What Is Women Reservation Bill: చట్ట సభల్లో ఓ బిల్లు ఆమోదం పొందాలంటే దానికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ ఆ మెజారిటీ మాత్రమే సరిపోదని.. ఆమోదించాలన్న చిత్తశుద్ధి కూడా ఉండాలని నిరూపిస్తోంది మహిళా రిజర్వేషన్ల బిల్లు. దేశంలోని మెజారిటీ పార్టీల మద్దతున్నప్పటికీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ బిల్లు 27 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది. వాస్తవానికి సామాజికంగా వెనుకబడిన వారికి స్వాతంత్య్రానంతరం రిజర్వేషన్ల రూపంలో కొత్త అవకాశాలు వస్తే భారతీయ మహిళలు మాత్రం ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారు. ఇందుకు కారణాలేంటి? అసలు ఈ బిల్లు చరిత్రేంటి? దీని కోసం ఎవరి ప్రయత్నాలు ఏంటో ఓ సారి చూద్దాం..
తొలి బిల్లు దేవెగౌడ చేతుల మీదుగా..
Women Reservation Bill In Lok Sabha : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును తొలిసారిగా 1996లో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన అప్పటి ప్రధాని దేవెగౌడ దీనికి సంబంధించి 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టినప్పటికీ అది అప్పుడు ఆమోదం పొందలేదు. అధికార సంకీర్ణ కూటమిలో ఉన్న ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్‌లు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఫలితంగా దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అధ్యయనం కోసం నివేదించారు. ఇక 1996 డిసెంబరులో కమిటీ తన నివేదికను సమర్పించింది. అంతలోనే లోక్‌సభ రద్దవడం వల్ల ఆ బిల్లు కాస్త ఆమోదం పొందకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత 1997లో గుజ్రాల్ ప్రభుత్వంలోనూ బిల్లు పెట్టినప్పటికీ.. మళ్లీ అధికార కూటమిలోని పార్టీలు అడ్డుకోవడం.. అంతలోనే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల గుజ్రాల్ సర్కార్ అమాంతం కూలడం.. బిల్లు అటకెక్కటం ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.
వాజ్‌పేయీ విఫలయత్నం
Women Reservation Bill History : దాదాపు రెండేళ్ల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా బిల్లును లోక్‌సభలో పెట్టింది. కానీ ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడ్డ ఈ సర్కారు దాన్ని ఏమీ చేయలేకపోయింది. అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న నీతీశ్ కుమార్ స్వయంగా ఈ బిల్లును వ్యతిరేకించారు. 1999లో అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణ వల్ల వాజ్‌పేయీ సర్కారు పడిపోయింది. దీంతో మహిళల బిల్లు కథ కంచికి చేరింది. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయీ.. పట్టవదలని విక్రమార్కుడిలా బిల్లును మరోసారి చట్ట సభల్లో ప్రవేశపెట్టారు. కానీ వివిధ పార్టీల్లోని ఓబీసీ నేతలు దాన్ని ముందుకు సాగనివ్వలేదు. దీంతో 2003లో మరోమారు వాజ్‌పేయీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. కానీ చట్టం కావడానికి అవసరమైన మద్దతును మాత్రం ఆ ప్రభుత్వం సంపాదించలేకపోయింది.
భాజపా, కాంగ్రెస్, కామ్రేడ్లు కలిసిన వేళ..
2008లో మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ సర్కార్.. మహిళా బిల్లును లోక్‌సభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బీజేపీ, వామపక్షాలు మద్దతివ్వడం వల్ల పెద్దల సభలో ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన బలం సమకూరింది. కానీ.. లాలు, ములాయంలు మరోసారి అడ్డుపడటం ఆరంభించారు. ఓబీసీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని పట్టుబట్టారు. అంటే రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కావాలని వారి ఉద్దేశం. 'ప్రస్తుత బిల్లు.. నా శవం మీదుగానే ఆమోదం పొందాల్సి ఉంటుంది' అంటూ లాలు ప్రకటించారు. అయితే 2008 మే లో ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించారు. బృందా కారాట్, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్.. ఈ ముగ్గురూ కలిసి పార్టీలకు అతీతంగా యాదవ్ నేతల ద్వయాన్ని బలంగా అడ్డుకోవడం వల్ల 2010 మార్చి 9న అనూహ్యంగా ఈ బిల్లును రాజ్యసభ 186-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. అలా కాంగ్రెస్, వాపక్షాలు, బీజేపీ కలిసి నడిచిన అరుదైన సందర్భాన్ని అప్పటి సభ చూసింది. కానీ లోక్‌సభలో బిల్లు చర్చకు మాత్రం రాలేదు. 2014లో సభ గడువు ముగియడం వల్ల అది పనికిరాకుండానే పోయింది.
పీవీ సర్కారుతో షురూ..
Women Reservation Bill Origin : 1987లో రాజీవ్ గాంధీ సర్కారు.. దేశంలో మహిళల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అప్పటి కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మహిళలకు జాతీయ విధానం అంటూ ఓ నివేదికను సమర్పించింది. అందులో 353 సిఫార్సులు ఉన్నాయి. వాటిలో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో పాటు మహిళలకు ఆస్తి హక్కు, చట్టసభల్లో కొన్ని సీట్లు కేటాయించాలని అందులో సూచించారు. పంచాయతీలు, నగర పాలికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లకు ఉద్దేశించి 1989లో రాజ్యాసభ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే లోక్‌సభలో ఆమోదించినప్పటికీ రాజ్యసభలో రాజీవ్ సర్కారు విఫలమైంది. కానీ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆ బిల్లులను 1993లో మళ్లీ ప్రవేశ పెట్టి ఆమోదం పొందారు. అవి చట్టాలుగా మారి ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 40 శాతం పైగా మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది.
స్వాతంత్య్రానికి పూర్వం..
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు భారత్‌లో స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1935 చట్టం రాష్ట్రాల చట్ట సభల్లో 41 సీట్లు, సెంట్రల్ లెజిస్లేచర్‌లో పరిమిత సీట్లను మతాల వారీగా మహిళలకు కేటాయించింది. అదీ వివాహితలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇది మహిళలపై ప్రేమతో, గౌరవంతో ఇచ్చిందేమీ కాదు. విభజించు పాలించు సూత్రంలో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మహిళలను దూరం చేసేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ . దేశంలోని మహిళలందరికీ ఓటు హక్కు ఇవ్వడానికి కూడా అంగీకరించని ఆంగ్లేయులు చట్ట సభల్లో సీట్లు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం అదే. అందుకే ఆఖరికి మహిళా సంఘాలే ఈ రిజర్వేషన్లు తమకు వద్దని నినదించాయి.
రాజ్యాంగ సభలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నాం కాబట్టి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో చట్ట సభల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది. భారత మహిళలకు సమానత్వం కావాలి తప్ప రిజర్వేషన్లు కాదంటూ పూర్ణిమా బెనర్జీ, సరోజిని నాయుడు, రేణుకా రేలు రాజ్యాంగ సభలో వాదించారు. అందుకే 1935 చట్టంలో ఉన్న అనేక అంశాలు స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలో భాగమైనా మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లను తొలగించారు.