అసలు టీకా అంటే ఏంటి ? ప్రమాదకర వ్యాధుల నుంచి ఈ చిన్న వ్యాక్సిన్ ఎలా రక్షిస్తుంది ? శరీరంలోకి టీకా ఎక్కించిన తర్వాత ఏం జరుగుతుంది ? అసలు వ్యాక్సిన్ తయారీ, టెస్టింగ్ ఎలా జరుగుతుంది? సామాన్యుల మదిని తొలిచేసే ప్రశ్నలివి. వ్యాక్సిన్ కథా-కమామిషుపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం..
అసలేంటీ టీకాలు ?
ప్రమాదకర వ్యాధులబారిన ప్రజలు పడకుండా కాపాడేందుకు.. టీకాలు వేయటం అత్యంత సులభమైన, సురక్షితమైన మార్గం. శరీరంలోని సహజమైన వ్యాధినిరోధకతను మేల్కొలిపి.. వ్యాధికారకాలతో పోరాడేలా శరీరాన్ని సన్నద్ధం చేసేదే వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే... ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆ వ్యాధి కారకాలతో పోరాడి పైచేయి సాధిస్తుంది. భవిష్యత్తులో శరీరం ఆ వ్యాధి బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటుంది ఇదే వ్యాక్సిన్ చేసే పని.
ఇలా టీకాలు శరీరంలో యాంటీబాడీస్ తయారుచేస్తాయి. సాధారణంగా వ్యాక్సిన్లను ఇంజెక్షన్ల రూపంలోనే ఎక్కువగా ఇస్తుంటారు. కొన్నిసార్లు నోటి ద్వారా.. లేదంటే ముక్కులో స్ప్రే చేయటం ద్వారా శరీరంలోకి పంపుతుంటారు.
టీకాలకు ఎందుకంత ప్రాధాన్యం?
ప్రజలను వ్యాధికారకాల నుంచి కాపాడేందుకు ఇదే అత్యుత్తమ మార్గం. దశాబ్దాలుగా అనేక ప్రయోగాలు, పరిశోధనల తర్వాతే ఇది నిరూపితమైంది. ప్రస్తుతం దాదాపు 20రకాల వ్యాధులకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా ఏటా 30లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఒకసారి వ్యాక్సిన్ చేయించుకుంటే.. స్వీయ రక్షణే కాకుండా, చూట్టూ ఉన్నవారిని రక్షించే అవకాశముంటుంది. టీకా వేయించుకున్నవారు వ్యాధి సంక్రమణను అడ్డుకునే అవకాశం కలుగుతుంది. కరోనా వైరస్ ప్రభావం పెద్దవారితో పోల్చినపుడు పిల్లల్లో తక్కువగా ఉండటానికి.. ఇతర వ్యాధులు రాకుండా తీసుకున్న టీకాలే కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారి నుంచి రక్షణకు.. వ్యాక్సిన్ కీలకమని ప్రపంచం వేగంగా గుర్తించింది.
శరీరంలో వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది ?
వ్యాధినిరోధకతను సన్నద్ధం చేసేందుకు ప్రవేశపెట్టిన డమ్మీ వైరస్ లేదా బ్యాక్టీరియాతో శరీరం అప్రమత్తమవుతుంది. వ్యాధికారకాలను గుర్తించి వాటితో పోరాటానికి సన్నద్ధమవుతుంది. ఈ పరిస్థితుల్లోనే యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి శరీరంలో భద్రతా బలగాలుగా పనిచేసి.. వ్యాధికారకాలతో పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి.
ఈ పరిస్థితుల్లో అసలైన వ్యాధికారకాలు శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. అప్పటికే సుశిక్షితంగా ఉన్న రోగనిరోధక సైన్యం.. వాటిని చిత్తుచేసి అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. ఇలా పనిచేస్తుంది గనుకే.. వ్యాక్సిన్లను అత్యుత్తమ మార్గంగా చెబుతారు. రోగనిరోధక శక్తి సామర్థ్యం పెంచి.. దానికి వ్యాధికారకాలను గుర్తు చేసి ఎదుర్కునేందుకు ఏళ్ల తరబడి సిద్ధంగా ఉంచుతుంది. శరీరం వ్యాధిబారిన పడకముందే పోరాటానికి సిద్ధం చేయటం వ్యాక్సిన్ల ప్రత్యేకత.
వ్యక్తులు-సమూహాలను ఎలా పరిరక్షిస్తుంది ?
