ETV Bharat / science-and-technology

ఇన్​స్టాగ్రామ్.. ఇక్కడ లేనిదంటూ ఏం లేదు! - Instagram reels

సామాజిక మాధ్యమాలన్నీ ఒకెత్తు... ఇన్‌స్టాగ్రామ్‌ ఒకెత్తు. యూత్‌తో కనెక్ట్‌ అవడానికి రతన్‌ టాటాకీ అమితాబ్‌ బచ్చన్‌కీ కూడా ఇన్‌స్టా ఖాతా తెరవక తప్పలేదు మరి. ఏముందీ అక్కడ అంత గొప్పగా- అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే అక్కడ లేనిదేమీ లేదు. ఉపయోగించుకోవడం తెలియాలే కానీ ఇన్‌స్టా... కల్పవృక్షం లాంటిది. అందుకే అది యువతకి కేరాఫ్‌ అడ్రస్‌ అయింది.

Instagram the trend setter
ఇన్​స్టాగ్రామ్
author img

By

Published : Nov 8, 2020, 2:39 PM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

మొట్టమొదటిసారి జనరేషన్‌ ఎక్స్‌ వాళ్లు ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌ తెరిచి చూస్తే కొంచెం కంగారుపడడం సహజం. అది వాట్సప్‌ లాగా సింపుల్‌గా ఉండదు. ఫేస్‌బుక్‌లాగా పొడుగాటి పోస్టులు ఉండవు. అసలు మనకు తెలిసిన పేర్లతో ఒక్క ఖాతానూ కన్పించదు. సరే ముందు మన పిల్లలే ఉంటారు కదా వాళ్ల ఖాతాలు ఫాలో అవుదాం అని వెతకడం మొదలు పెట్టారనుకోండి... కనిపెట్టడం కష్టమే.

వాళ్లు మిలెనియల్స్‌... పెద్దవాళ్ల లాగా ఇంటిపేరుతో కలిపి చాంతాడంత పేరుతో ఖాతాలు తెరవరు. ఆధునికంగా తమకిష్టమైన పద్ధతిలో ఐడీలు పెట్టుకుంటారు. అందుకని అదేమిటో అడిగి తెలుసుకుని మరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
అదీ చేశారు... ఇక, హోంపేజీలో కెళ్లి స్క్రోల్‌ చేయడం మొదలెడితే...
ఫ్యాషన్లూ, పర్యటక ప్రదేశాలూ, వంటలూ, వ్యాపారాలూ, గృహాలంకరణా, ఆరోగ్య సలహాలూ... లేని విషయం ఉండదు.
వాటికి సంబంధించిన రంగురంగుల ఫొటోలు అద్భుతమైన నాణ్యతతో కళ్లు తిప్పుకోనివ్వవు.
ఆ ఫొటోలకింద ఒకటి రెండు వాక్యాల్లో పోస్టు ఉంటుంది.
ఆ కింద అయిదునుంచి పది లైన్లు వరసగా హ్యాష్‌ట్యాగులే!
లైకులూ కామెంట్లూ... మామూలే!
ఇప్పుడిక, అసలు విషయంలోకి వెళదాం.

ఇరవై ఆరేళ్ల జోష్‌ దవడకి చిన్న సర్జరీ చేయించుకోడానికి దంతవైద్యుడి దగ్గరికి వెళ్లాడు. మత్తుమందు పనిచేసేవరకూ ఆ మాటా ఈ మాటా చెబుతూ ‘నీలాంటి యువత ఈ మధ్య దంతాలకు తెల్లరంగు వేయించుకోవడం బాగా పెరిగింది. నువ్వూ అందుకే వచ్చావనుకున్నాను’ అన్నాడు డాక్టరు. పదమూడేళ్ల వయసు నుంచే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ తన సంపాదనతో చదువుకుని పైకి వచ్చిన జోష్‌కి ఆ మాటలో ఓ అవకాశం కన్పించింది. రెండురోజుల తర్వాత ఇద్దరు భాగస్వాములతో కలిసి ‘స్నో’ పేరుతో కొత్త కంపెనీ పెట్టాడు జోష్‌. ఈ కంపెనీ దంతాలను తెల్లగా చేసే కిట్‌ని అమ్ముతుంది. కావాల్సినవాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్‌ ఇస్తే ఇంటికి పంపిస్తుంది. ‘మా కిట్‌ వాడి చూడండి, వాడాక మీ సెల్ఫీ మాకు పంపండి’ అని కూడా ప్రకటించాడు జోష్‌. 2016లో అతడలా వ్యాపారం మొదలుపెట్టాడో లేదో వినియోగదారులు పోటెత్తారు. తెల్లటి మెరిసే దంతాలు కనబడేలా తీసుకున్న వందలాది సెల్ఫీలతో జోష్‌ ఇన్‌స్టా పేజీ నిండిపోయేది. ఏడాది తిరిగేసరికల్లా కంపెనీకి 225 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది అమెరికాలో సంగతి.

