రెండు తెలుగు వార్తా ఛానళ్ల మీద ప్రాథమిక అభియోగ పత్రాన్ని (ఎఫ్‌ఐఆర్) కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ మే నెల 31న సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తాము విమర్శనాత్మక వార్తలు, కథనాలను ప్రసారం చేసినందు వల్ల పత్రికా స్వేచ్ఛను నులిమేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రెండు ఛానళ్లు వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది రాజద్రోహ చర్యేనని స్పష్టం చేసింది. దీంతో రాజద్రోహం అంటే ఏమిటో నిర్దిష్టంగా నిర్వచించాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆ నిర్వచన పరిధులనూ తేల్చాలన్నది.
1962లో కేదార్‌నాథ్ సింగ్ వెర్సస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం రాజద్రోహానికి నిర్వచనమిచ్చింది. దాన్ని 1995లో బల్వంత్ సింగ్ వెర్సస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులోనూ, నేడు వినోద్ దువా వెర్సస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేసులోనూ తు.చ. తప్పకుండా అమలు చేశారు. అయినా రాజద్రోహ చట్టానికి మళ్లీమళ్లీ భాష్యం చెప్పాల్సిన అవసరమేమిటో అర్థం కాదు. ఒక అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని కోర్టులన్నీ శిరసా వహించాల్సిందేనని 141వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటిస్తోంది. సుప్రీంకోర్టు భాష్యం పాత్రికేయులకు, సమాచార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వాధికారులు, పోలీసులు, కోర్టులకు శిరోధార్యం. అలాంటప్పుడు కేసు కేసుకూ మళ్లీ మళ్లీ భాష్యం చెప్పాల్సిన అవసరం ఏముంది?
నిరాకరించినప్పుడే సమస్య
సమస్య అంతా కొన్ని అధికార సంస్థలు చట్టాన్ని పాటించడానికి నిరాకరించినప్పుడే వస్తుంది. 'ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి, వ్యాఖ్యానించడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. అయితే అది చట్ట పరిధిలోనే జరగాలి. ప్రభుత్వంపై హింసకు దిగేలా రెచ్చగొట్టడం, సమాజంలో అలజడి సృష్టించడం వంటి చర్యలకు ప్రజలను ఈ విమర్శలు, వ్యాఖ్యలు ప్రేరేపించకూడదు' అని కేదార్‌నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా తమ మాటలు, రాతల ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూసినా, సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించినా చట్టం కలగజేసుకుని, ఆ ప్రయత్నాలను నిలువరిస్తుందని ఉద్ఘాటించింది. ఏతావతా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగించాలని, సమాజంలో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే రాజద్రోహ నిరోధ చట్టం వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తేటతెల్లం చేసింది. అందులో సందిగ్ధతకు తావు లేదు.
కానీ, వాస్తవ జీవితంలోకి వస్తే ఈ తీర్పును అన్వయిస్తున్న పద్ధతి గందరగోళంగా ఉందని చెప్పకతప్పదు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని లేక విధానాన్ని విమర్శిస్తూ ఒక పాత్రికేయుడు లేక టీవీ ఛానల్ ఏదైనా వార్తా కథనాన్ని ప్రచురిస్తే, అది రాజద్రోహ చర్య అంటూ ఎవరైనా కేసు పెట్టారనుకోండి. ఆ అభియోగం చట్ట ప్రకారం రాజద్రోహం కిందకు వస్తుందా లేక కేవలం భిన్నాభిప్రాయమా అన్నది పోలీసు అధికారి తేల్చుకోవాలి. దీనికి సంబంధించిన చట్టం గురించి ఆయనకు తెలిసి ఉండాలి, తెలియదంటే కుదరదు. ఒకవేళ పోలీసు అధికారికి అన్నీ తెలిసి కూడా ఫిర్యాదుపై చర్య తీసుకుని కేసు దాఖలు చేస్తే, ఆ అధికారిని నియంత్రించేది ఎవరు? 