Ukraine russia news: ఇప్పటికే భీకర దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో- రష్యా రసాయనిక ఆయుధాలను ప్రయోగించే ముప్పుందంటూ అమెరికా తాజాగా చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని మాస్కో చెబుతున్నప్పటికీ.... ఈ అస్త్రాల వినియోగం విషయంలో మాస్కో గత చరిత్ర తెలిసిన అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. సంప్రదాయ ఆయుధాల కంటే రసాయనిక ఆయుధాలు మరింత వినాశకరమైనవి. ఒకప్పుడు శత్రు రాజ్యాల సైనికులను హతమార్చేందుకు బావుల వంటి జల వనరులను విషపూరితం చేసేవారు. ఇందుకోసం హానికర ఆర్సెనిక్‌ను ఎక్కువగా వినియోగించేవారు. కాలం గడిచేకొద్దీ రసాయనిక ఆయుధాలు మరింత పదునుతేలాయి. ప్రస్తుతం అనేక దేశాల వద్ద వాటి నిల్వలున్నాయి.
Chemical attack
క్షణాల్లో మరణం
రసాయనిక ఆయుధాలను తాకితే చర్మంపై, లోపలికి పీలిస్తే ఊపిరితిత్తుల్లో బొబ్బలు వస్తాయి. కళ్లలోకి ప్రవేశిస్తే అంధత్వం వస్తుంది. ఈ ఆయుధాలు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి మరణానికి కారణమవుతాయి. కొన్ని రకాలు మెదడు/ నాడీకణాల నుంచి కండరాలకు సమాచారం అందకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా శరీరమంతటా కండరాలు పనిచేయవు. శ్వాస ఆడక వ్యక్తులు మృత్యువాత పడతారు. మరికొన్ని రకాలు రక్తంలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని దెబ్బతీసి క్షణాల్లో ప్రాణాలను హరిస్తాయి. రసాయనిక ఆయుధాల కారణంగా యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని అమాయకులూ ప్రాణాలు విడిచే అవకాశాలు ఎక్కువ. స్వల్ప మోతాదులో దాడికి గురై ప్రాణాలతో బయటపడితే... భవిష్యత్ తరాలపై పలు రకాల దుష్ప్రభావాలు పడే ముప్పూ పొంచి ఉంటుంది.
Ukraine russia War
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మస్టర్డ్ గ్యాస్, క్లోరిన్‌లతో కూడిన బాంబులను ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అనేక మందిని గ్యాస్ ఛాంబర్లలో బంధించి దారుణంగా చంపారు. నిజానికి రసాయనిక, జీవ ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ 1925లోనే జెనీవా ఒప్పందం జరిగింది. కానీ, అది పకడ్బందీగా అమలుకు నోచుకోలేదు. 1980ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధం సహా పలు సందర్భాల్లో రసాయనిక అస్త్రాలను వినియోగించారు. ప్రపంచవ్యాప్తంగా రసాయనిక ఆయుధాల తయారీ, నిల్వ, వాడకాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 1997 నుంచి అమలులోకి వచ్చిన రసాయనిక ఆయుధాల ఒడంబడికపై 193 దేశాలు సంతకాలు చేశాయి. అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. అమెరికా సహా అనేక దేశాలు ఈ అస్త్రాలను పెద్దయెత్తున నిల్వ చేసుకున్నాయి. రసాయనిక ఆయుధాలను విమానాలు, శతఘ్నులు, క్షిపణుల ద్వారా ప్రయోగించవచ్చు.
ఉక్రెయిన్‌పై యుద్ధం ఆరంభించిన తొలినాళ్లలో మోర్టార్ షెల్‌లు, క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా... నిషేధిత వాక్యూమ్ బాంబులను సైతం ఇటీవల ప్రయోగించింది. మున్ముందు ఆ దేశం రసాయనిక ఆయుధాలను ఉపయోగించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2002లో రెండో చెచెన్ యుద్ధ సమయంలో రష్యన్లు ఈ అస్త్రాలను వాడారు. 2006లో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ మాజీ అధికారి అలెగ్జాండర్ లిత్విన్‌ఎంకోపై లండన్‌లో, 2018లో రష్యా మాజీ సైనికాధికారి సెర్గీ స్క్రీపల్‌పై సాలిస్బరీలో, 2020లో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీపై రష్యన్ ఏజెంట్లు రసాయనిక దాడులకు పాల్పడ్డారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో... మాస్కో మద్దతున్న బషర్ అల్ అసద్ ప్రభుత్వం స్వదేశీయులపైనే పలుమార్లు రసాయనిక దాడులకు తెగబడినట్లు ఆరోపణలున్నాయి. 2013లో సారిన్ వాయువుతో కూడిన రాకెట్లు సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఘూటా ప్రాంతాన్ని తాకాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి- వీధుల్లో కుప్పకూలిపోయారు. నోరు, ముక్కుల్లోంచి నురగలతో, ఊపిరాడక అసువులు బాశారు. ఆ దాడిలో 1,700 మంది వరకు మృతి చెంది ఉండవచ్చని అంచనా.
Russia war on ukraine
రష్యాలో భారీ నిల్వలు?
తమ దేశంలో 40 వేల టన్నుల రసాయనిక ఆయుధాలు ఉన్నాయని 1997లో రష్యా ప్రకటించింది. ఆపై సాలిస్బరీలో దాడి తమ పని కాదని మొండిగా వాదించిన మాస్కో- తమ వద్ద ఉన్న రసాయనిక ఆయుధాలను గతంలోనే నాశనం చేశామని చాలాకాలంగా చెబుతోంది. అయితే ఇప్పటికీ ఆ దేశం వద్ద భారీమొత్తంలో రసాయనిక ఆయుధాలు ఉన్నాయని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఒకప్పటి సోవియట్ యూనియన్ వద్ద ఆంత్రాక్స్, స్మాల్‌పాక్స్ వంటి జీవాయుధాలు చాలా ఎక్కువగా బయటపడ్డ సంగతినీ వారు గుర్తుచేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని ప్రయోగశాలల్లో అమెరికా సాయంతో రసాయనిక, జీవ ఆయుధాల అభివృద్ధి జరుగుతోందంటూ గత ఏడాది ఆరోపించిన మాస్కో... మళ్ళీ ఇటీవల అదే ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అత్యవసరంగా భేటీ కావాలని భద్రతామండలిని డిమాండ్ చేసింది. రష్యా ఆరోపణలను అమెరికా ఖండించింది. ఉక్రెయిన్‌లోని ప్రయోగశాలల విషయంలో హడావుడి చేస్తూ- ఆ ముసుగులోనే రసాయనిక దాడులకు తెగబడాలన్నది పుతిన్ సర్కారు ప్రణాళిక అని ఆరోపించింది. ఇరు దేశాల వాదోపవాదాలు ఎలా ఉన్నా- రష్యా ఆ అస్త్రాలను వినియోగిస్తే పెను నష్టం తప్పదన్నది మాత్రం కఠోర వాస్తవం!
- నవీన్ కుమార్
ఇదీ చదవండి: పుతిన్‌కు ఎలాన్ మస్క్ మరో ఛాలెంజ్.. ఈసారి..!