డ్రైఫ్రూట్స్ లడ్డూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేసుకోవడం మాత్రం ఎంతో ఈజీ....
కావల్సినవి
యాభై గ్రాముల చొప్పున బాదం, కాజు, పిస్తా, వాల్‌నట్స్, కిస్‌మిస్, అంజీరా, ఖర్జూరం, నెయ్యి - అర కప్పు, యాలకుల పొడి - పెద్ద చెంచా.
తయారీ
మొదట పొయ్యి మీద పాన్ పెట్టి చెంచా నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో బాదం, కాజు, పిస్తా, వాల్‌నట్స్ వేసి వేయించాలి. ఆ తరువాత వాటిని మిక్సీలోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మరోసారి చెంచా నెయ్యి వేసి కిస్‌మిస్, అంజీరా, ఖర్జూరం వేయించుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టాలి. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరువాత మిగిలిన నెయ్యి, యాలకుల పొడి వేసి ఉండల్లా చేసుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ.
ఇదీ చదవండి: గణనాథుడికీ ఇమ్యూనిటీ పెంచే రెసిపీస్!