1962 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఆ పోలీసు అధికారిని ఆపలేకపోతే, 2021నాటి తీర్పు నిలువరిస్తుందా? అన్నీ తెలిసి కూడా కేసు పెట్టి నిందితుడిని అరెస్టు చేస్తానంటే అడ్డుకునేది ఎవరు? పోలీసు అధికారి సమయస్ఫూర్తిని ప్రదర్శించకపోతే దురదృష్టకర పరిణామాలు ఎన్నయినా జరుగుతాయి. నిర్దోషి అరెస్టు, అతడి వ్యక్తిగత స్వేచ్ఛ హరణం, ప్రాథమిక హక్కు అయిన భావప్రకటన స్వేచ్ఛ నిరాకరణ వంటివి జరిగిపోతాయి. ఇలాంటి వాటిని నివారించాలంటే పోలీసు అధికారిని తన చర్యలకు జవాబుదారీ చేయాలి. లేదంటే సుప్రీంకోర్టు ఎన్నిసార్లు భాష్యం చెప్పినా, రాజద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేయడం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక నిందితుడు నిజంగా రాజద్రోహానికి పాల్పడ్డారా లేదా అన్నది తేల్చడానికి న్యాయమూర్తి స్వీయ విచక్షణ ఉపయోగించాలి. ఆ తరవాతే చట్టప్రకారం రిమాండు ఉత్తర్వు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించాలి. దురదృష్టవశాత్తు, చాలా కేసుల్లో ఇలా జరగడం లేదు. పౌరుల భావప్రకటన హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం న్యాయవ్యవస్థ బాధ్యత. ఈ ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉంది. ఆషామాషీగా కానీ, చపలచిత్తంతో కానీ ఒక పౌరుడిపై రాజద్రోహ ఆరోపణ వచ్చినప్పుడు న్యాయమూర్తి వెనకాముందూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి తప్ప పౌరుడి స్వేచ్ఛను హరించకూడదు. వినోద్ దువా కేసులో ఇలాంటి ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడం గుర్తుంచుకోవలసిన విషయం.
జాగ్రత్తగా పరిశీలించాలి
అయితే అన్ని సందర్భాల్లో ఇలా జరగడం లేదు. న్యాయవ్యవస్థ పొరబడిన సందర్భాలు ఉన్నాయి. ఫలితంగా ఎందరో విద్యార్థులు, పాత్రికేయులు, కార్టూనిస్టులు, రాజకీయవాదులు, అసమ్మతివాదులు నెలల తరబడి జైలులో మగ్గాల్సి వచ్చింది. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రాన్ని వర్తింపజేయలేం కాబట్టి, న్యాయమూర్తులు తమ ముందుకు వచ్చిన ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించాలి. చట్టాన్ని సమయస్ఫూర్తితో, స్వీయ విచక్షణతో అవగాహన చేసుకుని తీర్పు చెప్పాలి. అంతేతప్ప ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పదేపదే వల్లెవేస్తూ కూర్చోరాదు. యాంత్రికంగా అన్వయించకూడదు. దేశంలో రాజద్రోహం కేసులు ఆ ఏటికాయేడు పెరిగిపోతున్నాయని జాతీయ నేర గణాంకాల సంస్థ రికార్డులు తెలుపుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన వేలమంది వ్యక్తులు రాజద్రోహ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక హక్కు అయిన భావప్రకటన స్వేచ్ఛను కోల్పోతున్నారు. కోర్టుల్లో వారి కేసులు తేలడానికి ఏళ్లూపూళ్లూ పడుతోంది. వారి భవిష్యత్తు అగమ్యగోచరమవుతోంది. పోలీసు అధికారులు చట్టాన్ని సక్రమంగా అర్థంచేసుకుంటే ఎవరిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలో, ఎవరిపై చేయకూడదో తేల్చుకోగలిగేవారు. ఫలితంగా చాలా ఎఫ్‌ఐఆర్‌లు అసలు దాఖలు కాకుండా పోయేవి, కోర్టుల సమయమూ ఆదా అయ్యేది. పౌరులకు అనవసర నిర్బంధం తప్పేది. పోలీసులు ఇలా జాగరూకత ప్రదర్శించకపోవడం వల్లే చాలామంది నెలల తరబడి జైళ్లలో కాలం గడపాల్సి వస్తోంది. ఇకనైనా పోలీసులు, ప్రాసిక్యూషన్, ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలి. తాము చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తే పౌరులు అవస్థల పాలవుతారని గ్రహించాలి. కానీ, వాస్తవంలో జరుగుతున్నది దీనికి భిన్నం. రాజ్యవ్యవస్థ తనకు పోయేదేమీ లేదు కాబట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూనే ఉంది. జవాబుదారీ వహిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. పౌరుల ప్రాథమిక హక్కులకు పూచీ ఉంటుంది.
-జస్టిస్ మదన్ బి.లోకూర్
(రచయిత-సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి)
ఇవీ చూడండి: