సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లయిన భారత్‌లో వివాహ వ్యవస్థకు బీటలు పడుతున్న సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాశ్చాత్యులు మన కుటుంబ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు పెద్దపీట వేస్తూ అనుసరిస్తున్నారు. పాశ్చాత్య ధోరణులకు అనుగుణంగా వ్యవహరిస్తూ- అదే ప్రగతి అన్నట్లుగా వ్యవహరించడం బాధాకరం. వ్యవసాయాధారితమైన మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సైతం కాలానికి అనుగుణంగా చిన్న కుటుంబాలుగా మారాయి. చిన్న కుటుంబాలు కూడా వైవాహికేతర సంబంధాలతో చిన్నాభిన్నమవుతున్నాయి. ఇలాంటి సంబంధాల మోజులో రక్త సంబంధాలను కాలరాయడం శోచనీయం.
'ఎన్‌సీఆర్‌బీ' ప్రకారం
వైవాహికేతర సంబంధాలు ప్రమాదకరమైన సామాజిక సమస్యగా పరిణమించాయి. రహస్య సంబంధాల కారణంగా భయంకరమైన హత్యలు, దాడులు, అపహరణలతోపాటు అనేక ఘోరమైన నేరాలు జరుగుతున్నాయని; అవి రోజు రోజుకూ భయంకరంగా పెరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ప్రేమ వ్యవహారాలు, వైవాహికేతర సంబంధాలు హత్యలకు అతిపెద్ద కారణమని, వీటివల్ల నేరాల శాతం పెరిగినట్లు స్పష్టం చేశాయి. ఇలాంటి సంబంధాలు పెరగడానికి రకరకాల కారణాలు దోహద పడుతున్నాయి. కొంతమంది యుక్తవయస్సు రాగానే పెళ్లి చేసుకొని, జీవితంలో స్థాయి, స్థిరత్వం వచ్చాక, జీవితాన్ని ఆస్వాదించలేదని భావిస్తారు. శారీరక, మానసిక బలహీనత, ఆర్థిక పరమైన, శారీరక అసంతృప్తి, కాంక్ష, భావోద్వేగాలు, ప్రాధాన్య వైవిధ్యాలు, ఉత్సాహం, విసుగు, మార్పు, కొత్తదనాన్ని కోరుకోవడం, భాగస్వామికి తగిన విలువ ఇవ్వకపోవడం, ఆసక్తులు పంచుకోకపోవడం, తగిన సమయాన్ని కేటాయించకపోవడం ఇలాంటివి ఇతర వ్యక్తుల ఆకర్షణలో పడటానికి కారణమై వైవాహికేతర సంబంధాల్ని ఏర్పరచుకోవడానికి దారితీస్తున్నాయి.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానూ..
వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పొందే సాయాలు చాలాసార్లు వైవాహికేతర సంబంధాల బాటపడుతుంటాయి. ఉద్యోగంలో ఎదుగుదల కోసమూ ఇలాంటి సంబంధాల దిశగా సాగుతుంటారు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న అశ్లీల సాహిత్యం, వీడియోలూ ప్రేరణగా పనిచేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు సైతం అపరిచిత సంబంధాలకు దారితీస్తున్నాయి. ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్య సాధారణ అవసరాల కోసం ఉపయోగించే మాటలే తప్ప ఆప్యాయతలను పంచుకునే పలుకులే కరవయ్యాయి. ఫలితంగా బంధాలు బలహీనపడుతున్నాయి. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నా మానసికంగా ఎవరి దోవ వారిదే అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బయటి వ్యక్తులతో కొత్త బంధాలు పుడుతున్నాయి.
మచ్చుకు కొన్ని..
మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం... వైవాహికేతర సంబంధాల కారణంగా ఒక్క చెన్నై నగరంలోనే ఇటీవలి కాలంలో 28 హత్యలు జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో మరదలితో సంబంధం కారణంగా తమ్ముడిని చంపిన అన్న, సత్తెనపల్లిలో తన వైవాహికేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తొమ్మిదేళ్ల కుమారుడిని ప్రియుడితో కలిసి చంపిన తల్లి, ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి ఆ స్థానంలో ప్రియుడిని ఉంచాలని ప్రణాళిక రచించిన నాగర్‌కర్నూల్ మహిళవంటి ఉదంతాలన్నీ కొన్ని ఉదాహరణలే.
తాత్కాలిక ఆనందం కోసం..
వైవాహికేతర సంబంధాలు తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించినా, నష్టాలే అధికంగా ఉంటున్నాయి. వీటివల్ల తలెత్తే ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టం. సంబంధ బాంధవ్యాలూ కూలిపోతాయి. పిల్లలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. వారు అభద్రతా భావానికి లోనవుతారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు సున్నితత్వాన్ని కోల్పోయి, ఎవరికీ పూర్తిగా చేరువ అవ్వలేరని శాస్త్రీయంగా తేలింది. తల్లిదండ్రుల వైవాహికేతర సంబంధాల కారణంగా పిల్లల మానసిక స్థితుల్లో వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు మానసికంగా దుర్బలులై మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదాలు ఎక్కువ. వాటికోసం నేరాలకూ పాల్పడుతారు.
ఫ్యామిలీ కౌన్సిలింగ్ సౌకర్యాలతో..
న్యూయార్క్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం వైవాహికేతర సంబంధం మహిళల్లో గుండె జబ్బులకు, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రేనియా వంటి మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు నిర్ణయించేటప్పుడు అభిప్రాయాలు కలిసేలా జాగ్రత్తపడితే మనస్పర్ధలకు అవకాశం ఉండదు. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులుగా తమ బాంధవ్య వైఫల్యం పిల్లలకు శాపంగా మారుతుందన్న సంగతి గుర్తించి లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని తదనుగుణంగా ప్రవర్తన మార్చుకోవాలి. ప్రభుత్వం తగిన స్థాయిలో మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి మనస్తత్వ నిపుణులతో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ తరహా నేరాలను అరికట్టే అవకాశం ఉంది.
- షణ్మితా రాణి, రచయిత, బెంగళూరు 'నిమ్‌హాన్స్'లో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
ఇదీ చదవండి: 'భారత్ మాతా కీ జై' అంటే వారికి ఇష్టం లేదు: మోదీ