వ్యాధి నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేయటమే.. వ్యాక్సిన్ల పని. వ్యాధికారకాలతో పోరాడే శరీరానికి.. అసలైన వైరస్ లేదా బ్యాక్టీరియా వస్తే.. ఎలా పోరాడాలో ముందే చెప్పి పెడుతుంది. కాబట్టే సదరు వ్యాధికారకాలు ఒంట్లోకి ప్రవేశించగానే కాచుకుని చూస్తున్న శరీరంలోని రోగనిరోధక భద్రతా బలగాలు వాటిపై విరుచుకుపడి అంతం చేస్తాయి. ఇలా ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకుంటే.. వ్యాధి రాకుండా.. అది మరొకరికి చేరకుండా ఉంటుంది. సమాజంలో ఎక్కువమందిలో ఈ రోగనిరోధకశక్తి సన్నద్ధమైతే.. కొంతమంది వ్యాక్సిన్ చేయించుకోకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. వేరే సమస్యలతో వ్యాక్సిన్ చేయించుకోలేనివారికి సైతం సామాజిక వ్యాప్తి ఉండదు. కాబట్టి వ్యాధి సోకదు. దీనినే 'హెర్డ్ ఇమ్యూనిటి' అంటారు.
హెర్డ్ ఇమ్యూనిటిలో భాగంగా ఎక్కువమంది వ్యాక్సిన్లు తీసుకున్నటైతే.. తక్కుమందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధికారకాలను ఎక్కడికక్కడ నిలువరించినట్లు అవుతుంది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నా.. హెర్డ్ ఇమ్యూనిటి సమాజంలో చాలా కీలకంగా పని చేస్తుంది. కరోనా విషయంలోనూ ఇదే జరగాలని వైద్య నిపుణులు ఆశిస్తున్నారు
వ్యాక్సిన్ తప్పనిసరి వేసుకోవాలా ?
టీకా వేసుకోకపోతే.. ప్రమాదకరమైన జబ్బులబారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వ్యాధులు ప్రాణాలు తీసేంత తీవ్రంగా ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వ్యాక్సిన్లు ఏటా 30లక్షల మందిని కాపాడుతున్నాయి.
కొన్ని అసాధారణ వ్యాధులు.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోంచి పుట్టుకొస్తున్నాయి. వాటి విషయంలో సొకకండా జాగ్రత్తలు తీసుకోవటం తప్ప.. మరేం చేసే అవకాశం లేదు. కానీ వ్యాక్సిన్‌తో అడ్డుకోగలిగే జబ్బులను ఆశ్రద్ధ చేయటం సరికాదు. వ్యాక్సిన్లు అనేవి వ్యక్తిగత ఆరోగ్య రక్షణకే కాదు, అంటువ్యాధుల్లాంటివి ప్రబలకుండా చూసే సామాజిక బాధ్యత కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రస్తుతం పిల్లలకు, పెద్దలకు కలిపి యాభై రకాలకు పైగా వ్యాక్సిన్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక్కో వ్యాక్సిన్ తయారీని పరీక్షించి చూడడానికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. వందలు, వేలు కాదు.. కొన్ని లక్షల మంది శ్రమించి పరిశోధిస్తేనే వ్యాక్సిన్ మానవాళికి అందుబాటులోకి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం హెచ్‌ఐవీ, మలేరియా, క్షయ లాంటి పాతిక వ్యాధుల కోసం దాదాపు 240 వ్యాక్సిన్లు ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నాయి.
వ్యాక్సిన్లపై వివాదాలు..
వ్యాక్సిన్లపై వివాదాలు కూడా ఉన్నాయి. తయారీలో వాడే పదార్థాల గురించి కొందరు మతపరమైన అభ్యంతరాలు వ్యక్తంచేసేవారు. పేదలకు ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ వేయించడమూ అపోహలకు దారితీసేది. కొన్ని సందర్భాల్లో పుకార్లు, తప్పుడు వార్తలు కూడా వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా పనిచేసేవి.
అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపు దేశాల్లో కొందరు చదువుకున్న తల్లిదండ్రులే వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం సమస్య పెరుగుతోందన్న వాదన లేవదీశారు. ఆ వాదన నిరూపణ కాకపోయినా కొందరు వ్యాక్సినేషన్ మానేస్తున్నారు. తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలనడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనంటూ ఇప్పటికీ అమెరికాలాంటి కొన్నిచోట్ల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధిలో దశలు ?
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి.. వ్యాక్సిన్ తయారీ చాలా సున్నితమైన అంశంగా పరిణించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా.. శాస్త్రవేత్తలు, ప్రముఖ పరిశోధనా సంస్థలు, ఔషధ సంస్థలు నిరంతరం వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం శ్రమిస్తుంటాయి. ఒక్క వ్యాక్సిన్ అభివృద్ధినుంచి ప్రజలకు అందుబాటులోకి రావటానికి అనేక దశలో దాటాల్సి ఉంటుంది.
