చర్మ క్యాన్సర్ చికిత్సకు సరికొత్త పద్ధతిని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాగ్నెటిక్ నానోఫైబర్స్తో రూపొందించిన నాన్ ఇన్వేసివ్ బాండేజీతో మృత కణాల(కణితి)పై వేడిని ప్రసరింపజేసి చికిత్స అందివచ్చవని చెబుతున్నారు.
ఏమిటీ చర్మ క్యాన్సర్?
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం కారణంగా చర్మ క్యాన్సర్ వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుందని ఐఐఎస్సీ పరిశోధకులు తెలిపారు. మెలానోమా.. చర్మంలోని వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ నుంచి అభివృద్ధి చెందుతుంది. రెండోది నాన్-మెలనోమా.. ఇది ఇతర చర్మ కణాల వల్ల వస్తుంది.
చికిత్స విధానాల్లో సవాళ్లు..
నాన్-మెలనోమా చర్మ క్యాన్సర్ విస్తృతంగా ఉన్నప్పటికీ, మెలనోమా ప్రాణాంతకమని.. మరణాల రేటు ఎక్కువగా ఉందని ఐఐఎస్సీ తెలిపింది. ఈ క్యాన్సర్‌కు సాధారణంగా సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. కానీ వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి.
హైపర్థెర్మియాతో..
చర్మ క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి హైపర్థెర్మియా మంచి ప్రత్యామ్నాయమని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా క్యాన్సర్ ప్రభావిత కణజాలాలకు వేడిని అందించి చికిత్స చేస్తారు. ఇటీవలి కాలంలో ఈ విధానంలో మరింత సమర్థంగా చికిత్స అందించే విషయమై శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఐఐఎస్సీ పరిశోధకులు తెలిపారు.
అందులో ఒక సాంకేతికత మాగ్నెటిక్ హైపర్థెర్మియా. దీనిలో మాగ్నెటిక్ నానోపార్టికల్స్ బాహ్య ప్రత్యామ్నాయ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని (ఏఎంఎఫ్) ఉపయోగించి మృత కణాలకు ఉష్ణాన్ని అందిస్తారు.
అయితే, అనియంత్రిత సమూహాల కారణంగా అయస్కాంత నానోపార్టికల్స్ ఉపయోగించి ప్రభావిత కణజాలాల ఏకరీతిగా వేడిని అందించటం కష్టమైన పని. దానికి తోడు అవి మానవ శరీరంలో పేరుకుపోయి విషాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ప్రత్యేక మిశ్రమంతో..
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐఐఎస్సీలోని బీఎస్ఎస్ఈ, ఎంఆర్డీజీ విభాగాల పరిశోధకులు.. ఈ బ్యాండేజీని అభివృద్ధి చేశారు. ఎలెక్ట్రోస్పిన్నింగ్ అనే పద్ధతిని ఉపయోగించి అయస్కాంత సూక్ష్మకణాల ప్రత్యేక మిశ్రమాన్ని బ్యాండేజీపై పూత పూశారు. ఈ కణాల్లో ఐరన్ ఆక్సైడ్, Fe3O4, పునరుత్పత్తి చేయగలిగే పాలిమర్లుగా పిలిచే పాలీకాప్రోలాక్టోన్ను ఉపయోగించారు. అధిక పౌనఃపున్య డోలనం అయస్కాంత క్షేత్రానికి లోనైనప్పుడు ఈ మిశ్రమం వేడిని ఉత్పత్తి చేస్తుంది.
దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు విట్రో (మానవ కణాలు), వివో (ఎలుకలో కృత్రిమంగా క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టి) ప్రయోగాలు చేశారు శాస్త్రవేత్తలు. రెండు పరీక్షల్లోనూ ఉష్ణం వెలువడి క్యాన్సర్ కణాలను నిర్మూలించటంలో విజయం సాధించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా రాలేదని గుర్తించారు.
అయితే, ఈ చికిత్స సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని తెలిపారు శాస్త్రవేత్తలు.
ఇదీ చూడండి: దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు