Artificial Intelligence Importance in Daily Life in Telugu : "AI వినియోగంలో తేడావస్తే.. పరిణామాలు భయంకరంగా ఉంటాయి. కృత్రిమ మేధను తల్చుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను." అని అన్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. కానీ.. ఏఐ గురించి అవగాహన లేనివాళ్లు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అది మనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా భావిస్తున్నారు చాలామంది! కానీ.. ఇప్పటికే మన డైలీ రొటీన్ లైఫ్‌లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చేసింది. తెల్లారి లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే దాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటోంది..! విద్య నుంచి వైద్యం దాకా.. వ్యాపారం నుంచి వ్యవసాయం దాకా.. ఇప్పుడు AI ప్రమేయం లేని రంగం లేదంటే నమ్మాల్సిందే!
కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి..?
What is Artificial Intelligence in Telugu : మనిషి తనకోసం కృత్రిమంగా తయారుచేసుకున్న మేధస్సు.. కాబట్టే దీన్ని కృత్రిమ మేధస్సుగా పేర్కొంటున్నారు. అంటే.. సాధారణంగా మనిషి ఏదైనా పనిచేసే ముందు.. దాని గురించి ఆలోచించి, అందుకు సంబంధించిన విషయాలను గ్రహించి, అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. ఇదే పని యంత్రం చేస్తే.. అత్యంత వేగంగా పనులు చక్కబెట్టవచ్చుకదా అనే ఆలోచనే.. కృత్రిమ మేధ పుట్టుకకు బీజం.
మనిషి తన ఆలోచనతో.. తనకన్నా బలమైన యంత్రాలను ఎన్నింటినో సృష్టించాడు. సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాల్సిందే. ఎందుకంటే.. వాటికి ఆలోచనా శక్తి లేదు. అందుకే.. స్వయంగా ఆలోచించగలిగే యంత్రాన్ని తయారు చేస్తే.. మరింత సమర్థంగా పనులు పూర్తిచేయొచ్చంటూ మొదలు పెట్టిన పరిశోధనలు.. చివరకు AIని సృష్టించాయి. మనం ఎంత ఎక్కువ సమాచారం దీనికి అందిస్తే.. అవి అంత కచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది.
మన రోజువారీ జీవితంలో AI..
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Electronic Gadgets) : గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి AI-ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు ఇళ్లలోకి వచ్చేశాయి. రిమైండర్‌లను సెట్ చేయడం, సందేశాలను పంపడం నుంచీ.. మ్యూజిక్ ప్లే చేయడం, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం వరకూ అనేక రకాల పనులను ఇవి చేయగలవు.
సోషల్ మీడియా (Social Media) : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ AIని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. యూజర్స్ బిహేవియర్ పరిశీలించడానికి, సోషల్ మీడియాలో వారి ఎక్స్ పీరియన్స్‌ను తెలుసుకోవడానికి కూడా AIని ఉపయోగిస్తున్నాయి. అంతేకాకుండా.. బూటకపు వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ఇతర హానికరమైన కంటెంట్ గుర్తించడానికి కూడా ఆయా సంస్థలు కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయి. అంటే.. మనల్ని AI ఓ కంట కనిపెడుతోందన్నమాట.
కోడి కూతకు.. కుక్క అరుపునకు.. అర్థం తెలిసిపోతుంది.. కృత్రిమ మేధతో అద్భుత సృష్టి..
వినియోగదారుల సేవ(Customer service) : 24/7 కస్టమర్ సేవలను అందించడానికి.. AIతో నడిచే వర్చువల్ అసిస్టెంట్‌లు, చాట్‌బాట్‌లను పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. వినియోగదారుల ప్రశ్నలను అర్థం చేసుకోవడం, రిప్లే ఇవ్వడం వంటి పనులు చేస్తున్నాయి. ఇంకా.. ఆర్డర్‌లను ట్రాక్ చేయడం, రిటర్న్‌లను ప్రాసెస్ చేయడం వంటి అనేక రకాల పనులు కూడా AI నిర్వహిస్తోంది.
వైద్య రంగంలో (Healthcare) : వైద్య రంగంలో కూడా కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోంది. రోగి పర్యవేక్షణ, మందుల పరిశీలన, మెడికల్ ఇమేజింగ్ వంటి పనులకు AIని వినియోగిస్తున్నారు. మెడికల్ పిక్చర్ అనాలిసిస్, అనోమలీ డిటెక్షన్, డయాగ్నసిస్ సపోర్ట్ వంటి సామర్థ్యాలను AI అల్గారిథమ్ కలిగి ఉంటోంది.
'AIని తల్చుకుంటే నిద్ర పట్టట్లేదు.. ఆ సమాధానాలు ఎలా వస్తున్నాయో తెలీదు!'
ఇ-కామర్స్(E-commerce) : అమెజాన్ వంటి ఇ-కామర్స్ సైట్స్.. కృత్రిమ మేధను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. యాప్‌లో కస్టమర్ల చేసే సెర్చ్.. బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా.. ఎలాంటి ఉత్పత్తులు అవసరమనే విషయాన్ని AI సిఫార్సు చేస్తుంది. దీంతో.. అలాంటి ప్రొడక్ట్స్ అందుబాటులోకి తెస్తారు. ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయి. ఇటు కస్టమర్ కూడా సంతృప్తి చెందుతాడు.
సెల్ఫ్ డ్రైవింగ్ (Autonomous vehicles) : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు AI ఆధారంగానే పనిచేస్తాయి. ఎప్పుడు బ్రేక్ వేయాలి..? ఏ టర్న్ తీసుకోవాలి..? వంటి విషయాలన్నీ ప్రోగ్రామింగ్ ద్వారా అర్థం చేసుకొని.. గమ్యం స్థానం చేరుస్తాయి. ఈ సాంకేతికత వల్ల రోడ్డు ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. టెస్లా.. తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను శక్తివంతం చేయడానికి AIని ఉపయోగిస్తోంది.
స్మార్ట్ హోమ్ పరికరాలు (Smart home devices) : థర్మోస్టాట్‌లు, లైటింగ్ సిస్టమ్‌లు, భద్రతా వ్యవస్థలు వంటి విషయాల్లో.. AIని వినియోగిస్తున్నారు. ఈ పరికరాలను వాయిస్ కమాండ్‌తో స్మార్ట్‌ఫోన్ లేదా రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఉదాహరణకు బల్బుల తయారీ సంస్థ ఫిలిప్స్.. లైటింగ్ అడ్జెస్ట్ మెంట్ విషయంలో AIని ఉపయోగిస్తోంది.
న్యూస్ రీడింగ్ (News Reading) : మనం రోజూ టీవీల్లో చూసే వార్తలను.. AI రోబోలు చదువుతున్నాయి. ఆజ్‌తక్, ఓటీవీ, పవర్ టీవీ వంటి సంస్థలు.. సక్సెస్‌ఫుల్‌గా AIతో న్యూస్ చదివిస్తున్నాయి.
ఇలా.. కృత్రిమ మేధ మనిషి జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతోంది. అయితే..AI వినియోగంలో ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ.. తప్పుదోవలో వినియోగిస్తే మాత్రం ఊహించని పరిణామాలు ఉంటాయని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. వీటి నివారణ కోసం ప్రపంచ దేశాలు తగిన చట్టాలు చేయాలని సూచిస్తున్నారు. AIని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని.. చట్టాల ద్వారా వినియోగాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు.
30కోట్ల ఉద్యోగాలపై 'ఏఐ' ప్రభావం.. డేంజర్లో ఉన్న జాబ్స్ ఇవే!