ఐఫోన్‌కు ఉన్న వర్చువల్ అసిస్టెంట్ 'సిరి'లాగానే అమెజాన్ సొంతంగా 'అలెక్సా' పేరుతో వర్చువల్ అసిస్టెంట్ డివైజ్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎకో, ఎకో డాట్ పేర్లతో ఈ డివైజ్‌లను 2014 నుంచి విడుదల చేస్తూ వస్తోంది. కానీ, ఈ మధ్య కాలంలోనే వీటి వినియోగం పెరిగింది. అయితే, సాధారణంగా ఇలాంటి సాఫ్ట్‌వేర్-ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు వైరస్, హ్యాకింగ్, బ్యాటరీ, వ్యక్తిగత భద్రత వంటి విషయాల్లో సమస్యలు వస్తాయి. కానీ, అలెక్సాకు ఆ పేరుతోనే చిక్కొచ్చి పడింది. యూకేలో కొందరు తల్లిదండ్రులు ఈ అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్‌కు పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పేరు వల్ల వారి పిల్లలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూకేలో చాలా మందికి అలెక్సా పేరు ఉంటుంది. అలా కొంతమంది పిల్లలకు కూడా అలెక్సా అనే పేరుంది. దీంతో పాఠశాలల్లో.. ఆ పిల్లల్ని అలెక్సా అంటూ కమాండ్ ఇచ్చి వారు చెప్పింది చేయాలని తోటి విద్యార్థులు అవహేళన చేస్తూ వేధిస్తున్నారట. ఆ వేధింపులు భరించలేక ఆ చిన్నారులు తీవ్ర ఒత్తిళ్లకు గురై పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు అధికారికంగా పేరు మార్చుతున్నారు. ఈ సమస్యకు కారణమైన, అలెక్సా డివైజ్ తయారు చేసిన అమెజాన్ సంస్థపై తాజాగా అలెక్సా పేరున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ వర్చువల్ అసిస్టెంట్‌కు పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయం అమెజాన్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆ సంస్థ స్పందించింది. యూకేలో చోటుచేసుకుంటున్న పరిస్థితిపై విచారం వ్యక్తం చేసింది. అయితే, అలెక్సాకు బదులుగా యూజర్లు ఎకో, కంప్యూటర్, అమెజాన్ వంటి పేర్లతోనూ వర్చువల్ అసిస్టెంట్‌కు కమాండ్ ఇవ్వొచ్చని అమెజాన్ సూచిస్తోంది. అవే కాకుండా కమాండ్ ఇవ్వడానికి మరిన్ని దారులు ఆన్వేషిస్తున్నామని సంస్థ వెల్లడించింది.
ఇదీ చూడండి: ఫ్రీ గిఫ్ట్, కేవైసీ లింక్ వచ్చిందా? జాగ్రత్త సుమా..