మన దేశానికి వస్తే... కృత్తికా ఖురానాకి స్కూల్లో ఒక్కతే ఫ్రెండు ఉండేది. ఓసారి ఆమెతో గొడవైంది. దాంతో ప్రపంచమంతా తలకిందులైనట్లు బాధపడి ఒంటరిగా ఇంట్లో ఉండేది కృత్తిక. ఆ ఒంటరితనంతో చిరుతిళ్లకు అలవాటుపడడమూ కాలేజీలో చేరేసరికి బొద్దుగా తయారవడమూ వరసగా జరిగిపోయాయి. దాంతో ఆమెలో ఆత్మన్యూనత పెరిగింది. చెల్లెలి పరిస్థితి గమనించిన అన్న ఒకరోజు బ్లాగ్‌ ఓపెన్‌ చేసిచ్చాడు. ‘నువ్వు దుస్తుల సెలెక్షన్‌ బాగా చేస్తావు. దాని గురించే ఇక్కడ రాయి’ అని చెప్పాడు. కృత్తిక ఉత్సాహంగా మొదలుపెట్టింది. అందరూ మెచ్చుకుంటుంటే ఇంకా కష్టపడి తనకు తెలియని విషయాలు తెలుసుకుని మరీ రాసేది. మెల్లగా ఒంటరితనం నుంచి బయటపడింది. తన మీద తనకి నమ్మకం పెరిగింది. ఫ్యాషన్‌డిజైనింగ్‌ కోర్సులో చేరింది. ఇంతలో ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయమైంది. బ్లాగులో రాసినట్లే అక్కడా డ్రెసింగ్‌ టిప్స్‌ రాసేది. కొద్ది రోజుల్లోనే బోలెడు మంది ఆమెను అనుసరించడం మొదలెట్టారు. కృత్తికా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిపోయింది. ఇప్పుడామె ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ బ్రాండ్‌నైనా పేర్కొంటూ ఒక పోస్టు పెడితే చాలు... లక్షల్లో డబ్బు వస్తుంది. తన కృషీ తెలివితేటలూ తప్ప రూపాయి పెట్టుబడి పెట్టకుండానే ఇరవై ఏడేళ్ల కృత్తికా ఖురానా కోటీశ్వరురాలైంది.

వీళ్లేకాదు, ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా ఉపయోగించుకున్న వారెందరో ఇరవైలూ ముప్ఫైల్లోనే సంపన్నుల లిస్టులో చేరిపోయారు. సింపుల్‌గా సోషల్‌మీడియాలో ఒక ఖాతా తెరిచి దానితోనే లక్షలాది వినియోగదారుల్ని చేరగలుగుతున్నారు. అక్కడ లభించిన పాపులారిటీని తాము పెట్టే కొత్త వ్యాపారాలకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం వ్యాపారరంగంలో ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందన్న ఊహే ఎవరికీ లేదు. అప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌ లేదు మరి.

