Universal health coverage India: ఆరోగ్యం సర్వ మానవాళికీ ప్రాథమిక హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఉద్ఘాటిస్తోంది. నేడు అన్ని దేశాలూ స్వాస్థ్య రక్షణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా 'అందరికీ ఆరోగ్యం' అందించే దిశగా పునరంకితం కావాలని పిలుపిస్తోంది. ప్రపంచంలో ప్రతి మనిషికీ నాణ్యమైన వైద్య, ఆవాస, ఉపశమన సేవలను జీవితకాలం ఉచితంగా అందించడం ప్రభుత్వాల బాధ్యత. సుశిక్షితులైన వైద్య సిబ్బంది తగినంతమంది అన్నివేళలా అందుబాటులో ఉంటే అత్యుత్తమ వైద్యసేవలు సాధ్యమవుతాయి. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఈ సేవలు లభించాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే- మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ చికిత్సలతో పాటు అత్యవసర సేవలనూ పటిష్ఠపరచే దిశగా వైద్య వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటేనే అందరికీ ఆరోగ్య భద్రత కల్పించగలమని అంటున్నారు.
వైద్యవ్యవస్థలోని నాలుగు ప్రధాన విభాగాల్లోని సేవలను అనివార్యంగా పటిష్ఠపరచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. పునరుత్పత్తి విభాగానికి చెందిన ప్రసూతి, కుటుంబ నియంత్రణ, తల్లీబిడ్డల వైద్యం, వ్యాధి నిరోధక టీకాలు వంటివి సమగ్రంగా అందించాలి. క్షయ, మలేరియా, ఎయిడ్స్ వంటి సాంక్రామిక వ్యాధుల నిర్మూలన కార్యక్రమాలు పటిష్ఠంగా అమలు కావాలి. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పొగాకు ఉత్పత్తుల వినియోగంపై ఆంక్షలు వంటివి మూడో విభాగానికి చెందినవి. నాలుగో విభాగం కింద సమర్థులైన వైద్య సిబ్బంది, వైద్య పరీక్షలు, మేలైన మందుల అందుబాటు అనివార్యం. తడిసి మోపెడవుతున్న వైద్య ఖర్చుల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రజలు పేదరికానికి చేరువవుతున్నారని, ప్రతి మనిషి సంపాదనలో పది శాతానికి పైనే వైద్య అవసరాలకు వినియోగించవలసి వస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ విశ్లేషిస్తోంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో అందరికీ ఆరోగ్యాన్ని అందించగలిగితే ఏటా అదనంగా ఆరు లక్షల ప్రాణాలను కాపాడవచ్చని అంటోంది. ఇది సాకారం కావాలంటే ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలపై సుమారు 30 వేల కోట్ల డాలర్ల మేర అదనపు పెట్టుబడులు సమకూర్చాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం ప్రతి దేశం తలసరి ఆదాయంలో ఒకశాతం అదనంగా ప్రభుత్వ వైద్య రంగానికి కేటాయించాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతిపాదిస్తోంది.
Challenges of universal health coverage: ప్రస్తుతం ప్రపంచ జనాభాలో కనీసం 50శాతం ప్రజలకు వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే లభ్యమవుతున్నాయి. 2030 నాటికి ప్రపంచానికి ఆరోగ్యపరమైన భరోసా కల్పించే దిశగా ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు 2015లో ఒక వేదికగా ఏర్పాటయ్యాయి. ఇందులో సుమారు 193 దేశాలు కలిసికట్టుగా పారదర్శకంగా వ్యూహాలు రచించుకుంటూ ప్రజారోగ్యంపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను రూపొందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి అందరికీ ఆరోగ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబాటు చాటుతోంది. సుమారు 50 కోట్ల భారతీయులకు వివిధ మార్గాల ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది. అధిక జనాభా, నిరక్షరాస్యత, వ్యాధుల సంక్రమణ తీవ్రత, వైద్య సిబ్బంది కొరత, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య వైద్యసేవల్లో నెలకొన్న వ్యత్యాసం తదితర సవాళ్లను అధిగమించాల్సి ఉంది. కొవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని- ప్రజారోగ్య వ్యవస్థలోని లోటు పాట్లను సరిదిద్దుకొని, నిలకడైన పురోగతిని యుద్ధ ప్రాతిపదికన సాధించాల్సిన తరుణమిది.
- ఆరుష్
ఇదీ చదవండి: