సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదురుతున్న నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు మాజీ నిఘా అధికారి జయదేవ రనడే. 2017లో డోక్లాం తరహా వివాదానికి దారితీసే అవకాశాలున్నట్లు వస్తున్న సంకేతాలపై ఆయన స్పందించారు. ఈటీవీ భారత్ సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. చైనా భద్రతా దళాలు దూకుడు పెంచడానికి కారణాన్ని వివరించారు. పశ్చిమ ప్రాంతంలో భారత్‌పై ఒత్తిడి పెంచి పైచేయి సాధించేందుకు ప్రయత్నించాలని చైనా భావిస్తున్నట్లు రనడే అభిప్రాయపడ్డారు. ఆ దేశ రక్షణ దళాలకు స్వయానా ఆ దేశాధ్యక్షుడి నుంచే సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు.
దృష్టి మరల్చేందుకే...
"కరోనా చైనాలోని వుహాన్‌లో పుట్టిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల దాదాపు 120కిపైగా దేశాలు కలిసి ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ విమర్శలను పక్కదారి పట్టించేందుకు వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలను ఓ అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది చైనా. ఆసియాలో తమ అధిపత్యం ప్రదర్శించేందుకు అతిపెద్ద దేశమైన భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇప్పటికే చైనాలోనూ జిన్‌పింగ్ ప్రభుత్వంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తన ఆధిపత్యం కాపాడుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు చైనా దేశాధ్యక్షుడు. 2049 నాటికి అగ్రరాజ్యం అమెరికా కంటే శక్తిమంతమైన దేశంగా తయారవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారు.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం చైనాకు ఇష్టంలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ పట్టు పెంచుకోవడం వల్ల పాక్-చైనా మధ్య వాణిజ్యానికి ఇబ్బందులు తప్పవని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్... తైవాన్‌తో కీలకంగా వ్యవహరించాలి. భారత్ ఆ దేశంతో సత్సంబంధాలు మరింతగా మెరుగుపర్చుకోవడం ద్వారా చైనాకు చెక్ పెట్టొచ్చు" అని అభిప్రాయపడ్డారు జయదేవ.
2008లో కేబినెట్ సెక్రటేరియట్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రనడే... జాతీయ రక్షణ సలహా బోర్డులోనూ సభ్యుడిగా పనిచేశారు.