అసలు కథ

కెవిన్‌ సిస్ట్రోంకి చిన్నప్పటినుంచీ కంప్యూటర్లూ కోడింగూ అంటే ఇష్టమైనా తర్వాత మేనేజ్‌మెంటూ చదివాడు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారి ప్రతిష్ఠాత్మక మేఫీల్డ్‌ ఫెలోస్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడు. అక్కడ ఉండగానే మార్క్‌ జుకర్‌బర్గ్‌ పిలిచి ఫేస్‌బుక్‌లో ఉద్యోగం ఇస్తానన్నా కెవిన్‌ ఇష్టపడలేదు. ‘ఓడియో’(ఇప్పుడదే ‘ట్విటర్‌’)లో ఇంటర్న్‌గా చేశాడు. 2006లో గూగుల్‌లో ఉద్యోగంలో చేరాడు కెవిన్‌. మూడేళ్లపాటు అక్కడ పనిచేసి సొంతంగా ఏమన్నా చేయాలన్న ఆలోచన మొదలై ఓ స్టార్టప్‌కి మారాడు. ప్రణాళిక ఒక కొలిక్కి రాగానే ఉద్యోగం మానేసి తాను కలలు కంటున్న సోషల్‌మీడియా ఆప్‌కి రూపం ఇచ్చాడు. వినియోగదారులు ఎప్పుడంటే అప్పుడు తాము ఉన్నచోటే ఆప్‌ ద్వారా ఫొటో తీసుకుని ఇతరులతో పంచుకోవచ్చు. దానికి ‘బర్బన్‌’ అని పేరు పెట్టాడు కెవిన్‌.

జనవరి 2010లో తన ఆప్‌ ప్రొటోటైప్‌ని స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టే ప్రముఖ సంస్థలకు చూపించాడు. రెండు కంపెనీలు 5లక్షల డాలర్లు పెట్టడానికి ముందుకొచ్చాయి. దాంతో స్నేహితుడైన మైక్‌ క్రీగర్‌ని సహవ్యవస్థాపకుడిగా చేర్చుకుని ఒక చిన్న షేరింగ్‌ ఆఫీసులో సంస్థని మొదలుపెట్టాడు కెవిన్‌. ఫొటో తీయడానికి ఇన్‌స్టంట్‌ కెమెరా, టెలిగ్రామ్‌లా వెంటనే పంపించడం... ఈ రెండు ఫీచర్లూ దీనికి ముఖ్యం కాబట్టి అవి రెండూ వచ్చేలా ఆప్‌ పేరును ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అని మార్చారు.

భార్య సలహా

ఓరోజు బీచ్‌లో కబుర్లు చెబుతూ కెవిన్‌కి భార్య నికోల్‌ ఒక సలహా ఇచ్చింది. ‘తీసిన ఫొటో తీసినట్లు పెడితే ఏం గొప్ప... దానికేమైనా హంగులు అద్దే అవకాశం ఉంటే బాగుంటుంది’ అంది. దాంతో ఫొటోలకు ఫిల్టర్లు వాడుకునే వెసులుబాటు కల్పించాడు. మొదట్లో కెవిన్‌ కేవలం ఐఫోన్‌లో పనిచేసేలా ఆప్‌ని తయారుచేశాడు. అప్పటి ఐఫోన్‌ 4లో మంచి కెమెరా ఉంది. దాంతో తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే అద్భుతంగా కనిపించేవి. అలా ఇన్‌స్టాగ్రామ్‌ ఆప్‌ 2010 అక్టోబరులో అధికారికంగా ఆప్‌స్టోర్‌లో చేరింది. చేర్చిన రెండు గంటలకే వినియోగదారుల ఒత్తిడి తట్టుకోలేక సర్వర్లు క్రాష్‌ అయ్యాయి. మొదటి రోజే సరిగా పనిచేయకపోతే ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని భయపడి రాత్రంతా మెలకువగా ఉండి వ్యవస్థాపకులు ఇద్దరూ సర్వర్లను బాగు చేస్తూ గడిపారు. వారి కష్టం వృథా పోలేదు. మొదటి రోజే 25 వేల మంది ఆప్‌లో ఖాతాలు తెరిచారు. మూడునెలల కల్లా పదిలక్షల మంది వినియోగదారుల్ని సంపాదించుకుంది ఇన్‌స్టాగ్రామ్‌. వ్యక్తిగత సమాచారం ఏమీ చెప్పనవసరం లేకుండా, తమ ఫొటోలను అందంగా ప్రత్యేకంగా కన్పించేలా ఇతరులకు చూపించగలగడం ప్రజలకు నచ్చింది. తొమ్మిది నెలలకల్లా ఏడుకోట్ల మంది వినియోగదారులు చేరారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లకీ పనికొచ్చేలా ఆప్‌ని రూపొందించాక ఒక దశలో రోజుకు పది లక్షల డౌన్‌లోడ్స్‌ అయిన సందర్భాలూ ఉన్నాయి.

