ETV Bharat / opinion

అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిస్తే ఏమవుతుంది? - trump vs biden news

వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్​లో ఎవరు గెలుస్తారోనన్న విషయంపై యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ట్రంప్ మళ్లీ గెలిస్తే అంతర్జాతీయ సంబంధాలు క్షీణిస్తాయా? భారత్​కు నష్టమా? లాభమా? నిపుణుల విశ్లేషణ మీకోసం..

US ELECTIONS
అమెరికా అధ్యక్షుడు
author img

By

Published : Oct 18, 2020, 6:39 AM IST

నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్‌ ప్రపంచం మీద దీర్ఘకాల ప్రభావం కనబరుస్తాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ గెలిచినట్లయితే అంతర్జాతీయ వైరుధ్యాలు తీవ్రతరమవుతాయని, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలిస్తే ప్రపంచ దేశాల మధ్య సరికొత్త సహకార శకం మొదలవుతుందని సూత్రీకరణలు వినిపిస్తున్నాయి.

ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష పదవి చేపడితే తన దురుసు పంథా మార్చుకోవచ్చు అనేవారూ ఉన్నారు. అమెరికాకు ఉన్న బృహత్తర స్వదేశీ మార్కెట్‌, పారిశ్రామిక, సైనిక శక్తి, డాలర్‌ ప్రాబల్యాన్ని ఆధారంగా చేసుకుని ట్రంప్‌.. చైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లతో గట్టిగా బేరమాడి గరిష్ఠ ప్రయోజనం సాధిస్తారని వారి అంచనా. కానీ దౌత్యాన్ని, అంతర్జాతీయ సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో చూస్తే, అగ్ర రాజ్యంగా అమెరికా తనకున్న గౌరవాన్ని తానే పోగొట్టుకొంటుంది. ట్రంప్‌ జమానాలో జరిగింది అదే. ఎవరి స్వార్థం వారు చూసుకోవడాన్ని ఒక విధానంగా ముందుకు తెచ్చారాయన.

కలిసికట్టు విధానాలు సందేహాస్పదం

ప్రపంచ దేశాలు కలిసి కుదుర్చుకున్న పారిస్‌ వాతావరణ ఒప్పందానికి ట్రంప్‌ నీళ్లు వదిలారు. ఇరాన్‌ అణు ఒప్పందాన్ని, విశాల పసిఫిక్‌ వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి వైదొలగారు. తద్వారా ట్రంప్‌ తనకు అంతర్జాతీయ సహకారం, ప్రమాణాల మీద ఏమాత్రం గౌరవం లేదని నిరూపించుకున్నారు.

ఇంతలో కొవిడ్‌ విరుచుకుపడి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే, దాన్ని ఎదుర్కోవడానికి నాయకత్వం వహించాల్సిందిపోయి- ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతానని ట్రంప్‌ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత బహుళపక్ష సహకారానికి సారథిగా వ్యవహరించిన అమెరికా, ట్రంప్‌ మూలంగా ఆ పాత్ర నుంచి వైదొలగుతోంది. ఇది తాత్కాలిక అపశ్రుతి కావచ్చునని, ట్రంప్‌ బదులు వేరే అధ్యక్షుడు పగ్గాలు చేపడితే పరిస్థితి మారవచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

ట్రంప్ ఓడిపోవాలని..

ఇటీవల ఏడు ఐరోపా దేశాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు ట్రంప్‌ ఓడిపోవాలని కోరుకున్నారు. ఒకవేళ ట్రంప్‌ మళ్ళీ గెలిస్తే ఇతర దేశాలు అమెరికా మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడటం మానేసి తామే బహుళ ధ్రువ ప్రపంచ సృష్టికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితికి రాజకీయాలు, వ్యాపార పోటీ, భౌగోళికంగా అంతరాలు మాత్రమే కారణాలు కావు. 5జీ, కృత్రిమ మేధ, త్రీడీ ప్రింటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి సాంకేతికతలతో ఆవిర్భవించే డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో అగ్ర స్థానం కోసం పోటీయే ప్రధాన కారణం.

డిజిటల్ యుద్ధం..

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఆపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి టెక్‌ సంస్థలు డిజిటల్‌ రంగంలో అగ్రగాములుగా ఉన్నాయి. వీటికి చైనా కంపెనీల నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు, ఐరోపా సమాఖ్య (ఈయూ) అమెరికా టెక్‌ కంపెనీల ఇష్టారాజ్యానికి చెక్‌ పెట్టే నియంత్రణల చట్రాన్ని రూపొందించింది. డిజిటల్‌ ఆధిపత్యం కోసం అమెరికా చైనాతోపాటు ఐరోపా సమాఖ్య (ఈయూ) మీదా టారిఫ్‌ యుద్ధాన్ని ప్రారంభించింది. దీనివల్ల చైనా, ఈయూ దేశాలు దగ్గరవుతున్నాయి.

