విశిష్ట విశ్వనగరంగా వెలుగొందాలని లక్షిస్తున్న హైదరాబాద్ కీర్తి సిగలో తాజాగా అరుదైన ఘనత జతపడింది. ప్రకృతిమాతకు పచ్చలహారాలు తొడుగుతున్న నిబద్ధ కృషికి గుర్తింపుగా ఆర్బర్ డే ఫౌండేషన్, ఐరాస ఆహార సేద్య సంస్థ(ఎఫ్‌ఏఓ) కలిసి వృక్షనగర హోదా ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 'కోటి వృక్షార్చన' కార్యక్రమం జయప్రదమైన మరునాడే, దక్షిణాసియాలో తొలిసారిగా భారత్ నుంచి ఒక్క భాగ్యనగరానికే ఈ విశేష గౌరవం దఖలుపడటం- హరితావరణాన్ని అభిలషించే అందరినీ ఉత్తేజపరచే పరిణామమే. ఆకుపచ్చని తెలంగాణ అవతరణను శీఘ్రతరం చేసే యత్నాల్లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ ప్రత్యేక చొరవ 2017 జులై లగాయతు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'గా చురుకందుకోవడం తెలిసిందే. ఇప్పటికి ఆరు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వ 'హరితహారం' కార్యాచరణలో, కోటి వృక్షార్చనలో సైతం అదే ఉత్సాహం తొణికిసలాడింది. చిత్రసీమకు చెందిన వారితోపాటు వివిధ రంగాల ప్రముఖులనుంచి గ్రామీణుల వరకు ఎందరో మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోవడం స్వాగతించదగింది.
పౌరుల భాగస్వామ్యమై..
విస్తృత ప్రాతిపదికన ఇలా మొక్కలు నాటి హరితఛాయను పెంపొందించడమన్నది ఏ కొందరి వ్యక్తిగత ప్రతిష్ఠకో సంబంధించిన రాజకీయ అజెండా కానే కాదు. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలకు, ప్రజారోగ్య పరిరక్షణకు, పర్యావరణ సమతూకానికి దోహదపడే బృహత్ యజ్ఞం. నాటిన ప్రతి మొక్కా నవనవలాడుతూ ఏపుగా ఎదిగేలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎవరూ ఎక్కడా విచ్చలవిడిగా చెట్లు నరికేయకుండా నిరోధించే విధివిధానాలు- పచ్చధనాన్ని పెంచిపోషించడంలో అత్యంత కీలకం. భాగ్యనగరానికి అంతర్జాతీయంగా లభించిన ఈ గుర్తింపు ఊరూరా, నగరాలన్నింటా ఆరోగ్యకరమైన పోటీని రగిలించాలి. హరిత భారతావని ఆవిష్కరణకు పౌరసమాజం క్రియాశీల భాగస్వామ్యమే నాంది పలకాలి!
ఆ 6 నగరాల్లో..
ఎక్కడికక్కడ భూమాతకు రంపపు కోత ఆగకుండా సాగుతున్న తరుణంలో, మొక్కల పెంపకం వ్యక్తిస్థాయిలో ఊపందుకొని సామాజికోద్యమంగా ఎదగడమే తరణోపాయమని పర్యావరణవేత్తలెందరో కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నారు. అందుకు తగిన మన్నన కొరవడబట్టే కాలుష్యభూతానికి కోరలు మొలుచుకొస్తున్నాయంటున్నాయి గణాంక వివరాలు. సూక్ష్మధూళికణాల రూపేణా వాయుకాలుష్యం గత సంవత్సరం దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, లఖ్‌నవూల్లోనే లక్షా 20వేల వరకు నిండుప్రాణాల్ని కబళించిందన్న గ్రీన్ పీస్ ఆగ్నేయాసియా అధ్యయనం- అనారోగ్య సమస్యల మూలాన ఆ ఆరు నగరాల్లోనే లక్షా 30వేలకోట్ల రూపాయల మేరకు ఆర్థికనష్టం వాటిల్లిందంటోంది. వాతావరణ మార్పుల తాలూకు దుష్ప్రభావాలు ప్రపంచం నలుమూలలా కనిపిస్తున్నా, వాటి కాటుకు అత్యధికంగా గురికాగల 67 దేశాల జాబితాలో ఇండియా ముందుంది.
అదే గ్రీన్ ఇండియా లక్ష్యం!
ఏటా 25 టన్నుల బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని రోజూ 60 కిలోల ప్రాణవాయువు విడుదల చేసేలా ఉత్తర చైనాలో అటవీ పెంపకం- అక్కడి క్షేత్రస్థాయి స్థితిగతుల్ని గణనీయంగా కుదుటపరచింది. ఒకప్పుడు 21 శాతానికే అటవీ ఆచ్ఛాదన పరిమితమైన కోస్టారికాలో అడవుల విస్తీర్ణం 52 శాతానికి పెరిగిందన్నా, బ్రెజిల్ 60శాతం హరిత ఛాయతో కళకళలాడుతోందన్నా- కాలుష్య కట్టడి నిమిత్తం వృక్షసంరక్షణ మహోద్యమంగా సాగడమే కారణం. శీతోష్ణస్థితి సమతౌల్యాన్ని కాపాడి, జలప్రవాహాల్ని క్రమబద్ధీకరించే పచ్చని చెట్లు, మానవాళి ఆరోగ్యకర భవితవ్యానికి నిచ్చెనమెట్లు. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్న నీతి ఆయోగ్ ప్రణాళిక, హరిత భారత స్వప్నం సాకారం కావాలన్న కేంద్రప్రభుత్వ సంకల్పదీక్ష దస్త్రాల్లోనే నీరోడకూడదు. వృక్ష నగరంగా హైదరాబాద్ సాధించిన ప్రగతి అన్ని జనావాసాలు, నగరాలు, రాష్ట్రాల్లోనూ పట్టుదల రగిలించడమే- 'గ్రీన్ ఇండియా' ఆవిష్కరణ వైపు పెద్ద ముందడుగు కాగలదు!
ఇదీ చదవండి: 'మంగళ్యాన్-2 సైతం ఒక ఆర్బిటరే'