సరిగ్గా ఇన్‌స్టాగ్రామ్‌కి ఆదరణ పెరగడమూ ఫేస్‌బుక్‌లో ఫొటోల పోస్టులు తగ్గడమూ ఒకేసారి జరగడం జుకర్‌బర్గ్‌ దృష్టికి వచ్చింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌ ఫేస్‌బుక్‌ని దాటి ముందుకు వెళ్లిపోతుందేమోనని భయపడ్డాడు జుకర్‌బర్గ్‌. అందుకని దాన్ని ఫేస్‌బుక్‌లో కలిపేసుకోవాలనుకున్నాడు. అదే సమయంలో ట్విటర్‌ 50కోట్ల డాలర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ని కొనడానికి ముందుకొచ్చింది. మరో పక్క ప్రతిష్ఠాత్మక వెంచర్‌ కాపిటల్‌ సంస్థ సెకోయా నిధులిస్తానంది. సెకోయా దగ్గర నిధులు తీసుకుని స్వతంత్ర సంస్థగా నిలదొక్కుకోవాలనుకుంటుండగా కెవిన్‌కి జుకర్‌బర్గ్‌ నుంచి ప్రతిపాదన వచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత వందకోట్ల డాలర్లకు బేరం కుదిరింది. అలా స్టార్టప్‌ ప్రారంభించిన ఏడాదిన్నరకల్లా 7500 కోట్ల రూపాయల సంస్థకి అధిపతి అయ్యాడు ఇరవై తొమ్మిదేళ్ల కెవిన్‌. అవడానికి ఫేస్‌బుక్‌లో విలీనమైనా నిర్వహణ పరంగా స్వతంత్రసంస్థగా కొనసాగుతోంది ఇన్‌స్టాగ్రామ్‌. రెండేళ్ల క్రితం వరకూ తానే సీఈవోగా ఉండి పలు కొత్త ఫీచర్లతో ఆప్‌ని తీర్చిదిద్దాడు కెవిన్‌.

ఎన్నెన్నో ఫీచర్లు

మరే ఆప్‌లోనూ లేనన్ని ఫీచర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి.

ఫొటోలు:

ఇన్‌స్టాగ్రామ్‌ విజయానికి ప్రధాన కారణం ఫొటోలు. రకరకాల ఫిల్టర్లతో సెల్ఫీలను పోస్టుచేసుకోవచ్చు. ఖాతాలకు ప్రైవసీ ఉంటుంది కాబట్టి ఆ ఫొటోలను ఎవరూ దుర్వినియోగం చేసే అవకాశం లేదు. పర్యటక ప్రాంతాల్లో తీసిన మంచి ఫొటోలను కొన్ని సంస్థలు కొనుక్కుంటాయి కూడా.

వీడియో స్టోరీలు:

ఇంట్లో వేడుక, కాలేజీలో చేసిన నృత్యం... ఇలా నలుగురితో పంచుకోవాలనుకునే సందర్భం ఏదైనా చిన్న వీడియో తీసి స్టోరీగా పెట్టుకోవచ్చు.

