కాస్తంత ఉపశమించిందని ఊపిరి పీల్చుకున్నంత సేపు పట్టలేదు.. కొవిడ్ మహమ్మారి మళ్ళీ కసిగా కోరసాచడానికి! నిరుడు అక్టోబరు 11 తరవాత అత్యధికంగా ఆదివారం నాడు 68 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంతక్రితం ఎన్నడూ లేనంతగా మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 40,414 కేసులు వెలుగు చూడటం- పట్టపగ్గాల్లేని కరోనా ఉద్ధృతిని కళ్లకు కడుతోంది. ఈ నెలలో కేసుల ఉరవడిలో 71 శాతం, మరణాల్లో 69 శాతం కేవలం 46 జిల్లాల్లోనే నమోదవుతున్నాయన్న కేంద్ర సర్కారు అందులో పాతిక జిల్లాలు మహారాష్ట్రలోనే ఉన్నాయని నిర్ధారిస్తోంది.
వారితోనే చిక్కంతా!
ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు కోటీ 21 లక్షల మందికి సోకి, లక్షా 62 వేలమంది అభాగ్యుల్ని బలిగొన్న కొవిడ్ కొత్త ఉత్పరివర్తనాలతో విరుచుకుపడితే తట్టుకోగల శక్తి అటు ఆరోగ్య వ్యవస్థలకు, ఇటు జనసామాన్యానికీ లేదు. కొవిడ్ బలిగొన్నవారిలో 95 శాతం 45 ఏళ్లు పైబడిన వారేనని తేలడంతో ఎల్లుండి నుంచి ఆ వయోవర్గం వారందరికీ టీకాలివ్వాలని నిర్ణయించిన కేంద్రం- కరోనా పుంజాలు తెంచుకోవడానికి గల కారణాలనూ ఏకరువు పెట్టింది. మాస్కులు, శానిటైజర్లు, రెండు గజాల దూరం వంటి జాగ్రత్తలు పాటిస్తే, 70 శాతం కేసుల్ని తగ్గించగల వీలున్నా- అవగాహన కలిగిన వారిలోనే 44 శాతం మాస్కులు పెట్టుకోకపోవడమే కొంపముంచుతోంది. ఒక్క కరోనా రోగితో 406 మందికి వ్యాధి విస్తరిస్తుందంటూ, కొవిడ్ నిర్ధారణ అయిన వ్యక్తి సంబంధీకుల్లో సగటున 30 మందిని గుర్తించి, పరీక్షించి, తొలి మూన్నాళ్లలోనే ఏకాంతంలో ఉంచాలన్న మార్గదర్శకాల్ని రాష్ట్రాలు విస్మరించే వీల్లేదు. మళ్ళీ లాక్‌డౌన్ విధించక తప్పదేమో అన్నట్లుగా మహారాష్ట్రలో పరిస్థితి విషమించడం చూసి, వీధుల్లో మాస్కులు ధరించకపోవడాన్ని శిక్షార్హ నేరంగా తెలంగాణ వంటివి ప్రకటించడంలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. నిరుడు అంతా అయోమయంలో కొట్టుమిట్టాడిన దేశానికి నేడు కొవిడ్ కొమ్ములు ఎలా విరవాలన్నదానిపై స్పష్టత ఉంది. సదవగాహనతో ప్రజాసమూహాలు, రాష్ట్ర ప్రభుత్వాలు; యుద్ధప్రాతిపదికన టీకాల ఉత్పత్తి, పంపిణీకి కేంద్రం కదలాల్సిన కీలక తరుణమిది!
లాక్‌డౌన్లు కాదు టీకా ఉత్పత్తిపై దృష్టి ముఖ్యం
వందేళ్ల క్రితం నాటి 'స్పానిష్ ఫ్లూ' వరసలోనే విరుచుకు పడుతున్న కొవిడ్ రెండో అల వచ్చే మే నెలాఖరుదాకా కొనసాగవచ్చునని, ఈసారి లాక్‌డౌన్లు కాకుండా టీకాల విస్తృతిపైనే దృష్టిపెట్టాలని నాలుగు రోజుల క్రితం ఎస్‌బీఐ నివేదించింది. రాజస్థాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్, హరియాణాల్లో 60 ఏళ్లు దాటిన వారిలో అయిదో వంతుకే టీకాలు అందగా- ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌లో అంతకంటే తక్కువగానే టీకా కార్యక్రమం సాగింది. దేశీయంగా వేసిన టీకాల కంటే, విదేశాలకే అధికంగా అందించామని ఐక్యరాజ్యసమితికి తెలిపిన కేంద్ర ప్రభుత్వం- ఇక్కడి గిరాకీకి తగ్గట్లుగా ఉత్పత్తి పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలి.
టీకా పంపిణీని నాలుగింతలు చేయాలి
కొవిడ్ ఉత్పాతాన్ని ఎదుర్కోవడంలో సాఫల్య వైఫల్యాలకు ఇజ్రాయెల్, బ్రెజిల్ రూపేణా మన కళ్లముందు రెండు ఉదాహరణలున్నాయి. నిరుడు మే నెలలోనే టీకాల కొనుగోలుకు సమకట్టిన ఇజ్రాయెల్ డిసెంబరు మూడోవారంలోనే వ్యాక్సినేషన్ మొదలుపెట్టి, నయానా భయానా పౌరుల్ని దారిలో పెట్టి, కొత్త ఉత్పరివర్తనాల ఉద్ధృతి తనదాకా రాకుండా జాగ్రత్తపడింది. అందుకు భిన్నంగా బ్రెజిల్ రోజుకు నాలుగు వేల మరణాలతో శోకాకులమై కుములుతోంది. ఆ దయనీయావస్థలోకి దేశం జారిపోరాదంటే- ప్రపంచ టీకాల ఉత్పత్తి కేంద్రంగా ఇండియాకు గల దశాబ్దాల అనుభవసారం ఆపత్సమయంలో అక్కరకొచ్చేలా కేంద్రం చురుకుగా కదలాలి. సమధిక టీకాల ఉత్పత్తి కోసం తగు ఆర్థిక సాయం అందించడంతోపాటు, వాటి తయారీకి అవసరపడే ముడి ఉత్పాదనలపై అమెరికా విధించిన ఆంక్షల్ని ఉపసంహరింపజేసేందుకూ మోదీ సర్కారు సిద్ధపడాలి. ఇప్పటికి ఆరు కోట్ల మందికే వ్యాక్సిన్లు వేసిన ఇండియా టీకా కార్యక్రమాన్ని నాలుగింతలు వేగవంతం చేయాల్సి ఉంది. అందుకు దీటుగా ప్రాణాధార టీకాల ఉత్పత్తిని మరెన్నో రెట్లు పెంచి, వృథాను అరికట్టి కరోనా నుంచి జనావళికి సార్వత్రిక రక్షాకవచం ఏర్పరచే కార్యాచరణ శీఘ్రతరం కావాలి!
ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్లో సామాజిక వ్యాప్తి దశకు కరోనా!