- పరిశోధన దశ
- ప్రీ-క్లినికల్ దశ
- క్లినికల్ డెవలప్మెంట్
- సమీక్ష-ఆమోదం
- తయారీ
- నాణ్యత పరీక్షలు
- మొదటి దశ: పరిశోధన-అభివృద్ధి
వ్యాక్సిన్ తీసుకురావటంలో అన్నింటికన్నా ముందు.. ఫార్ములా కనుగొనటం చాలా ముఖ్యం. సాధారణంగా ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే 2నుంచి 4 ఏళ్లు పడుతుంది. కరోనా విషయంలో ఈ లెక్కలు మారినా.. శాస్త్ర సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లోనూ ఏడాది పూర్తయినా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఏ వ్యాధికైనా టీకా రూపొందించాలంటే.. సదరు వ్యాధి కారకం జన్యురూపం తెలిసుండాలి. కరోనా వైరస్ జన్యురూపం చైనా ప్రపంచంతో పంచుకుంది. దాన్ని ఆధారంగా చేసుకునే.. టీకాల పరిశోధన శరవేగంగా జరుగుతోంది. చాలా వ్యాక్సిన్లు వ్యాధికారకం ప్రోటీన్ ఆధారంగా కాకుండా.. దాని జన్యుక్రమం ఆధారంగా రూపొందుతాయి.
- రెండవ దశ: ప్రీ-క్లినికల్
ఒక వ్యాక్సిన్‌పై పరిశోధన, అభివృద్ధి పూర్తైన తర్వాత.. టెస్టింగ్‌కు సిద్ధం చేస్తారు. చాలాసార్లు జంతువులు, మొక్కలపై పరీక్షలు జరుపుతారు. ఆ ఫలితాల ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు. వ్యాక్సిన్ ప్రయోగం తర్వాత జంతువులు, మొక్కలు ఎలా స్పందిస్తున్నాయన్నది లెక్కేస్తారు. నెగెటివ్ ఫలితాలు వస్తే.. వ్యాక్సిన్ తయారీ మళ్లీ మొదటిదశకు వస్తుంది.
- మూడవ దశ: క్లియనికల్ ట్రయల్స్
వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇదే అత్యంత కీలక దశ. ఈ దశలో టీకా సామర్థ్యం మనుషులపై పరీక్షిస్తారు. చాలాసార్లు 2వ దశ దాటిన టీకాలు.. ఈ దశలో విఫలమవుతుంటాయి. ఈ దశలోనూ కొన్ని ఫేజ్‌లు ఉంటాయి.
- ఫేజ్-1: మొదటి ఫేజ్‌లో ఒక్క చిన్న సమూహంపై పరీక్షలు జరిపి యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయో.. లేదో పరీక్షిస్తారు. ఇందుకు 3నెలల సమయం పడుతుంది.
- ఫేజ్-2: తర్వాత 6-8నెలల సమయంలో ఎంపిక చేసిన కొన్ని వందల మందికి టీకాలు వేస్తారు. రోగనిరోధక శక్తి స్పందనను సునిశితంగా పర్యవేక్షిస్తారు. రియాక్టోజెనిసిటీ అనే అంశంలో టీకా సాధారణ, ప్రతికూల ప్రతిచర్యలను విశ్లేషిస్తారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఈ సమయాన్ని బాగా కుదించారు.
- ఫేజ్-3: ఇందులో వేలాదిమందికి టీకాలు వేసి చూస్తారు. సమాజంలో వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉందన్న అంశాలను పరిశీలిస్తారు. ఇది కూడా 6 నుంచి 8 నెలల సమయం తీసుకుంటుంది.
- నాలుగో దశ: సమీక్ష-ఆమోదం
అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అన్ని రకాల పరీక్షలు దాటుకుని వచ్చిన అనంతరం.. తయారీదారులు సంబంధిత నియంత్రణ వ్యవస్థల ముందుకు తీసుకెళ్తారు. సాధారణంగా ఇందుకు చాలా సమయమే పడుతుంది. అయితే, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని సడలింపులు ఉంటాయి.
- ఐదవ దశ: తయారీ-నియంత్రణ
అన్ని దశలు దాటుకుని.. ఆమోద ముద్ర పడిన తర్వాత, ఈ దశ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థ సత్తాకు పరీక్షగా నిలుస్తుంది. భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు.. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆర్థిక వనరులు కీలకంగా మారతాయి.
అభివృద్ధికే ఆపసోపాలు...