మార్కెటింగ్‌:

టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా ఒక స్టార్టప్‌ పెట్టారు. దాని గురించి ఆమె ఎక్కడా ప్రచారం చేయలేదు. ‘కుక్‌ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌‘ అనే ఆమె ఇన్‌స్టా పేజీలో రకరకాల వంటల ఫొటోలు ఉంటాయి. అందులో మనకు నచ్చింది ఎంచుకుని అక్కడే ఆర్డర్‌ చేయవచ్చు. ఆ వంటకానికి అవసరమైన పదార్థాలన్నీ తగుపాళ్లలో(కూరలైతే ముక్కలుగా కోసి) కిట్‌లాగా ప్యాక్‌చేసి ఇంటికి పంపిస్తారు. నయాపైసా ఖర్చు లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మార్కెటింగ్‌ చేస్తూ ఇలాంటి పలురకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు యువ వ్యాపారవేత్తలు.

డైరెక్ట్‌ మెసేజింగ్‌:

ఇన్‌స్టా ఖాతాని అనుసరించే వాళ్లతో ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే నేరుగా సందేశాలు పంపొచ్చు. వాయిస్‌ మెసేజ్‌, వీడియో కాలింగ్‌ సౌకర్యం కూడా ఉంది.

రీల్స్‌:

వినియోగదారులు దీంట్లో తమ సొంత, సృజనాత్మక వీడియోలను పోస్ట్‌ చేసుకోవచ్చు. టిక్‌టాక్‌లాంటి మరో ఆప్‌ అవసరం లేదు.

హ్యాష్‌ట్యాగ్‌లు:

ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగులు ఎందుకు ఎక్కువుంటాయంటే- హైదరాబాద్‌ బిర్యానీకి సంబంధించి పోస్టులు చూడాలంటే సెర్చ్‌లో హైదరాబాద్‌ బిర్యానీ అన్న హ్యాష్‌ట్యాగ్‌ కొడితే చాలు. దానికి సంబంధించిన పబ్లిక్‌ పోస్టులన్నీ కన్పిస్తాయి. దాదాపు గూగుల్‌ సెర్చ్‌ లాగా ఉపయోగిస్తారు వినియోగదారులు.

ఐజీటీవీ:

నిమిషం కన్నా పెద్దవీడియోలను పోస్ట్‌ చేయాలనుకునేవారికి ఉపయోగపడే ఫీచర్‌ ఇది.

ప్రత్యేక పేజీలు:

కవులూ కళాకారులూ ఎవరైనా ప్రత్యేకంగా పేజీలు పెట్టుకోవచ్చు. ఇన్‌స్టా పేజీలతోనే సెలెబ్రిటీలైన వాళ్లు ఉన్నారు.

ఇవే కాక, సినిమాతారలూ క్రీడాకారులూ అభిమానులతో నేరుగా కనెక్ట్‌ అవడానికి ఇది వారధిలా పనిచేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు తమ ఫొటోలు పెడుతూ ఆకట్టుకోవడమే కాక తరచూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా మాట్లాడుతుంటుంటారు సెలెబ్రిటీలు. సైబర్‌ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలూ ఆప్‌ తీసుకుంటుంది. అసభ్య పదాలనూ నచ్చని వ్యాఖ్యలనూ తొలగించి ఇష్టంలేని వ్యక్తుల్ని బ్లాక్‌చేసే అవకాశం వినియోగదారులకు ఉంది.

అక్షర లక్షలు

ఒకప్పుడు రాజులు చక్కటి కవిత్వమో పద్యాలో రాసినవారికి అక్షరానికి లక్ష చొప్పున డబ్బిచ్చేవారని కథల్లో చదివాం. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించినవారికి అంతకంటే ఎక్కువే డబ్బు వస్తుంది. ఆకర్షణీయమైన ఫొటోలో, పనికొచ్చే సమాచారమో, ఆకట్టుకునే మాటలో... పోస్టులుగా పెట్టేవారిని సహజంగానే ఎక్కువమంది అనుసరిస్తారు. అలా ఫాలోవర్ల సంఖ్య వెయ్యి దాటి పెరిగేకొద్దీ వారు సెలెబ్రిటీలైపోతారు. వారు ఏం చెప్పినా అనుసరించేవారు నమ్ముతారు కాబట్టి వారిని ‘ఇన్‌ఫ్లుయెన్సర్లు’ అంటుంది సోషల్‌ మీడియా. సినిమాతారలు, క్రీడాకారుల్లాంటి వారికైతే సహజంగానే అనుసరించే అభిమానులు ఉంటారు. వారందరికీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అయ్యే అవకాశం ఉంటుంది. క్రికెటర్‌ విరాట్‌కోహ్లి ఆటతో కన్నా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఏదైనా ఒక బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తూ అతను ఒక పోస్టు పెడితే చాలు- ఆ కంపెనీ అతడికి రెండు లక్షల 96వేల డాలర్లిస్తుంది. అంటే అక్షరాలా రెండు కోట్ల 18లక్షల 71వేలు. అమెరికాకి చెందిన మోడల్‌, వ్యాపారవేత్త కైలీ జెన్నర్‌, నటుడూ వ్యాపారవేత్తా అయిన డ్వేన్‌ జాన్సన్‌ లాంటి వాళ్లయితే ఏకంగా ఒక్కో పోస్టుకీ ఏడున్నర కోట్లు తీసుకుంటున్నారు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్‌ పోస్టుల ద్వారా డబ్బు సంపాదించేవారి వివరాలతో ఏటా ఇన్‌స్టా రిచ్‌ లిస్ట్‌ వెలువరిస్తారు. ఈ ఏడాది ఆ లిస్టులో మొదటి వంద స్థానాల్లో ఆసియా నుంచి ఐదుగురికి మాత్రమే స్థానం దొరికింది. మన దేశం నుంచీ కోహ్లీ(26వ స్థానం), ప్రియాంకా చోప్రా(28)కాగా మిగిలినవారు ఇండోనేషియా నటుడు రాదిత్య డికా, థాయ్‌ నటీమణులు అవికా హూర్న్‌, అరాయా అల్బర్టాలు.

ఏం చేస్తారు..

ఫలానా వస్తువు బాగుంది అని మనకు తెలిసినవారు చెబితే నమ్ముతాం. మనమూ కొంటాం. దాన్నే నోటిమాట ద్వారా ప్రచారం అంటారు వ్యాపారవేత్తలు. ఇప్పుడా పనిచేస్తున్నారు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌. సామాజిక మాధ్యమాల్లోనూ మిగిలినవన్నీ ఒకెత్తు అయితే ఇన్‌స్టా ఒక్కటే ఒకెత్తు. రెండున్నర కోట్ల బిజినెస్‌ ప్రొఫైల్స్‌ ఉన్న ఈ వేదిక మీద ఎవరితో పొత్తు పెట్టుకోవాలీ, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎవరిని ఎంచుకోవాలీ అన్నది నిర్ణయించుకోడానికి బ్రాండులకి బోలెడు ఛాయిస్‌ ఉంది. ఎక్కువమంది ఫాలోవర్లు, సృజనాత్మక పోస్టులు, వాటికి వచ్చే స్పందన, బ్రాండ్‌కి ఆ పోస్టులకి మధ్య సారూప్యం... వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఎంచుకుంటారు వాళ్లు. ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన కృత్తికా ఖురానాని ఫ్యాషన్‌, మేకప్‌ బ్రాండ్లు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంచుకుంటే క్రీడాకారుడైన కోహ్లీని ఫిట్‌నెస్‌, షూ, హెల్త్‌ ఫుడ్స్‌ లాంటి రంగాలకు చెందిన బ్రాండ్లు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెట్‌ విలువ డెబ్భైవేల కోట్ల రూపాయల పైమాటేనట. లక్షల్లో ఫాలోవర్లున్నవారే కాదు, వెయ్యిమంది ఫాలోవర్లు దాటినవారెవరైనా మంచి పోస్టులతో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారవచ్చు.

