Emergency Alert for Android Users: కొందరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకుపెద్ద సౌండ్‌తో ఓ మెసేజ్ వచ్చింది. రెడ్, అండ్ బ్లాక్ కలర్స్‌తో స్క్రీన్ పై ఈ సందేశం కనిపించడంతో వినియోగదారులు కొంత భయాందోళనలకి గురయ్యారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇది సాంపిల్ టెస్టింగ్ మెసేజ్ అని, దీని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. ఈ మెసేజ్ పై స్పందించాల్సిన అవసరం లేదని, దానిని పట్టించుకోవద్దని యూజర్లకు సూచించింది.
ప్రభుత్వ వివరణ: ప్రకృతి విలయాలు, ఇతర అనూహ్య ప్రమాదాల సమయంలో దేశ ప్రజలను అప్రమత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక అలర్ట్ సిస్టమ్‌ను రూపొందిస్తోంది. ఆ అలర్ట్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అందువల్లనే కొందరు కస్టమర్లకు ఈ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది టెస్టింగ్ పర్పస్‌లో భాగంగా పంపించిన మెసేజ్ మాత్రమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టెలీకాం విభాగం లోని సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ప్రయోగాత్మకంగా కొందరు మొబైల్ యూజర్లకు ఈ మెసేజ్ ను పంపించారు.
అప్రమత్తం చేయడానికి.. భూకంపం, సునామీ వంటి ఏదైనా ప్రకృతి విపత్తు సమయంలో కానీ, మరేదైనా అనూహ్య ప్రాణనష్టానికి కారణమయ్యే విపత్తు తలెత్తే సమయంలో కానీ దేశ వ్యాప్తంగా ఒకేసారి ప్రజలందరికీ అలర్ట్ మెసేజ్ ను పంపించి, వారిని అప్రమత్తం చేసి, వారిని ఆ ముప్పు నుంచి కాపాడే లక్ష్యంతో ఈ అలర్ట్ సిస్టమ్ ను రూపొందించారు. దీనిని పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ (Pan-India Emergency Alert System) గా పేరు పెట్టారు. ఈ సిస్టమ్ జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (National Disaster Management Authority) ఆధ్వర్యంలో ఉంటుంది. అయితే, ఈ మెసేజ్ చాలా మంది యూజర్లను గందరగోళానికి గురి చేసింది. కొందరు ఇది స్పామ్ మెసేజ్ అని, మరికొందరు వైరస్ మెసేజ్ అని భావించారు. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
'Emergency Alert Severe' పేరిట వచ్చిన ఈ మెసేజ్‌లో 'టెలీకమ్యూనికేషన్ విభాగానికి చెందిన సెల్ బ్రాడ్‌కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది. దీనిని పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్ పంపించాం. ఆపద సమయాల్లో ప్రజల్ని హెచ్చరించేందుకు ఈ సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజల భద్రతను మరింత మెరుగుపరుస్తుంది.' అని అందులో రాసి ఉంది. తమ ఫోన్లకు వచ్చిన మెసేజ్‌ను కొందరు యూజర్లు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.