ట్రంప్‌ రెండోసారి గెలిస్తే ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి ధర్మపన్నాలు పలకకుండా ఫక్తు వ్యాపారిలా అన్ని విషయాల్లో లాభం కోసం చూసుకుంటారు. కానీ, తన దురుసు ప్రవర్తనతో చిరకాల మిత్ర దేశాలను దూరం చేసుకున్నందువల్ల ఆయన ప్రయత్నాలు ఆశించినంతగా సఫలం కాకపోవచ్చు.

బైడెన్​ వస్తే..

ఒకవేళ బైడెన్‌ గెలిస్తే చైనాలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి పట్టు పడతారు. ద్వైపాక్షిక వ్యాపారం, టెక్నాలజీ, పారిశ్రామిక విధానాలపై విభేదాలు అలానే కొనసాగుతాయి.

ఐరోపా, ఆసియాలలో ట్రంప్‌ వల్ల దూరమైన చిరకాల మిత్రదేశాలను మాత్రం బైడెన్‌ మళ్ళీ అక్కున చేర్చుకుంటారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉమ్మడి విలువలు, ప్రమాణాలను, పరస్పర సహకారాన్ని నెలకొల్పుకోవడానికి కృషి చేస్తాయి. డేటా మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ పన్ను విధానం మీద ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్ళీ చేరి కొవిడ్‌పై ఉమ్మడి పోరు సాగిస్తుంది. పారిస్‌ వాతావరణ ఒప్పందంలోకీ తిరిగివస్తుంది.

భారత్‌కు ఎవరైతే మేలు?

‘అమెరికా, భారత్‌లు 2020కల్లా ప్రపంచంలో అత్యంత అనుంగు మిత్రదేశాలుగా వర్ధిల్లాలి. అదే నా కల’ అని గతంలో ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్‌ చెప్పారు. భారత్‌-అమెరికాల మధ్య అణు సహకార ఒప్పందం కుదరడానికి ఆయన తోడ్పడ్డారు. అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తరవాత, భారత్‌కు అన్నివిధాలుగా అండగా నిలబడతానని ఒక సందర్భంలో హామీ ఇచ్చారు.

సరిహద్దుల్లో భారత్‌ ఎదుర్కొంటున్న ముప్పులను అధిగమించడానికి తోడ్పడతానన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు. అదే సమయంలో కశ్మీరీల హక్కుల పునరుద్ధరణ గురించి, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), అసోం జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ల గురించి బైడెన్‌ వ్యాఖ్యలు ఎన్డీయే ప్రభుత్వానికి అప్రియంగా తోచవచ్చు. అయితే, ఈ పొరపొచ్చాలను చర్చలతో పరిష్కరించుకోవచ్చునని డెమోక్రటిక్‌ పార్టీ ముఖ్యులు హామీ ఇచ్చారు.

ప్రతిభావంతులకే వీసాలు!

హెచ్‌ 1బీ వీసాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించబోనని, గ్రీన్‌ కార్డుల విషయంలో దేశాలవారీ కోటాలు ఎత్తివేస్తానని బైడెన్‌ ప్రకటించినా, నిజంగా ప్రతిభావంతులకే హెచ్‌ 1బీ వీసాలు ఇవ్వాలనే విధానాన్ని ట్రంప్‌, బైడెన్‌ ఇరువురూ పాటించబోతున్నారు. ట్రంప్‌ భారతదేశం పట్ల అభిమానం ఒలకబోసినా- వ్యాపారపరంగా కానీ, హెచ్‌ 1బీ వీసాలపరంగా కానీ మనకు ఒరగబెట్టిందేమీ లేదు. ఏతావతా బైడెన్‌ ఎన్నికైనా, ట్రంప్‌ ఎన్నికైనా భారత్‌పై వరాల వాన ఏమీ కురవదు. చైనా విషయంలో మాత్రం భారత్‌, అమెరికాలు ఒక్కటిగా వ్యవహరించవచ్చు.

తప్పని ‘జాతీయ’ రాగం

మారిన పరిస్థితుల్లో ట్రంప్‌ మాత్రమే కాదు, బైడెన్‌ కూడా ఆర్థిక జాతీయవాదాన్ని ఆలపించక తప్పదని కొందరి అంచనా. అదే జరిగితే- ప్రపంచం క్రమంగా అమెరికా, చైనా, ఈయూ శిబిరాల కింద విడిపోయే అవకాశం ఉంది. అమెరికా నాయకత్వంలోని ఏక ధ్రువ ప్రపంచం కాస్తా బహుళ ధ్రువ జగతిగా మారవచ్చు. ఈయూ కనుక ఐరోపా దేశాలన్నింటినీ ఏక తాటిపై నడిపించలేకపోతే- ప్రపంచం అమెరికా, చైనాల మధ్య రెండు ధ్రువాలుగా చీలిపోవచ్చు. అప్పుడు ఆ రెండు దేశాల మధ్య టెక్నాలజీ పరంగా ప్రచ్ఛన్న యుద్ధం రేగి, ఏదో ఒక దశలో బహిరంగ యుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు. ట్రంప్‌, బైడెన్‌లలో ఎవరు గెలిచినా అమెరికా ఆధిక్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకమానరు.

(రచయిత- ఏఏవీ ప్రసాద్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.