కొత్త ఉద్యోగాలు

అవును... సోషల్‌ మీడియా వల్ల సరికొత్త ఉద్యోగాలూ వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌తోనే ఆ ట్రెండ్‌ మొదలైంది. ‘అసిస్టాగ్రామ్‌’ అనే ఏజెన్సీని పెట్టిన జాక్‌ బెన్సన్‌ వ్యక్తులకూ, సంస్థలకూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక మీద తమ ఉనికిని చాటుకోవడమెలాగో సలహాలిస్తున్నాడు. అవసరమైన వారికి తానే ఆ పని చేసిపెట్టి ఛార్జీలు వసూలుచేస్తాడు. అందుకుగాను ఒక పెద్ద సంస్థనే నెలకొల్పాడు బెన్సన్‌. అలాంటి వాళ్లు ఇప్పుడు చాలామందే తయారయ్యారు. వ్యాపార, పారిశ్రామిక సంస్థలే కాదు ప్రభుత్వ విభాగాలూ తమ టార్గెట్‌ ఆడియెన్స్‌ని చేరడానికి తప్పనిసరిగా ఈ మాధ్యమాన్ని వాడుతున్నాయి. ఆ ఖాతాలను నిర్వహించడం కోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా మేనేజర్లను నియమిస్తున్నాయి. ప్రముఖులు కూడా తమ ఖాతాలను నిర్వహించడానికీ, పోస్టులు రాయడానికీ మంచి భాష వచ్చిన, సాంకేతికత తెలిసిన వ్యక్తుల్ని సహాయకులుగా పెట్టుకుంటున్నారు.

ఆప్‌ని తయారుచేసిన కొత్తలో పెట్టుబడి కోసం కెవిన్‌ వివిధ సంస్థల దగ్గరికి వెళ్లినప్పుడు ఫొటో షేరింగ్‌ ఆప్‌కి డబ్బులేం వస్తాయి... అని పెదవి విరిచారట చాలామంది. ఇప్పుడదే ఆప్‌ ‘ఇన్‌స్టంట్‌ సక్సెస్‌’కి వేదికగా మారి డబ్బుల వర్షం కురిపిస్తోంది. అటు వ్యాపారసంస్థలకీ ఇటు వినియోగ దారులకీ మధ్య వారధిగా వారిద్దరినీ గెలిపిస్తూ తానూ లాభం పొందడమే... ఇన్‌స్టాగ్రామ్‌ విజయ రహస్యం!

నాలుగు రకాల ఇన్‌ఫ్లుయెన్సర్‌లు!

మంచి విషయంతో పాటు సదరు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాని అనుసరించేవారి సంఖ్య కలిసి ఆ ఖాతాదారు ఏ స్థాయి ఇన్‌ఫ్లుయెన్సర్‌ అన్నది నిర్ణయిస్తాయి.

నానో: వెయ్యికి పైనా పదివేల లోపలా ఫాలోవర్లు ఉన్నవారు. వీళ్లంతా మన చుట్టూ ఉండే సామాన్యులే. వీళ్లు ఎక్కువ సమయం ఆప్‌లో ఉంటారు కాబట్టి ప్రచారం ఎక్కువ వస్తుంది. వీరికి ఇచ్చే ప్రతిఫలం తక్కువే అయినా బ్రాండ్‌లకు వీరిపట్ల నమ్మకం ఎక్కువ.

మైక్రో: పదివేల పైనా, లక్ష లోపలా ఫాలోవర్లు ఉన్న వాళ్లని ఆయారంగాల్లో నిపుణులుగా పరిగణిస్తారు. కాబట్టి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక బ్రాండ్లు వీరిని ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఎంచుకుంటాయి.

మాక్రో: లక్ష- పదిలక్షల మధ్య ఫాలోవర్లు ఉన్నవారు. వీళ్లలో ఎక్కువ మంది సినీతారలో క్రీడాకారులో అయివుంటారు.

మెగా: ఫాలోవర్ల సంఖ్య పదిలక్షలు దాటినవారిని మెగా ఇన్‌ఫ్లుయెన్సర్లంటారు. వీరంతా ఆయా రంగాల్లో అత్యున్నత స్థానానికి చెందిన ప్రముఖులో, పేరొందిన పారిశ్రామికవేత్తలో అయివుంటారు. 8 కోట్లకు పైగా ఫాలోవర్లతో కోహ్లి ఈ వర్గం కిందికి వస్తాడు. కృత్తికా ఖురానాలాగా నానో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మొదలు పెట్టి మెగా ఇన్‌ఫ్లుయెన్సర్లుగానూ ఎదగవచ్చు.

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.