ETV Bharat / opinion

చైనాపై అమెరికా దూకుడు- తైవాన్ తరఫున వకాల్తా - అమెరికా తైవాన్ న్యూస్

అఫ్గాన్​లో ఇటీవలే బలగాలను ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం తాజాగా తైవాన్​పై దృష్టిని మరల్చింది. చెైనాకు వ్యతిరేకంగా తైవాన్​ రక్షణకు రంగంలోకి దిగుతామని చెబుతోంది. అమెరికా దూకుడు చర్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉదంతాలు ఎలాంటి పరిణామాల దిశగా సాగుతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

china, america
అమెరికా, చైనా
author img

By

Published : Nov 12, 2021, 6:56 AM IST

చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌ రక్షణకు తాము రంగంలోకి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల చేసిన ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. దీనికితోడు, తాజాగా తైవాన్‌లో అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం చేపట్టిన పర్యటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ సమీపంలో సైనిక కసరత్తు చేపట్టింది. ఈ ఉదంతాలు ఎలాంటి పరిణామాల దిశగా సాగుతాయనేది ఆసక్తికరం. ఇటీవలే అఫ్గానిస్థాన్‌ నుంచి దళాల్ని ఉపసంహరించుకున్న అమెరికా తాజాగా తైవాన్‌పై దృష్టిపెట్టడం గమనార్హం. అఫ్గాన్‌లో తరచూ జరుగుతున్న ఆత్మాహుతి దాడుల వెనక అమెరికా హస్తముందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. చైనాను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. 'ఉగ్రవాదంపై గ్లోబల్‌ యుద్ధం' పేరిట ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అమెరికా- కొరియా, వియత్నాం, ఇరాక్‌, సిరియా తదితర దేశాల్లో ఇలాంటి కార్యకలాపాలకే పాల్పడింది. చాలాచోట్ల చావుతప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో బయటపడింది. అఫ్గాన్‌లోనూ అతికష్టమ్మీద పరువు కాపాడుకొనే రీతిలో నిష్క్రమించింది. అత్యాధునిక ఆయుధ, మేధాసంపత్తి సొంతమని చెప్పుకొనే అమెరికా వ్యూహాలు ఏ దేశంలోనూ పెద్దగా ఫలించినట్లుగా కనిపించడం లేదు.

ఎక్కడి నుంచి ఎక్కడికి?

రెండో ప్రపంచ యుద్ధం తరవాత- కొరియా నుంచి మొదలుపెట్టి తాజాగా అఫ్గాన్‌ దాకా అమెరికా జరిపిన యుద్ధ వ్యవహారాల్లో అగ్రరాజ్యం సాధించిందేమిటనేది ఇప్పుడు ప్రపంచం ముందు పెద్ద ప్రశ్నగా మిగిలింది. 1950ల్లో వామపక్ష ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ దక్షిణ కొరియా తరఫున అమెరికా బరిలోకి దిగి, మూడేళ్ల పాటు యుద్ధంలో పాల్గొంది. 70 ఏళ్లు గడిచాక తరచి చూస్తే- అగ్రరాజ్యం సాధించిందేమీ లేదు. చైనా అండతో ఉత్తరకొరియా మనుగడ సాగిస్తూనే ఉంది. ఆ తరవాత కమ్యూనిజం, క్యాపిటలిజం మధ్య సంఘర్షణతో 1955లో వియత్నాం యుద్ధం మొదలైంది. అమెరికా కదం కలిపింది. దక్షిణ వియత్నామ్‌కు ఆర్థిక, ఆయుధ, మార్గదర్శక సహకారాలు అందించింది. ఉత్తర వియత్నాం గెలిస్తే ఆసియా వ్యాప్తంగా కమ్యూనిజం వ్యాపిస్తుందన్న ఆందోళనతో అగ్రరాజ్యం నేరుగా రంగంలోకి దిగింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు శక్తియుక్తులన్నింటినీ మోహరించినా, అటవీ గెరిల్లా పోరును తాళలేకపోయింది. నీరుగారిన అమెరికా దళాలు 1973లో పరాజయ భారంతో నిష్క్రమించాయి. చివరికి 1976లో ఉత్తర, దక్షిణ వియత్నాం విలీనమయ్యాయి. అమెరికాకు శూన్యహస్తాలే మిగిలాయి. 1980ల్లో ఇరాన్‌లో ఖొమైనీని ఓడించేందుకు సద్దామ్‌ను, అఫ్గాన్‌లో సోవియట్‌ను తరిమేందుకు ముజాహిదీన్లకు అమెరికా అండగా నిలిచింది. అగ్రరాజ్యం సహాయం పొందిన సద్దాం చివరకు కువైట్‌పైకి దాడికి దిగిన ఫలితంగా గల్ఫ్‌లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి.

