Parker solar probe: అంతరిక్ష చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది. సూర్యుని వాతావరణమైన కరోనాలోకి వ్యోమనౌక ప్రవేశించింది. నాసా ప్రయోగించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' స్పేస్‌క్రాఫ్ట్ ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని అమెరికా జియోఫిజికల్ యూనియన్ సమావేశంలో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
NASA solar spacecraft:
నాసా వ్యోమనౌక ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సూర్యుడి వాతావరణంలోకి వెళ్లింది. ఇందుకు సంబంధించిన డేటా కొన్ని నెలల తర్వాత భూమికి చేరింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి, నిర్ధరించేందుకు శాస్త్రవేత్తలకు ఇంత సమయం పట్టింది.
Corona sun atmosphere
ఈ విషయంపై ప్రాజెక్ట్ సైంటిస్ట్ నూర్ రౌఫీ హర్షం వ్యక్తం చేశారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ఆయన.. వ్యోమనౌక సూర్యుడి వాతావరణంలోకి మూడుసార్లు వెళ్లి వచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియంతా సజావుగానే సాగిందని చెప్పారు.
"మనం అనుకున్న దానికంటే కరోనా చాలా దుమ్మూధూళితో ఉంది. తర్వాత కరోనా అన్వేషణకు జరిగే యాత్రలు.. సౌరగాలి ఆవిర్భావాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. సౌరగాలులు ఎలా పుడతాయి? అంతరిక్షంలోకి ఎలా ప్రయాణిస్తాయనేది తెలుస్తుంది. సూర్యుడికి ఘన ఉపరితలం లేదు. కీలక చర్యలన్నీ కరోనా వద్దే జరుగుతాయి. అయాస్కాంతక్షేత్రాలు తీవ్రంగా ఉండే ఈ ప్రాంతాన్ని సునిశితంగా పరిశీలించడం ద్వారా సౌర విస్ఫోటనాలపై ఓ అంచనాకు రావొచ్చు."
-నూర్ రౌఫీ, ప్రాజెక్ట్ సైంటిస్ట్
స్పేస్‌క్రాఫ్ట్ తొలిసారి సూర్యుడి వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఐదు గంటల పాటు అక్కడ తిరగాడిందని మరో శాస్త్రవేత్త, మిషిగన్ యూనివర్శిటీ పరిశోధకుడు జస్టిన్ కాస్పర్ వెల్లడించారు.
"మొదట ఐదు గంటల పాటు స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడి వాతావరణంలో ఉంది. ఇది అత్యంత నాటకీయమైన పరిణామం. ఐదు గంటలు అంటే పెద్ద సమయం అనిపించకపోవచ్చు. కానీ, పార్కర్ సెకనుకు 100 కిలోమీటర్ల వేగంతో వాతావరణంలో తిరిగింది."
-జస్టిన్ కాస్పర్, నాసా శాస్త్రవేత్త
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 'పార్కర్'.. ఆగస్టులో తొమ్మిదోసారి కరోనాలోకి వెళ్లిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని నిర్ధరించడానికి మరింత విశ్లేషణ అవసరమని అన్నారు. గత నెలలో పదోసారి సూర్యుడి వాతావరణానికి సమీపంగా వెళ్లిందని వెల్లడించారు.
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను 2018లో ప్రయోగించారు. 2025 వరకు ఈ వ్యోమనౌక సూర్యుడి వాతావరణం లోపలికి చొచ్చుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించనుంది. 2025లో చిట్టచివరి కక్షకు చేరుకుంటుంది. అమెరికన్ ఫిజికల్ సొసైటీ ఈ వివరాలను ప్రచురించింది.
ఇదీ చదవండి: సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లిన పార్కర్