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సర్వసాధారణంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్లన్నీ.. ఒకప్పుడు తయారీకి ఏళ్ల సమయం తీసుకున్నాయి. లక్షలమంది ప్రతి ఏడాది వీటిని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ వీటిని సురక్షితంగా మార్చారు. అన్ని ఔషధాల మాదిరిగానే, ప్రతి వ్యాక్సిన్ ఒక దేశంలో ప్రవేశపెట్టడానికి ముందే అది సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి కఠినమైన పరీక్షలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అన్ని దశలు విజయవంతంగా దాటిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా మనుషులపై ప్రయోగించటం అత్యంత కీలకం.. ఈ దశ దాటిన చాలా టీకాలు మార్కెట్లోకి వచ్చాయి.
సమాజంలో ధనుర్వాతం, మెదడువాపు, మీజిల్స్, హెపటైటిస్ లాంటి ప్రమాదకర జబ్బులు చాలా ఉన్నాయి. వాటి కోసం వ్యాక్సిన్లు వేయించాల్సిందే. పోలియో అయితే 1990వ దశకం మొదట్లో కూడా మనదేశంలో రోజుకు వెయ్యి వరకూ కేసులు వచ్చేవి. వ్యాక్సినేషన్ ప్రక్రియని ప్రభుత్వాలు సక్రమంగా అమలుచేయడం వల్ల ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. అదే సమయంలో కొత్త కొత్త వైరస్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇప్పుడు కరోనా కూడా వాటికి తోడవబోతోంది.
వ్యాక్సిన్లు వేసిన తర్వాత కూడా ధీర్ఘకాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేది పర్యవేక్షించాల్సి ఉంటుంది. టీకాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవని నిర్ధరించుకోవటం కూడా ముఖ్యం. ఇలా అన్నిరకాలుగా విజయవంతమైన టీకాలను పిల్లల్లో వేస్తూ వారు ఎటువంటి వ్యాధులబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాం.
వ్యాధి నిరోధకతే అత్యంత కీలకం
ఆధునిక వైద్యంలో వ్యాధి నిరోధకత అత్యంత ముఖ్యమైనదే కాదు, విజయవంతమైన విభాగం కూడా. ప్రజారోగ్యానికి సంబంధించి చాలా తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రభావం చూపే విభాగమూ ఇదే. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం- 94 దేశాల్లో పదిరకాల వ్యాక్సిన్లు వేయడానికి రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా 44 లక్షల కోట్ల వైద్య ఖర్చు ఆదా అయినట్లు తేలింది. పలురకాల అంటువ్యాధుల దగ్గరనుంచి క్యాన్సర్ల వరకూ ఈ వ్యాక్సిన్ల ద్వారా నివారించగలుగుతున్నాం.
నిరుపేద దేశాలన్నిట్లోనూ వ్యాక్సినేషన్‌ని సరిగ్గా అమలుచేస్తే లక్షల మరణాసలను తప్పించవచ్చంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గత రెండు దశాబ్దాలుగా వ్యాధి నిరోధకతకు సంబంధించి పరిశోధన మరింత విస్తృతమైంది. మాలెక్యులార్ జెనెటిక్స్, మైక్రో బయాలజీ, జీనోమిక్స్ లాంటి వాటిని వ్యాక్సినోలజీలో ఉపయోగించడం మొదలుపెట్టారు. దాంతో కొత్త వ్యాధులకు వ్యాక్సిన్లు కనిపెట్టడానికి మరింత వీలు కలుగుతోంది.
వ్యాక్సిన్ల విజయం
వ్యాక్సిన్లు తయారు చేసిన దేశాల్లో.. జాతీయ-ప్రాంతీయ నియంత్రణ సంస్థలు టీకా అభివృద్ధిని పర్యవేక్షిస్తాయి. క్లినికల్ ట్రయల్స్‌ను ఆమోదించడం, వాటి ఫలితాలను అంచనా వేయడం, లైసెన్సింగ్‌పై నిర్ణయాలు తీసుకోవడం ఇందులో కీలకంగా ఉంటాయి. నియంత్రణా వ్యవస్థలు.. సంస్థలకు ఆమోదయోగ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలను సూచించాల్సి ఉంటుంది.
టీకా అభివృద్ధి చేసిన తర్వాత.. జాతీయ నియంత్రణ వ్యవస్థలు తమ దేశంలో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాయి. ప్రపంచానికి అందుబాటులోకి తేవాలంటే.. అందుబాటులో ఉన్న ఆధ్యయన పత్రాలను సమీక్షించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటికి మద్దతుగా నిలుస్తుంటుంది.