చాలా రోజులుగా వాడని మొబైల్ నంబర్లను, రీఛార్జి చేయకుండా వదిలేసిన నంబర్లను రీసైకిల్ విధానంలో కొన్ని రోజుల తర్వాత కొత్తవాళ్లకు కేటాయిస్తుంటారు. ఎక్కువ మొబైల్ నంబర్ సిరీస్‌లు అవ్వకుండా చూడటానికి మొబైల్ సంస్థలు అలా చేస్తుంటాయి. అయితే మొబైల్ నెట్‌వర్క్‌లు చేస్తున్న ఈ పని వినియోగదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తోందట. వాడి, వదిలేసిన పాత మొబైల్స్ నంబర్స్‌తో మీ వ్యక్తిగత సమాచారం వేరొకరికి చేరే అవకాశం కూడా ఉందట.
పాత నంబర్లతో సైబర్ దాడులకు అవకాశం..
యూఎస్‌లోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం ఇటీవల ఓ పరిశోధన నిర్వహించింది. అక్కడి పరిశోధకులు 200 రీసైకిల్డ్ (గతంలో ఒకరు వాడిన) నంబర్లు తీసుకొని పరిశోధన చేశారు. వాటిలో 19 నంబర్లతో ఈ తరహా సమస్య వచ్చిందట. ఆ నంబర్లు గతంలో వాడిన వారికి చెందిన మెసేజ్‌లు, ఓటీపీలు, ఇతరత్రా సందేశాలు రావడం మొదలయింది. ఇలా ఒకరి నంబర్లు.. ఇంకొకరి ఇవ్వడం వల్ల సైబర్ దాడులూ జరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ నంబర్ల సాయంతో అగంతుకులు వ్యక్తిగత సమాచారం సేకరించేలా ఫిషింగ్ చేయొచ్చట. దాంతోపాటు ఆ మొబైల్ నంబరు సాయంతో తొలుత నంబరు వాడిన వ్యక్తి సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని సేకరించొచ్చట. మొబైల్ నంబర్‌తో అనుసంధానం అయి ఉన్న ఖాతాల పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి.. దాని ద్వారా వ్యక్తిగత సమాచారం పొందొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా జాగ్రత్త పడితే మేలు..
పాత నంబర్ల కేటాయింపు వ్యవహారం గురించి యూఎస్‌లోని వెరైజాన్, టీ మొబైల్ నెట్‌వర్క్‌లను ప్రిన్స్‌టన్ పరిశోధకుల బృందం సంప్రదించిందట. అయితే నంబరు మార్చుకోవడానికి మొబైల్ సంస్థలు ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాయట. అంతే కానీ ఆ నంబర్ల కేటాయింపు విధానం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్య మన దేశంలోనూ ఉంది. అయితే ఈ ఇబ్బంది లేకుండా మొబైల్ నంబరు మార్చినప్పుడు, పాత నంబరు పోయి.. మళ్లీ వెనక్కి తెచ్చుకోలేనప్పుడు యూజర్ కొన్ని పనులు చేయడం మంచింది. సోషల్ మీడియా ఖాతాల్లోని మొబైల్ నంబర్లను మార్చాలి. దాంతోపాటు బ్యాంకు ఖాతాల్లో కూడా కొత్త నంబర్ను అప్‌డేట్ చేయించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాత నంబరు వేరొకరికి ఇచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు.
ఇవీ చదవండి: