తుతం ఈ స్టార్టప్ రిలయన్స్ ఫ్రెష్ సంస్థకి సేవలందిస్తోంది.
- ఇదీ చూడండి : వినూత్న ఆలోచన... సాయం కోరిన క్షణాల్లోనే రక్షణ