ETV Bharat / opinion

రక్షణరంగంలో స్వావలంబనకు అదే మార్గం!

చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'చైనాతో సరిహద్దు ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోలేదు' అని మహాదళాధిపతి బిపిన్‌ రావత్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. మరి చైనాను ఎదుర్కొనేందుకు భారత్​ ఆయుధాలు ​ సమకూర్చుకోగలదా?​

Tough efforts have begun to accelerate the domestic arms manufacturing process
రక్షణరంగంలో స్వావలంబనకు అదే మార్గం!
author img

By

Published : Nov 8, 2020, 9:14 AM IST

'చైనాతో భారీ సరిహద్దు ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోలేదు' అని మహాదళాధిపతి బిపిన్‌ రావత్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అదే క్రమంలో ఆయన ఆయుధ తయారీలో భారత్‌ స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధం ఉంది. చైనా వంటి దేశాలను స్వల్పకాల యుద్ధాల్లో బలంగా ఎదుర్కోవచ్చు. కానీ, అది దీర్ఘకాలిక యుద్ధంగా మారితే మాత్రం కష్టం. ఎందుకంటే చైనాలో ఆయుధాలు చాలా వరకు దేశీయ కర్మాగారాల్లో తయారవుతాయి. భారత్‌లో ఆ పరిస్థితి ఉందా? అప్పటికప్పుడు ఆయుధాల కొనుగోలు అనగానే విక్రేతలు ధరలను పెంచేయరా అనే సందేహాలు తలెత్తక మానవు.

వ్యూహాత్మక ఒప్పందాలు అవసరం

'కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత్‌ను ఆయుధ సరఫరాదారులు దోచుకున్నారు. ముందు చెప్పిన ఆయుధాలు కాకుండా, పాతవి సరఫరా చేశారు. కొన్ని దేశాలైతే వియత్నాం యుద్ధసమయం నాటి మందుగుండును అంటగట్టాయి' అని నాటి ఆర్మీ చీఫ్‌ వేద్‌ప్రకాశ్‌ మాలిక్‌ గత ఏడాది చండీగఢ్‌లో జరిగిన డిఫెన్స్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో వ్యాఖ్యానించారు! ఇది రక్షణ ఉత్పత్తుల్లో దేశ బలహీనతలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయుధ తయారీ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా గట్టి ప్రయత్నాలే మొదలయ్యాయి. ఆగస్టులో రక్షణ శాఖ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై అయిదు దశల్లో నిషేధం విధించింది. అందులో 2020తో ముగిసే తొలి దశలో తేలికపాటి యుద్ధ విమానాలు ఉండగా, 2025తో ముగిసే తుదివిడతలో ఉపరితలంపై దాడి చేసే క్రూయిజ్‌ క్షిపణులు ఉన్నాయి. శతఘ్నులు, క్షిపణి విధ్వంసక నౌకలు, నౌకలపై నుంచి ప్రయోగించే క్షిపణులు, తేలికపాటి రవాణా విమానాలు, సమాచార ఉపగ్రహాలు, శిక్షణ విమానాలు, బహుళ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్లు, రాడార్లు, రైఫిళ్లు, చిన్నపాటి డ్రోన్లు సైతం ఉన్నాయి.

మరోవైపు, భారత రక్షణ రంగ ఎఫ్‌డీఐలను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. రక్షణ ఆయుధ సేకరణ విధివిధానాలు-2020 గత నెల నుంచే అమలులోకి వచ్చింది. ఎఫ్‌డీఐల పరిమితి పెంచితే మనదేశంలో చౌకగా కార్మికశక్తి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడే కర్మాగారాలు పెడతారని భావిస్తున్నారు. కానీ, చాలా దేశాల్లో రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలు ఉన్నా- వాటిపై కఠిన నియంత్రణ ఉంటుంది. ఆయా దేశాలతో భారత్‌ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకొంటేనే అక్కడి కంపెనీలు పరిమిత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తరలించే అవకాశం ఉంది. వాటిని భవిష్యత్తు సాంకేతికత అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా మాత్రమే భారత్‌ వాడుకోవాలి. ఈ క్రమంలో సాంకేతికతను అర్థం చేసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మరోవైపు, ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డుపై విమర్శలు పెరిగాయి. ఈ సంస్థ సరఫరా చేసిన మందుగుండు వల్ల 2014 నుంచి 2020 వరకు 403 ప్రమాదాలు జరిగి 27 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ఆ సంస్థ పనితీరులో నాణ్యత, జవాబుదారీతనం, పోటీతత్వం పెంచే దిశగా యోచిస్తోంది. అదేవిధంగా రక్షణ రంగ పరిశోధన సంస్థ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించేందుకు వివిధ విభాగాలతో సంయుక్త ప్రాజెక్టు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

విదేశీ రక్షణ సంస్థలు భారత్‌లోనే తయారీ, పరిశోధనశాలలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్‌డీఐల పరిమితిని పెంచింది. దీనికి ముందుజాగ్రత్తగా 'జాతీయ భద్రత తనిఖీ' నిబంధనను జోడించింది. రష్యా వంటి వ్యూహాత్మక భాగస్వామితో కలిసి బ్రహ్మోస్‌ ప్రాజెక్టులో చేసిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కానీ, వాటి ఎగుమతులకు సంబంధించిన అనుమతులు రష్యా నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొంటూ దేశీయ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.

