ఆసక్తికర ఫీచర్లతో కుర్రకారును ఆకట్టుకునే ఇన్స్టాగ్రామ్ యాప్‌లో ఇప్పుడు సరికొత్త ఫీచర్లు రానున్నాయి. ఈ విషయాన్ని మాతృసంస్థ ఫేస్బుక్ మంగళవారం వెల్లడించింది. లైవ్ రూమ్స్ పేరుతో ప్రస్తుతం ఉన్న లైవ్ స్ట్రీమ్ ఆప్షన్లో మార్పులు తేనున్నామని పేర్కొంది. దీంతో లైవ్‌లో నలుగురు వినియోగదారులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందులో మొదట ఒకేసారి ఇద్దరిని చేర్చుకుని ఆ తర్వాత మరొకరిని యాడ్ చేసుకోవచ్చు.
"లైవ్ రూమ్స్ ద్వారా సృజనాత్మకత అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. టాక్ షో, మ్యూజిక్ షో, ట్యుటోరియల్స్ వంటి కార్యక్రమాలను ఈ లైవ్ రూమ్స్ ద్వారా నిర్వహించుకోవచ్చు. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తాం."
-ఫేస్బుక్
లైవ్స్ రూమ్స్ వినియోగం ఎలా?
ఇన్‌స్టాలో లెఫ్ట్‌కి స్వైప్ చేసి లైవ్ కెమెరా ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత దానికి టైటిల్ పెట్టి.. లైవ్‌లో చేర్చాలనుకునే వాళ్లని యాడ్ చేయాలి. జూమ్ యాప్ తరహాలోనే ఇందులో కూడా లైవ్‌లో చేరాలి అనుకున్న వ్యక్తుల జాబితా మీకు కనిపిస్తుంది. వీళ్లు కాక ఇంకెవరినైనా చేర్చాలి అనుకుంటే వారి పేరుని సెర్చ్ చేసి యాడ్ చేయవచ్చు.
కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘనకు పాల్పడిన వారు లైవ్ రూమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. లైవ్ రూమ్స్‌లో ఉన్న వారు చేరాలనుకుంటున్న వారిని బ్లాక్ చేస్తే వాళ్లు లైవ్‌లో పాల్గొనలేరు.
ఇదీ చదవండి : నాన్న మరణించినా.. మరో ఇద్దరిని బతికించాడు!