దోశను ముక్కలుగా కోసి, ఆ కట్ దోశలతో చేసే కొత్తు చిల్లీ దోశను అలాగే తినొచ్చు.. లేదా అన్నం చపాతీలతో నంజుకోవచ్చు. అయితే, ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి...
కావాల్సినవి
దోశలు - అయిదు, నూనె - మూడు పెద్ద చెంచాలు, పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి), అల్లంవెల్లుల్లి ముద్ద - పెద్ద చెంచా, పెద్ద టొమాటో - ఒకటి (ముక్కలుగా కోసుకోవాలి), పచ్చిమిరపకాయలు - రెండు (చిన్నగా కోసుకోవాలి), ధనియాల పొడి - పెద్ద చెంచా, కారం - పెద్ద చెంచా, జీలకర్ర పొడి - అర చెంచా, పసుపు - పావు చెంచా, నిమ్మరసం - పెద్ద చెంచా, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - అయిదు చెంచాలు.
తయారీ
దోశలను నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఉల్లిపాయలు వేసి లేత బంగారవర్ణం వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వాసన పోయేవరకు వేయించాలి. పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కొత్తిమీర కలిపి మంట తగ్గించాలి.
టొమాటో ముక్కలు మగ్గాక పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడులను వేసి బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారై... నూనె పైకి తేలేవరకు సన్ననిమంటపై ఉంచాలి. కోసిపెట్టుకున్న దోశ ముక్కలను ఈ టొమాటో కూరలో కలిపి, కొత్తిమీరతో అలంకరించాలి. రెండు నిమిషాలాగి దింపేసి నిమ్మరసం పిండాలి. దీన్ని ఉల్లిపాయముక్కలతో వేడివేడిగా తినొచ్చు.
ఇదీ చదవండి : పాస్తాతో కొత్తగా 'ఫ్రైడ్ రవియోలి' నోరూరించగా....