అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' త్వరలో చంద్రుడిపైకి మరోసారి మానవుడిని పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సారి చంద్రుడిపై కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటుకు.. ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ నోకియా సహాయం తీసుకోనున్నట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో చంద్రుడిపై 4జీ ఎల్టీఈ వ్యవస్థ ఏర్పాటు కోసం నోకియాకు.. 14.1 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపింది నాసా.
జాబిల్లి ఉపరితలంపై వ్యోమగాములు సంచరిస్తున్నప్పుడు.. చంద్రుడిపై ఉన్న స్థావరాలు, వ్యోమగాముల మధ్య కమ్యూనికేషన్కూ 4జీ ఎల్టీఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని నాసా సహచర అధికారి జేమ్స్ రౌటర్ తెలిపారు.
'నాసా సహాయంతో.. భూ ఉపరితలంతో పోలిస్తే నాణ్యమైన కమ్యూనికేషన్ కోసం చంద్రుడిపై వాతావరణానికి అనుగుణంగా కమ్యూనికేషన్ సాంకేతికతలో ఎలాంటి మార్పులు అవసరమవుతాయనే విషయాన్ని నోకియా పరిశీలిస్తుంది. ఇది స్పేస్ క్రాఫ్ట్లతో కమ్యూనికేషన్కూ తోడ్పడుతుంది.' అని రౌటర్ వివరించారు.
అయితే చంద్రుడిపై 4జీ ఎల్టీఈ నెట్వర్క్ నిర్మించడం కోసం నోకియాకు ఇది మొదటి ప్రయత్నం కాదనే చెప్పాలి. ఎందుకంటే చంద్రుడిపై అపోలో 17 మిషన్ ల్యాండింగ్ కోసం ఎల్టీఎల్ నెట్వర్క్ నిర్మించేందుకు వొడాఫోన్తో నోకియా చేతులు కలిపింది. ఈ నెట్వర్క్తో హై డెఫినిషన్ వీడియోను చంద్రుడి నుంచి భూమికి పంపేందుకు వీలుండేది.
ఇదీ చూడండి:రూ.2,500కే జియో నుంచి 5జీ ఫోన్!