అఫ్గాన్‌లో అమెరికా ముజాహిదీన్లను చేరదీసి చేసిన సహాయంలోనే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాదానికి బీజాలు పడ్డాయి. తాలిబన్లు పుట్టుకొచ్చారు. లాడెన్‌, అల్‌ఖైదా అంకురించాయి. అఫ్గాన్‌నుంచి సోవియట్‌ బయటికి వెళ్ళిన తరవాత ఇలాంటి ఉగ్రశక్తులు పాశ్చాత్య నాగరిక దేశాలపై దృష్టిమరల్చాయి. ఫలితంగా ప్రపంచమంతా ఉగ్రదాడులతో మోతెక్కింది. ఇలాంటి పరిణామాలన్నింటితో పాకిస్థాన్‌- ప్రపంచానికే ఉగ్రవాద కర్మాగారంగా మారింది. అలా పుట్టుకొచ్చిన అల్‌ఖైదా 2001లో 9/11 దాడులకు దిగడంతో అమెరికా తిరిగి అఫ్గాన్‌లో అడుగుపెట్టింది. ఉగ్రవాదంపై యుద్ధం మొదలుపెట్టింది. ఒకప్పుడు తాము శిక్షణ ఇచ్చి, ఆయుధాలిచ్చి, డబ్బులిచ్చి పెంచి పోషించిన వారికి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమైంది. మరోవైపు, సామూహిక హననానికి పాల్పడే ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇరాక్‌పై పోరుకు దిగి సద్దామ్‌ను పట్టి ఉరితీసింది. తదుపరి ఆ దేశం ఏళ్లపాటు వర్గపోరులో చిక్కింది. శాంతి, సుస్థిరత కరవై, నాయకత్వ సంక్షోభంతో ఉగ్రవాదులకు పురిటిగడ్డగా మారింది. ఆ క్రమంలోనే అల్‌ఖైదాను మించిన రీతిలో మరింత భీకర ఉగ్రసంస్థ- ఐఎస్‌ఐఎస్‌ జీవం పోసుకుంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఐరోపాల వ్యాప్తంగా అది మారణకాండకు తెగబడింది. ఇరాక్‌ ఉదంతం అమెరికా వైఫల్యానికి మరోపెద్ద సాక్షీభూతమైంది. ఇదేక్రమంలో ఒబామా ఆదేశాలపై నాటో దళాలు లిబియా నేత గడాఫీని గద్దెదించడంతో ఆ దేశంలో అస్థిరత చోటుచేసుకొంది. గడాఫీ మరణంతో అంతర్యుద్ధం చెలరేగి, ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఆ ప్రభావం మాలి వంటి పొరుగు దేశాలపైనా పడింది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అషద్‌ను గద్దె దించేందుకు సీఐఏ పన్నాగంతో అంతర్యుద్ధంలో చిక్కిన ఆ దేశంలో రావణకాష్ఠం ఇప్పటికీ ఆరలేదు. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాల్లో నియంతలకు అధికారాలు కట్టబెట్టడం, మధ్య అమెరికాలో ప్రచ్ఛన్న యుద్ధాలకు ఆజ్యం పోయడం వంటి దుష్కృత్యాల కారణంగా అవి ఇప్పటికీ కోలుకోలేదు.

ఆత్మపరిశీలనకు సమయమిది..

ఆధునికతను, అభివృద్ధిని అందిస్తామంటూ పేద దేశాలకు హామీలు గుప్పించి, వారిని అస్థిరతలోకి నెట్టి అర్ధాంతరంగా జారుకోవడం అమెరికాకు దాని మిత్రపక్షాలకు అలవాటుగా మారింది. ఇరాక్‌ నుంచి అఫ్గాన్‌దాకా ఇదే తరహా తంతు అంతులేని కథలా కొనసాగింది. అమెరికా అధ్యక్ష పీఠంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరు కూర్చున్నా ఆధిపత్య భావజాలాన్ని వీడకపోవడం, ప్రతి రాజకీయ సమస్యకూ సైనిక జోక్యం, సీఐఏను రంగంలోకి దించి అస్థిరతను సృష్టించడమే విధానంగా పెట్టుకోవడం సమస్యగా మారుతోంది. ఇలాంటి తత్వం కారణంగానే- అఫ్గాన్‌ ప్రజాస్వామిక ప్రభుత్వంలో భాగస్వాములం అవుతామంటూ 2002లో తాలిబన్లు ముందుకు వచ్చినా, అమెరికా తిరస్కరించింది. ఆనాడు అలాంటి నిర్ణయం తీసుకోకపోతే, బహుశా ఇప్పటి పరిస్థితులు మరింత మెరుగ్గా ఉండేవనడంలో సందేహం లేదు. యుద్ధాలంటే కేవలం అత్యాధునిక ఆయుధ సంపత్తిని, పాటవాల్ని ప్రదర్శించడం మాత్రమే కాదని, ఆధునిక యుద్ధవ్యూహాలు మారిపోయాయన్న సంగతిని గుర్తించాలి. విభిన్న దేశాలు, అక్కడి సమాజాలు, సంస్కృతులు, అలవాట్లు, ఆలోచనలను అర్థం చేసుకోవడంపై అమెరికా విధాన రూపకర్తల ఉదాసీనతకు ఆ దేశం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అమెరికా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సామర్థ్యంపై అనుమానాలు

ఇతర దేశాల దళాలకు, సైనిక నాయకత్వ నైపుణ్యంపై అమెరికా సైన్యం ఇచ్చే శిక్షణపైనా ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. అమెరికా శిక్షణ పొందిన ఇరాక్‌, అఫ్గాన్‌ బలగాలు ప్రత్యర్థుల ముందు తేలిపోవడం అనుమానాలకు బలమిస్తోంది. మరోవైపు, చైనా నుంచి అంతకంతకూ ముప్పు పెరుగుతుండటంతో ఆ దేశంపై మరింతగా దృష్టి కేంద్రీకరించేందుకే అఫ్గాన్‌ నుంచి బయటపడినట్లు అమెరికా చెబుతోంది. అఫ్గాన్‌లో రెండు దశాబ్దాల పాటు తన సామర్థ్యాలన్నింటినీ వెచ్చించినా పూర్తి విజయం సాధించలేక అగ్రరాజ్యం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో చైనాను ఎదిరించేందుకు ప్రజాస్వామిక ప్రపంచం తరఫున పోరాడే సత్తా అమెరికాకు ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

-- శ్రీనివాస్‌.డి

ఇదీ చదవండి:

గుప్పుమంటున్న గంజాయి- యథేచ్ఛగా సాగు, రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.