కరోనా కట్టడే లక్ష్యమంటూ విధించిన లాక్‌డౌన్ల దరిమిలా అసంఖ్యాక శ్రమజీవుల బతుకులే తలకిందులయ్యాయి. అనూహ్యంగా మారిపోయిన స్థితిగతుల మూలాన విశ్వవ్యాప్తంగా జీవనోపాధి కోల్పోయినవారి సంఖ్య 270 కోట్లుగా ఐక్యరాజ్యసమితి నివేదిక నిగ్గుతేల్చింది. అందులో అసంఘటిత రంగ కార్మికులదే పెద్దవాటా. దేశంలో నిరుడు ఫిబ్రవరి నాటికి ఏదోఒక పని చేస్తూ పొట్టపోసుకుంటున్న నిత్య శ్రామికుల్లో మూడొంతుల మంది లాక్‌డౌన్ల వేళ వీధిన పడ్డారు. వారిలో 20 శాతందాకా గత అక్టోబరు-డిసెంబరు నాటికీ ఏ పనీ దొరక్క పస్తులతో గడిపే దురవస్థలో కుములుతున్నారు. ఆరు పౌర సంఘ సంస్థలతో కలిసి అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం 12 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనం వెల్లడిస్తున్న చేదునిజాలివి.
పోషకాహార లోపాలు..
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ, పశ్చిమ్ బంగ వంటిచోట్ల చేపట్టిన అధ్యయనం- లాక్‌డౌన్ల అనంతరం క్షేత్రస్థాయిలో చెదరని నైరాశ్య తీవ్రతను కళ్లకు కడుతోంది. సర్వే సమయానికి దారిద్య్రరేఖ దిగువన అలమటిస్తున్న మూడొంతుల కుటుంబాలకు దక్కాల్సిన వాటికన్నా ఆహార ధాన్యాల సరఫరాలు తరుగుపడ్డాయి. పర్యవసానంగా పోషకాహార లోపాలూ పెచ్చరిల్లుతున్నాయి. లాక్‌డౌన్ల ఉపసంహరణ తరవాతా తాము తీసుకునే ఆహార పరిమాణం పెరగనే లేదని పల్లెల్లో 15శాతం, పట్టణాల్లో 28శాతం కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదభరిత దృశ్యం ప్రభుత్వపరంగా తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది. కాలపరిమితి లేని ఉపాధికి హామీ ఇవ్వాలన్న డిమాండ్లు గతంలోనే వెలుగుచూశాయి. చల్లారని ఆకలి మంటల దృష్ట్యా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచడంతోపాటు, వాస్తవిక అవసరాలకు అనుగుణంగా పట్టణ ఉపాధి పథకానికీ రేపటి బడ్జెట్లో చోటు పెట్టాలన్న తాజా సూచనలు సహేతుకమైనవి.
పెరిగిన పేదరికం..
అనివార్య స్థితిలో విధించాల్సి వచ్చిన లాక్‌డౌన్ల కారణంగా పట్టణాల్లో 12 కోట్లమంది, పల్లెల్లో 28 కోట్లమంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారన్న విశ్లేషణలు ఆరు నెలల కిందటే కలకలం రేకెత్తించాయి. అటు తరవాతా కొవిడ్ మహోత్పాతం తాలూకు దుష్పరిణామాలు ప్రస్ఫుటమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బతుకుతెరువు కొల్లబోయి స్వస్థలాలకు పయనమైన కోట్లమంది వలసకూలీలకు, ఎందరో విద్యావంతులకు సైతం గ్రామీణ ఉపాధి హామీ కొండంత ఆదరువుగా మారింది. గత బడ్జెట్లో గ్రామీణ ఉపాధికి కేటాయించిన రూ.61వేలకోట్లకు అదనంగా రూ.40వేలకోట్లు జోడించక తప్పనివిధంగా పథకానికి విస్తృత ఆదరణ నమోదైంది. అయినా అనేక గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులు నిండుకున్నాయన్న వార్తాకథనాల నేపథ్యంలో- పథకం అమలును 200 రోజులకు పొడిగించి, మరో లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని అయిదు నెలలక్రితం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సూచించింది.
దేశార్థికం నెమ్మదిగా తేరుకుంటున్న దశలో- మళ్ళీ నగరాల బాటపట్టిన వలస కూలీల సంఖ్యా పెరుగుతోంది. నిర్మాణ రంగంలో దాదాపు 75 శాతం, ఆహార సేవలూ మరమ్మతు పనుల్లో సుమారు 86 శాతం, స్థిరాస్తి రంగాన 53 శాతందాకా అసంఘటిత రంగ కార్మికులేనని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వారి బతుకుతెరువుకు దారులు మూసుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజికార్థిక సంక్షోభాన్ని అధిగమించేలా పట్టణ ఉపాధి పథకాన్నీ ప్రభుత్వం చురుగ్గా పట్టాలకు ఎక్కించాలి. పనుల ఎంపిక, కార్యాచరణ, పర్యవేక్షణల పరంగా కంతలు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటే- ఆ చొరవ కోట్లాది బడుగుజీవులకు కొత్త ఊపిరులూదగలుగుతుంది!
ఇదీ చూడండి: మహమ్మారిపై ముప్పేట దాడి!- దేశంలో కొవిడ్‌కు ఏడాది