ఎగుమతులపై దృష్టేదీ?

యుద్ధతంత్రం వేగంగా మారిపోతుంటుంది. అందుకని తరవాతి తరం ఆయుధాల అభివృద్ధిపై మనం ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలి. లేజర్‌, సిగ్నల్‌ జామింగ్‌, డ్రోన్లు, హైపర్‌సోనిక్‌, సైబర్‌ ఆయుధాల అభివృద్ధిపై కృషిపెరగాలి. అప్పుడే భారత్‌ నుంచి రక్షణ ఎగుమతులూ ఇనుమడించే అవకాశం ఉంటుంది. ఇందుకు టర్కీయే మంచి ఉదాహరణ. ఆ దేశం యుద్ధవిమానాలు తయారు చేయకపోయినా- డ్రోన్లు, ఆయుధ శ్రేణి లేజర్లపై దృష్టి పెట్టింది. ఇప్పుడు అమెరికాతో పోటీపడే స్థాయికి చేరింది. భారత్‌లో అత్యాధునిక ఆయుధ పరీక్ష కేంద్రాల కొరత తీవ్రంగా ఉంది. ఉదాహరణకు కావేరి ఇంజిన్‌ పరీక్షల కోసం 1990 నుంచి రష్యాకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు పెద్దయెత్తున ఖర్చయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇతర ఆయుధాల అభివృద్ధి ప్రక్రియలో ఈ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. తాజాగా డీఆర్‌డీఓ 1,700 పేటెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది అంకుర పరిశ్రమలకు ఊతం అందిస్తుంది. పీహెచ్‌డీ చేస్తున్నవారిని సైతం రక్షణ పరిశోధనల్లో భాగస్వాములను చేసినట్లు డీఆర్‌డీఓ చెబుతోంది.

పుణేలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (డీఐఏటీ) ఏటా దాదాపు వెయ్యి మందికి శిక్షణ ఇస్తోంది. వీరిలో చాలామంది డీఆర్‌డీఓ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పరిశోధనలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చే విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం పెరగాలి. ఎక్కువమంది విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించాలి. చైనా జీడీపీలో నాలుగు శాతం మేర విద్యపై ఖర్చు పెట్టాలని 1993లోనే నిర్ణయించుకొంది. ఆ ఫలాలు అందేకొద్దీ క్రమంగా ఆ మొత్తం పెంచుతూ వచ్చింది. చైనా 2017లో తన జీడీపీలో తొమ్మిది శాతానికి పైగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకొంది. భారత్‌ తన జీడీపీలో ఆరు శాతం విద్యపై ఖర్చు పెట్టాలని 1968నాటి కొఠారీ కమిషన్‌ సిఫార్సు చేసినా, ఇప్పటికీ విద్యపై వ్యయం ఆ దరిదాపులకు చేరలేదు. ఈ తరహా మౌలిక సమస్యలను సరిదిద్దుకుంటేనే, భారత్‌ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా బలమైన అడుగులు వేసే అవకాశం ఉంది.

పోటీ పెరిగితేనే నాణ్యత

కేంద్ర ప్రభుత్వం భారత్‌లోనే ఉత్పత్తి అయ్యే ఆయుధాల కొనుగోలుకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.52 వేల కోట్లను కేటాయించింది. ఫలితంగా, వచ్చే అయిదేళ్లలో దేశీయ రక్షణ రంగ పరికరాలకు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆర్డర్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈసారి చేసిన కీలక మార్పుల్లో భాగంగా ఒక ఆయుధంలో ఉపయోగించిన దేశీయ విడిపరికరాల శాతాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. అదే సమయంలో ఈ మొత్తంలో సింహభాగం కేవలం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొనుగోళ్లకే కాకుండా ప్రైవేటు రంగ సంస్థల నుంచి నాణ్యమైన కొనుగోళ్లకు వెచ్చించాలి. అప్పుడే పోటీ పెరిగి కొత్త సంస్థలు పుట్టుకొస్తాయి.

- పెద్దింటి ఫణికిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.